అధికారమిస్తే అంతేగా

రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన క‌ర్నూలు జిల్లాలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా అన్ని చోట్లా ఫ్యాన్ గాలి జోరుగా సాగింది. [more]

Update: 2019-11-14 08:00 GMT

రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన క‌ర్నూలు జిల్లాలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా అన్ని చోట్లా ఫ్యాన్ గాలి జోరుగా సాగింది. జిల్లా చ‌రిత్రలోనే ఎప్పుడూ లేన‌ట్టుగా ఏకంగా 14 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో ఘ‌న‌విజ‌యం సాధించింది. అయితే, ఇప్పుడు ఇదే జిల్లాలో అధికార వైసీపీ నాయ‌కుల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జుల‌కు, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచిన నాయ‌కుల‌కు మ‌ధ్య ఫైట్ తీవ్రస్థాయిలో సాగుతోంది. దీంతో జిల్లా రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు నుంచి ఎన్నారై, మైనారిటీ వ‌ర్గానికి చెందిన మ‌హ‌మ్మద్ హ‌ఫీజ్ ఖాన్ ఈ ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, 2014లో ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఆధిప‌త్య రాజ‌కీయాలు చేస్తున్నారు.

ఎస్వీ దూకుడుతో….

నిజానికి 2014లో ఎస్వీ మోహ‌న్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచినా.. మ‌ధ్యలో భూమా వ‌ర్గంతోపాటు టీడీపీలో చేరిపోయారు. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శలు కూడా చేశాడు. అయితే, ఆయ‌న టీడీపీలో ఎంతో కాలం ఇమ‌డ‌లేక పోయారు. ఇక్కడ టికెట్‌ను త‌న‌కు కాకుండా చంద్రబాబు టీజీ వెంక‌టేష్ కుమారుడు భ‌ర‌త్‌కు కేటాయించ‌డంతో అలిగిన ఎస్వీ.. ఆ వెంట‌నే మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయినా కూడా అప్పటికే టికెట్ విష‌యంలో జ‌గ‌న్ నిర్ణయం తీసుకోవ‌డంతో ఆయ‌నకు ఆ ఛాన్స్ ల‌భించ‌లేదు. అయినా కూడా తానే ఎమ్మెల్యే అనే రేంజ్‌లో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి విష‌యంలోనూ వేలు పెడుతున్నార‌ని నాయ‌కులు ల‌బోదిబోమంటున్నారు. ఎస్వీ దూకుడుకు ప‌దే ప‌దే హ‌ఫీజ్ బ్రేకులు వేస్తున్నారు.

అధికారులకు ఆదేశాలు….

క‌ర్నూలు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో హ‌ఫీజ్ వార్డు యాత్రలు చేస్తున్నాడు. అయితే, న‌న్ను క‌ల‌పుకొని వెళ్లడం లేద‌ని ఎస్వీ ర‌గ‌డకు దిగుతుండ‌డంతో రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది. ఇక‌, అధికారుల‌ను పిలిచి అభివృద్ధికి సంబంధించిన అంచ‌నాలు కూడా ఎస్వీనే వేయిస్తుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు దారితీస్తోంది. దీనిని కూడా హ‌ఫీజ్ అడ్డుకుంటున్నారు. తాను ఎమ్మెల్యేను అయితే వేరే వాళ్లు చెప్పిన‌ట్టు మీరు అంచ‌నాలు ఎలా చేస్తార‌ని అధికారుల‌కు వార్నింగ్ ఇవ్వడంతో అధికారుల ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి చందంగా మారింది.

ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ ఛార్జి….

ఇక ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన నందికొట్కూరులోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్కడ నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆర్థర్ వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించాడు. అయితే, వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం అంతా త‌న క‌నుస‌న్నల్లోనే జ‌ర‌గాల‌నే ప‌ట్టుద‌ల ప్రద‌ర్శిస్తున్నాడు. దీంతో వీరిద్దరి మ‌ధ్య ప్రత్యక్షంగానే రాజ‌కీయ ఉప్పెన‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక‌సారి పార్టీ అధినేత జ‌గ‌న్ ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఇద్దరిలోనూ ఎక్కడా మార్పు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఒక‌రు, ఎమ్మెల్యేగా మ‌రొక‌రు ఉండ‌డంతో అధికారుల‌పై తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయి.

కోడుమూరులోనూ…..

అదే స‌మ‌యంలో కోడుమూరులోనూ ఎమ్మెల్యే సుధాక‌ర్‌, మాజీ ఎమ్మెల్యే ముర‌ళీకృష్ణ మ‌ధ్య పోటా పోటీ రాజ‌కీయం న‌డుస్తోంది. వీరిద్దరి మ‌ధ్యలో కోట్ల ఫ్యామిలీకి చెందిన కోట్ల హ‌రిచ‌క్రపాణి రెడ్డి కూడా ఓవ‌ర్గంగా ఏర్పడి ఆధిప‌త్యం కోసం త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ముర‌ళీకృష్ణ వైసీపీలో చేరి సీటు కోసం ప్రయ‌త్నాలు చేశారు. అయితే జ‌గ‌న్ మాత్రం క‌ర్నూలులో డాక్టర్‌గా ఉండే సుధాక‌ర్‌కు సీటు ఇచ్చారు. ఇక ముర‌ళీకృష్ణకు టీటీడీ మెంబ‌ర్ ఇచ్చారు. ఇప్పుడు ముర‌ళీకృష్ణ సైతం నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే హోదాలో త‌న వ‌ర్గాన్ని కాపాడుకుంటూ ప‌ట్టుకోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇది సుధాక‌ర్‌కు న‌చ్చడం లేదు. మ‌రోవైపు కోట్ల హ‌రిచ‌క్రపాణి సైతం తాను చెప్పిన ప‌నుల ఎమ్మెల్యే చేయాల‌ని డిమాండ్ చేస్తుండ‌డంతో అక్కడ రాజ‌కీయం కూడా ర‌స‌వ‌త్తరంగా మారింది. ఇలా గ్రూపు త‌గాదాల‌తో క‌ర్నూలు జిల్లా వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. వీటిని ఇలాగే వ‌దిలేస్తే పార్టీకి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో జ‌గ‌న్‌కు తిప్పలు త‌ప్పవు.

Tags:    

Similar News