అంతా అయిపోయింది....!

Update: 2018-01-18 15:30 GMT

తెలంగాణలో తెలుగుదేశం గత వైభవానికి తొందరలోనే తెరపడబోతోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. ఇంక మేము చేయగలిగింది ఏమీలేదు. రెండే ఆప్షన్లు ఎవరితోనైనా కలిసిపోవడం లేదా పొత్తు కోసం బేరాలాడుకోవడము, అంతే మిగిలింది. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా చేసిన టీటీడీపీ అగ్రనేత మోత్కుపల్లి నరసింహులు మాకిక తెలంగాణలో ఛాన్సు లేదని తేల్చేయడంతో ఒక్కసారిగా టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. వాస్తవము, అంచనా కలగలిసిన మోత్కుపల్లి మాటలు తెలుగుదేశం వర్గాలను డైలమాలో పడేశాయి. టీడీపీ భవిష్యత్తు నిజంగా భయంకరమేనా?ఇక ముందు అంతా అంధకారమేనా? గడచిన ఎన్నికల్లో పార్టీని విశ్వసించిన 40 లక్షల ఓటర్లు ఇకముందు అండగా నిలిచే అవకాశమే లేదా? డిపాజిట్లు గల్లంతవుతాయా? అన్నీ ప్రశ్నలే. కొంతకాలంగా గందరగోళంలో ఉన్న టీడీపీ క్యాడర్ నైతిక స్థైర్యం పూర్తిగా క్షీణించిపోయే విధంగా సాగుతున్న పరిణామాలు లాజికల్ ముగింపు దిశకు చేరుకుంటున్నట్లుగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

స్వయంకృతాపరాధాలతో...

2014 ఎన్నికల్లో మూడో అతిపెద్ద పక్షంగా తెలంగాణలో నిలిచిన టీడీపీ క్రమేపీ తన ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయింది. ఓటుకు నోటు కేసుతో నైతికంగా కూడా పతనావస్థకు చేరుకుంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా పార్టీ శాసనసభ్యులందరూ టీఆర్ఎస్ లో చేరిపోయారు. నిన్నామొన్నటివరకూ పోరాటం సాగించిన వర్కింగు ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెసులో చేరిపోవడంతో బలమైన వాయిస్ కూడా కోల్పోయింది. మిగిలిన నాయకులెవరూ రాష్ట్రస్థాయి ప్రభావం చూపగల స్థాయిలో లేరు. పార్టీకి టీఆర్ఎస్ తో పోరాడేంత శక్తి లేదన్న విషయం గ్రహించే రేవంత్ కాంగ్రెసును ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకున్నారు. అప్పట్నుంచి పార్టీ కూడా మానసికంగా టీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమవుతూ వస్తోంది. సీట్ల పంపకాలకు సంబంధించి చర్చలు కూడా సాగుతున్నట్లు సమాచారం వచ్చింది. టీడీపీ బలం బాగా క్షీణించిందని గ్రహించిన టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కనీస స్థాయిలో సీట్లు ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదనేది రాజకీయ వర్గాల సమాచారం. రేవంత్ నిష్క్రమణ తర్వాత ఒక సందర్బంలో చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ భవన్ సందర్శించి క్యాడర్ లో జోష్ తీసుకొచ్చారు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మళ్లీ టీటీడీపీ వైపు ఆయన తొంగి చూడలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ ఒత్తిడితో పార్టీ అధినాయకత్వం తెలంగాణవైపు ద్రుష్టి సారించలేకపోతోంది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి తెలంగాణలో పనేమిటన్న ప్రశ్నలూ తలెత్తాయి. పార్టీ రిలవెన్సూ దానితోపాటే తగ్గిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికికి అర్థం లేదనే వాదన పుంజుకోవడంతో నాయకులు, కార్యకర్తలు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు.

మోత్కుపల్లి తొందరపడ్డారా?...

