తాము కాబట్టి గెలిచామన్న ధీమాతోనే కదా?

అధికార పార్టీ వైసీపీ అయినా.. మ‌రో పార్టీ అయినా.. సీనియ‌ర్లు.. జూనియ‌ర్ల క‌ల‌బోత‌గానే ఉంటుంది. అయితే, జూనియ‌ర్లు ఎప్పుడూ కూడా ఓ అడుగు వెన‌క్కి త‌గ్గి ఉండ‌డం [more]

Update: 2020-03-02 05:00 GMT

అధికార పార్టీ వైసీపీ అయినా.. మ‌రో పార్టీ అయినా.. సీనియ‌ర్లు.. జూనియ‌ర్ల క‌ల‌బోత‌గానే ఉంటుంది. అయితే, జూనియ‌ర్లు ఎప్పుడూ కూడా ఓ అడుగు వెన‌క్కి త‌గ్గి ఉండ‌డం అనేది రివాజు. సీనియ‌ర్లకు విలువ ఇస్తూ.. వారు చెప్పిన మేర‌కు ముందుకు సాగుతూ ఉంటారు. లేదా క‌నీసం స‌ల‌హాల కోస‌మైనా వారిని సంప్రదిస్తారు. అది కూడా కాదంటే వారితో విభేదించ‌కుండా మౌనం పాటిస్తారు. ఇది స‌హ‌జంగా రాజ‌కీయాల్లో క‌నిపించే ప‌రిణామం. అయితే, దీనికి భిన్నంగా వైసీపీలో రాజ‌కీయాలు క‌నిపిస్తుండ‌డం చ‌ర్చకు దారితీస్తోంది. అది కూడా రాజ‌ధాని జిల్లాగా ఉన్న గుంటూరులో సీనియ‌ర్లు మైన‌స్ అయిపోవ‌డంపై తీవ్ర గంద‌ర‌గోళంగా మారింది.

తొలిసారి గెలిచి…

జిల్లాలో మొత్తం 17 నియోజ‌క‌వ‌ర్గాలుఉన్నాయి. వీటిలో చిల‌క‌లూరిపేట‌, తాడికొండ‌, పొన్నూరు, గుర‌జాల‌, తెనాలి, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గాల్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన వారు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అయితే, వీరిలో పొన్నూరు, తెనాలి నియోజ‌క‌వ‌ర్గాల వారు సైలెంట్‌గా త‌మ ప‌ని తాము చేసుకుని పోతుండగా.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచిన వారు గ్రూపులు క‌ట్టి.. సీనియ‌ర్లను వేధిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వీరికి వైసీపీ ఎంపీల్లో కొంద‌రు హెల్ప్ చేస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. దీంతో జిల్లాలో వైసీపీ రాజ‌కీయ ర‌స‌కందాయంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇంఛార్జులను పక్కన పెట్టి….

చిల‌క‌లూరిపేట‌, తాడికొండ‌, గుర‌జాల‌, పెద‌కూర‌పాడు నియోజ‌క‌వర్గాల్లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు స‌మీక‌ర‌ణ‌లు అనూహ్యంగా మారిపోయాయి. ఈ క్రమంలో అప్పటి వ‌ర‌కు ఇంచార్జ్‌లుగా ఉన్న వారిని ప‌క్కన పెట్టి కొత్తవారికి అవ‌కాశం క‌ల్పించారు జ‌గ‌న్‌. దీంతో అప్పటి వ‌ర‌కు సీనియ‌ర్లుగా ఏళ్లత‌ర‌బ‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పి పార్టీని నిల‌బెట్టిన నాయ‌కులు త‌ప్పుకొని వీరికి ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు, వీరు గెలిచేందుకు కూడా నియోజ‌క‌వ‌ర్గాల్లో సాయం చేశారు. అయితే, ఓడ మ‌ల్లన్న సామెత మాదిరిగా ఈ నాయ‌కులు వ్యవ‌హ‌రిస్తుండ‌డంతో వైసీపీ సీనియ‌ర్లు గ‌డ‌ప దాట‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

వ్యక్తిగత ఇమేజ్ ను….

నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ గెలుపును ఈ జూనియ‌ర్లు పెద్దగా అంచ‌నా వేసుకుంటున్నారు. తాము కాబ‌ట్టి గెలిచాం.. అనే ధోర‌ణిని వ్యక్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ అండ‌తో గెలిచిన విష‌యాన్ని మ‌న‌నంలో పెట్టుకున్నా. సీనియ‌ర్లు ఇక్కడ వైసీపీని నిల‌బెట్టినందునే త‌మ‌కు ప్లాట్ ఫాం ఏర్పడింద‌నే విష‌యాన్ని పూర్తిగా విస్మరించారు. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పడం క‌ష్టం.. సో.. రేపు అధినేత ప్రభ త‌గ్గితే.. ఈ నేత‌లకు ప‌రిస్థితి ఏంటి? వ‌్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకునేందుకు అంద‌రినీ క‌లుపుకొని పోవాల్సిన జూనియ‌ర్లు.. ఈ విష‌యాన్ని ప‌క్కన పెట్టి త‌మ‌దైన విధంగా రాజ‌కీయాలు చేస్తున్నారు.

అసలు పట్టించుకోకుండా….

ముఖ్యంగా చిల‌క‌లూరిపేట‌లో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ సీనియ‌ర్ నేత మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను పూర్తిగా ప‌క్కన పెట్టేశారు. అక్కడ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు మ‌ర్రికి స‌పోర్ట్ చేస్తున్నారు. గుర‌జాల‌లో కాసు మ‌హేష్‌రెడ్డి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ప‌క్కన పెట్టార‌న్న ప్రచార‌మూ ఉంది. తాడికొండ‌లో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి వైసీపీ సీనియ‌ర్ నేత‌ల‌ను విస్మరిస్తున్నార‌ట‌. బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచో క‌ష్టప‌డిన వారిని ప‌క్కన పెట్టేస్తున్నార‌న్న టాక్ ఉంది. ఇక ఆయ‌న‌కు తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి పొస‌గ‌ని ప‌రిస్థితి. గుంటూరు ప‌శ్చిమ‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. మ‌రి ఇప్పట‌కి అయినా జూనియ‌ర్లు త‌మ రాజ‌కీయం ఇలాగే ఉంటుందంటారా ? లేదా ఎద‌రుదెబ్బ త‌గిలే వ‌ర‌కు మార‌రా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News