యాక్టివ్ కాలేకపోతున్నారే
రాజధాని గుంటూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ నేతలు ఏంచేస్తున్నారు? ముఖ్యంగా ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నప్పటికీ.. అంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ పార్టీని నడిపించడంలోనూ ఎందుకు [more]
రాజధాని గుంటూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ నేతలు ఏంచేస్తున్నారు? ముఖ్యంగా ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నప్పటికీ.. అంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ పార్టీని నడిపించడంలోనూ ఎందుకు [more]
రాజధాని గుంటూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ నేతలు ఏంచేస్తున్నారు? ముఖ్యంగా ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నప్పటికీ.. అంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ పార్టీని నడిపించడంలోనూ ఎందుకు వెనుకబడుతున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా రాజధాని కాకముందు కూడా రాజకీయంగా సంచలనాలకు వేదిక అయింది. టీడీపీ శ్రేణులు, కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు హల్‌చల్ చేశారు. పార్టీ ఏదైనా సరే.. అధికారంలో ఉండగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాకినేని పెదరత్తయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్ కోడెల శివప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వంటివారు ఇక్కడ చక్రం తిప్పిన వారే.. గుంటూరుకు రాజకీయ పాఠాలు నేర్పిన వారే.
ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా….
అయితే, ఇప్పుడు ఇదే జిల్లాలో అధికార పార్టీ వైసీపీలో స్తబ్దత ఏర్పడింది. ఎవరిని కదిపినా.. నిర్వేదం కనిపిస్తోంది. ఏం చేస్తాం.. గురూ.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అనే సమాధానమే వినిపిస్తోంది. దీంతో అసలు గుంటూరులో ఏం జరుగుతోందనే విషయం అందరికీ ఆసక్తిగా మారింది. ఇక్కడ నుంచి ఇద్దరు కీలక నాయకులు మంత్రులుగా జగన్ కేబినెట్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరిత రాష్ట్ర హోం మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆమె ఉపముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.
సీనియర్ అయినా….
ఇక, మోపిదేవి వెంకట రమణారావు కూడా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి రేపల్లె నుంచి ఓడిపోయినా.. జగన్ ఆశీస్సులతో మంత్రి పదవిని చేపట్టారు. ఈ ఇద్దరిలోనూ మోపిదేవి గతంలోనూ వైఎస్ హయాంలో మంత్రిగా చక్రం తిప్పారు. చాలా యాక్టివ్ లీడర్‌గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక, వైఎస్ కుటుంబానికి ఈ ఇద్దరు కూడా వీర విధేయులుగా గుర్తింపు సాధించారు. సుచరితకు మంత్రి పదవి కొత్త అయినా… మోపిదేవి సీనియర్ అయినా కూడా గతంలో ఉన్నంత యాక్టివ్‌గా ఉండడం లేదన్న చర్చలు సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
డీలా పడిన పార్టీ….
మోపిదేవి, సుచరిత ఇద్దరు ఇప్పుడు మంత్రి పీఠాలపై ఉండి కూడా కీలకమైన రాజధాని జిల్లాలో ఏమీ చేయలేక పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు వైసీపీ పరంగాను, ఇటు ప్రభుత్వ పరంగా వీరిద్దరూ పెద్దగా చురుగ్గా ఉండడం లేదని తెలుస్తోంది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ఈ ఇద్దరూ మాత్రం చోద్యం చూస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరిద్దరికీ అసలు స్వేచ్ఛ కూడా లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ ఒకింత డీలా పడింది.
సెట్ రైట్ కాదా?
అటు విపక్షం నుంచి జిల్లాలో ఘాటైన కౌంటర్లు వస్తున్నా వైసీపీ నేతలు ఎవ్వరూ స్పందించడం లేదు. మోపిదేవి మరీ సైలెంట్‌గా ఉండడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక అధికారులు కూడా తమకు అడిగేవారు ఎవరూ లేరనే ధోరణిలోనే ఉండడం గమనార్హం. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరి ధోరణి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు వీళ్లకు చెప్పినా వీరు పట్టించుకునే స్థితిలో లేరు. మరి ఎప్పటికి ఈ పరిస్థితి సెట్‌రైట్ అవుతుందో ? చూడాలి.