వీరు కదా… జగన్ కు…?

ఏపీ అధికార పార్టీ వైసీపీకి లెక్కకు మిక్కిలిగా ఉన్నారు ఎంపీలు. మొత్తం ఏపీలో 25 ఎంపీ స్తానాల్లో 22 చోట్ల వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో [more]

Update: 2019-11-30 08:00 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీకి లెక్కకు మిక్కిలిగా ఉన్నారు ఎంపీలు. మొత్తం ఏపీలో 25 ఎంపీ స్తానాల్లో 22 చోట్ల వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో ఈ పార్టీ ఎంపీపై రాష్ట్రానికి సంబంధించిన అనేక స‌మ‌స్యల ప‌రిష్కార బాధ్యత‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రజ‌లు కూడా వీరిపైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక‌, పార్టీ అధినేత జ‌గ‌న్ కూడా వీరికి రాష్ట్ర ప్రయోజ‌నాల‌పై ప్రత్యేకంగా హిత‌బోధ చేస్తున్నారు. ఏవేదికెక్కినా.. రాష్ట్ర ప్రయోజ‌నాల కోస‌మే ప‌నిచేయాల‌ని, గ‌ళం విప్పాల‌ని ఆయ‌న ఆదేశించారు. దీంతో వైసీపీలోని చాలా మంది ఎంపీలు ఆదిశ‌గానే అడుగులు వేస్తున్నారు. ఇక‌, ఈ 22 మందిలో దాదాపు ప‌ది మందికిపైగా కొత్తవారే కావ‌డం గ‌మ‌నార్హం. వీరు కూడా జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తూనే.. వైసీపీ కోసం, వారి నియోజ‌క‌వ‌ర్గాల కోసం కృషి చేస్తున్నారు.

వారసులుగా వచ్చి…..

రాజ‌కీయ వారసులుగా అరంగేట్రం చేసిన వారిలోనూ కొంద‌రు కొత్తవారు ఉండ‌గా.. ఎలాంటి రాజ‌కీయ ప‌రిచ‌యం లేకుండా ఎన్ని క‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చి ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కిన వారు కూడా ఉన్నారు. వీరిలో న‌లుగురు పెద్దగా మీడియా ముందుకు రాక‌పోయినా.. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి మాత్రం త‌మ‌వంతు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. వారే.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవ‌రాయలు, ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్‌, రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్. వీరు జ‌గ‌న్ అంటే అత్యంత అభిమానం చూపించ‌డంతోపాటు ఆయ‌న ఆశ‌యాల‌ను సాధించ‌డంలోనూ ముందున్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి చేరువ‌లో ఉండ‌డంతో పాటు ఈ న‌లుగురు ఇప్పటికే ఇక్కడ ప‌ట్టు సాధించేందుకు కృషి చేస్తున్నారు.

అందరినీ కలుపుకుంటూ…

గోరంట్ల మాధ‌వ్‌: పోలీసు ఉద్యోగాన్ని వీడి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఈయ‌నకు మాస్‌లో మంచి గుర్తింపు ఉంది. పైగా అంద‌రినీ క‌లుపుకొని పోతార‌నే మంచి పేరు తెచ్చుకున్నారు. పోలీస్ గా ఉండే దూకుడు ఇప్పుడు రాజ‌కీయంగా ఆయ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది. అంద‌రినీ పేరు పెట్టి పిలుస్తూ.. ఎవ‌రు ఎలాంటి కార్యక్ర‌మానికి పిలిచినా కాద‌నకుండా వెళ్తున్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా సావ‌ధానంగా వింటున్నారు. ఇటీవ‌ల త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించిన‌ప్పుడు హంగు ఆర్భాటాల‌కు తావివ్వకుండా పేద‌ల స‌మ‌స్యలు వినేందుకు, నిరుద్యోగుల స‌మ‌స్యలు వినేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో బోయ‌ల‌ను ఎస్టీ జాబితాలో చేర్చే కార్యక్ర‌మంపై ఆయ‌న దృష్టి పెట్టారు. దీంతో ఆయ‌న‌కు ప్రత్యేకంగా గుర్తింపు వ‌స్తోంది.

క్లీన్ పాలిటిక్స్ తో…..

లావు శ్రీకృష్ణదేవ‌రాయలు: త‌ండ్రి లావు ర‌త్తయ్య వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఈయ‌న వైసీపీలో మంచి ప‌ట్టు పెంచుకు న్నారు. ఉన్నత విద్యావంతుడు కూడా కావ‌డం ప్లస్‌గా మారింది. జ‌గ‌న్‌కు అంత్యంత స‌న్నిహితుడు, విధేయుడు కూడా కావ‌డం గ‌మ‌నార్హం. నియోజ‌వ‌క‌ర్గంలో స‌మ‌స్యల‌పై అలుపెరుగ‌ని కృషి చేస్తున్నారు. సాగు, తాగునీరు స‌హా నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు కృషి చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే వెన‌క‌ప‌డిప ప‌ల్నాడు ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్న ఆయ‌న క్లీన్ పాలిటిక్స్‌తో దూసుకు పోతున్నారు.

వివాద రహితుడిగా….

కోట‌గిరి శ్రీధ‌ర్‌: త‌న తండ్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన శ్రీధ‌ర్ తొలి ప్రయ‌త్నంలోనే విజ‌యం సాధించారు. ఉన్నత విద్యావంతుడు స‌మ‌స్యల‌పై ప‌ట్టున్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో అనేక స‌మ‌స్యల‌పై ఆయ‌న పోరాటం ప్రారంభించారు. ప్లాస్టిక్ ర‌హిత నియ‌జ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు, త‌న‌కు ప‌రిచ‌యం ఉన్నవారితో పెట్టుబ‌డులు పెట్టించి నిరుద్యోగుల‌కు ఉపాధి కల్పించే ప‌నులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ క‌లుపుకొని పోతూ.. వివాద ర‌హితుడుగా పేరు తెచ్చుకున్నారు. చిన్న వివాదానికి కూడా తావు లేకుండా ఆయ‌న ముందుకు వెళుతోన్న తీరు ప్రతి ఒక్కరిని ఆక‌ట్టుకుంటోంది.

యువ ఎంపీగా….

మార్గాని భ‌ర‌త్‌: జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా పేరు తెచ్చుకున్న రాజ‌మండ్రి యువ ఎంపీ. ఈయ‌న రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేవారి కోసం త‌న‌వంతు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల అమెరికాలో ప‌ర్యటించిన ఈయ‌న ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివ‌రించి పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో పెండింగు ప‌నుల‌ను పూర్తి చేయించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. ఎమ్మెల్యేల‌ను కూడా క‌లుపుకొని పోతూ.. వివాద‌ర‌హితుడిగా పేరు తెచ్చుకుని, జ‌గ‌న్ ఆశ‌య సాధ‌న‌లో దూసుకుపోతున్నారు. ఏదేమైనా ఈ న‌లుగురు ఎంపీలు ముందుకు వెళుతోన్న తీరు మాత్రం అటు వైసీపీలోనే కాకుండా.. ఇటు న్యూట్రల్ జ‌నాల‌ను సైతం ఆక‌ర్షిస్తోంది.

Tags:    

Similar News