సీనియర్ నేత మోత్కుపల్లి పార్టీ సిద్దాంతాలపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయనను తెలుగుదేశం తరఫున గవర్నర్ గిరికి నామినేట్ చేయించాలనే ప్రయత్నాలు కూడా సాగాయి. ఎందుకోగానీ ఆ ప్రయత్నాలు రెండుమూడేళ్లుగా ఫలించలేదు. దీంతో మోత్కుపల్లి కొంత అసంత్రుప్తికి కూడా గురయ్యారంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి పట్టుకోవడంలో అనుభవం గడించిన నరసింహులు చేదునిజాన్ని బయటపెట్టారని రాజకీయపరిశీలకులు పేర్కొంటున్నారు. కానీ వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం వల్ల పార్టీకి కొంత నష్టం చేకూర్చారని కూడా అంటున్నారు. నిజానికి టీఆర్ఎస్ తో పొత్తుకోసం టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం 20 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇస్తే పొత్తు కుదుర్చుకుంటామనే దిశలో ద్వితీయశ్రేణి నాయకుల స్థాయిలో ప్రతిపాదనలు మొదలయ్యాయి. కానీ టీడీపీకి అంత సీన్ లేదని కేసీఆర్ తొలిదశలోనే తోసి పుచ్చారు. రెడ్డి, దళిత కాంబినేషన్ లో కాంగ్రెసు క్రమంగా బలం పుంజుకొంటూ ఉండటంతో బీసీల మద్దతు ఉండే టీడీపీని కలుపుకుని పోవాలని తొలిదశలో కేసీఆర్ కూడా భావించారు. అయితే టీడీపీకి మద్దతు పడిపోతోందని టీఆర్ఎస్ సర్వేల్లో తేలింది. అందుకే సొంతంగా బలహీనవర్గాలకు చెందిన కులాలవారీ మద్దతును స్వయంగా సమీకరించుకునే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు కేసీఆర్. పైపెచ్చు టీడీపీకి కొన్ని సీట్లు ఇచ్చి నెగ్గించిన తర్వాత రాజకీయ సమీకరణాల్లో ఏమైనా తేడాలొస్తే టీఆర్ఎస్ బలహీనతలు బయటపడతాయనే భయం కూడా ఉంది. ఆంధ్రాపార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు టీఆర్ఎస్ పై స్థానికంగా కాంగ్రెసు రాజకీయ దాడి చేయవచ్చనే భావన కూడా కేసీఆర్ ను ముందడుగు వేయనీయలేదు.

ఆ అవసరం లేదు...

రాజకీయంగా తమకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని ఇండియాటుడే సదస్సులో కేసీఆర్ కుండబద్దలు కొట్టేశారు. దీంతో మిణుకుమిణుకు మంటున్న టీడీపీ నాయకుల ఆశలు ఆవిరైపోయాయి. ఏవో కొన్ని సీట్లు తీసుకుని టీఆర్ఎస్ తో జట్టుకట్టాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లేశారాయన. పోటీకి దిగితే ఒక్కసీటు కూడా స్వయంగా గెలుస్తామన్న నమ్మకం టీడీపీ శ్రేణుల్లో కనిపించడం లేదు. రేవంత్ ఉండుంటే పాత ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల్లో కొన్నిసీట్లలో బలమైన పక్షంగా పోటీకి తలపడే అవకాశం ఉండేదంటున్నారు. ఇప్పుడు పార్టీకి దిశానిర్దేశం చేసి ఫీల్డు లెవెల్ లో క్యాడర్ ను, లీడర్లను నడపగల నాయకత్వం లోపించింది. ఈ బలహీనతను ఆసరాగా తీసుకునే కేసీఆర్ టీడీపీకి టీఆర్ఎస్ తో విలీనం మినహా ప్రత్యామ్నాయం లేదని గ్రహించి మరింత బిగుసుకుంటున్నారు. ఇంకోవైపు టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవాలనుకుంటున్న విపక్షాలు అన్నీ ఏకమై కాంగ్రెసు గూటి కిందకు చేరడం అసాధ్యమని ఆయన గ్రహించారు. రెండు మూడు ఫ్రంటులుగా ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే టీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద బండి నడకే. తెలుగుదేశం పార్టీ తో పొత్తు కట్టకపోయినా పోయిందేమీలేదు. టీఆర్ఎస్ గెలుపునకు ఢోకా ఉండదు. ఈ ధైర్యంతోనే కేసీఆర్ టీడీపీ పొత్తు అవసరం లేదంటున్నారు. విలీనమైతే ఓకే. మళ్లీ సీట్ల పంపకం. ప్రత్యేక గుర్తు గొడవ ఉండదు. కావాలంటే ప్రస్తుత టీటీడీపీలో ముఖ్యనేతలకు టీఆర్ఎస్ తరఫున టిక్కెట్లకు గ్యారంటీ ఇవ్వవచ్చనే యోచనలో ఉన్నారు. దీంతో టీడీపీకి మరో గత్యంతరం కనిపించని పరిస్థితి. ఈ విషయాన్నే కొంచెం తొందరపడి మోత్కుపల్లి బయటపెట్టేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News