హైకమాండ్ పట్టించుకోవడం లేదుగా

గ‌తేడాది సాధార‌ణ ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌భూతో న‌భ‌విష్యతి అనే రేంజ్‌లో ఎంపీ స‌హా ఎమ్మెల్యే సీట్లను [more]

Update: 2020-03-01 15:30 GMT

గ‌తేడాది సాధార‌ణ ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌భూతో న‌భ‌విష్యతి అనే రేంజ్‌లో ఎంపీ స‌హా ఎమ్మెల్యే సీట్లను కైవ‌సం చేసుకుంది. రెండు మంత్రి ప‌ద‌వులు కూడా జ‌గ‌న్ కేటాయించారు. అయితే, ఇంత భారీ మెజారిటీసాధించిన ఈ జిల్లాలో ప్రతిప‌క్షం అంటూ వైసీపీకి ఎవ‌రూ లేరు. నిజానికి టీడీపీ ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్నప్పటికీ ఈ జిల్లాలో ఒక్క సీటంటే ఒక్కటి కూడా సాధించ‌లేక పోవ‌డం, ఉన్న నాయ‌కులు కూడా ఎవ‌రికి వారు స్తబ్దుగా ఉండ‌డం, ఒకే ఒక్కడుగా జిల్లాలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి కూడా ఇటీవ‌ల కాలంలో అనారోగ్యం కార‌ణంగా సైలెంట్ అయిపోయారు.

స్వపక్షంలోనే…….

దీంతో నెల్లూరులో వైసీపీకి ఎదురే లేకుండా పోయింది. పైగా విమ‌ర్శలు కూడా లేక పోవ‌డంతో పార్టీఊపిరి పీల్చుకుంటోంది. అయితే, ఇప్పుడు ఆ కొర‌త సొంత పార్టీ నాయ‌కులే అందునా సీనియ‌ర్లే పార్టీని బ‌జారున ప‌డేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి స‌హా స‌ర్వేప‌ల్లినుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న కాకాని గోవ‌ర్ధన్ రెడ్డిలు ఇద్దరూ కూడా స్వప‌క్షంలోనే విప‌క్షం లెక్క వ్యవ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ నేత‌ల్లోనే అంత‌ర్గతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

అధికారులపై వత్తిడి…

త‌మ త‌మ సొంత ప‌నులు చేయించుకోవ‌డంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు.అయితే, ఎంత అధికారంలో ఉన్నప్పటికీ అధికారులు ఆయా ప‌నులు చేసేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. వివిధ అనుమ‌తులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఈ విష‌యాలు తెలిసి కూడా ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అధికారుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా ప‌రోక్షంగా ప్రభుత్వ విధానాల‌పైనా విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.

అధిష్టానం మాత్రం….

అదే టైంలో జిల్లాకే చెందిన మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌పై సైతం వీరు ప‌రోక్షంగా త‌మ అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై అనిల్ ఇప్పటికే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. అటు జిల్లా స‌మీక్షా స‌మావేశాల నుంచి, జిల్లా అభివృద్ధి మండ‌లి స‌మావేశాల్లో సైతం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ లోపాలను ఆధారంగా చేసుకుని అధికారుల తీరుపై విమ‌ర్శలు చేస్తున్నారు. ఈ ప‌రిణామంతో వైసీపీ నాయ‌కులు ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నారు. ఇక‌,వీరిద్దరి అసంతృప్తికీ అనుకున్న విధంగా పార్టీలోను, ప్రభుత్వంలోనూ గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌డం కూడా మ‌రో కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి వీరి అసంతృప్తి ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News