జ‌గ‌న్‌కు ఆయనపై ఎంత క‌సి…. ఈయనపై అంత ప్రేమ

రాజ‌కీయాల్లో నేత‌లు ఎంత క్రేజ్ ఉన్నా వారు వేసే అడుగులే వారిని ఉన్నత స్థానాల‌కు తీసుకు వెళ‌తాయి. ఎంత గొప్ప నేత అయినా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ [more]

Update: 2020-11-26 08:00 GMT

రాజ‌కీయాల్లో నేత‌లు ఎంత క్రేజ్ ఉన్నా వారు వేసే అడుగులే వారిని ఉన్నత స్థానాల‌కు తీసుకు వెళ‌తాయి. ఎంత గొప్ప నేత అయినా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన నేత అయినా చిన్న త‌ప్పడుగు వేస్తే గోతిలో ప‌డ‌తారు.. అదే వారు ప‌డింది పాతాళంలో అయితే వారి రాజ‌కీయ భ‌విష్యత్తుకు ఫుల్‌స్టాప్ ప‌డిన‌ట్టే. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌గ్గర డ్రామాలు ప‌నిచేయ‌వు. ఏ నేత‌ను అయినా న‌మ్మితే ఎంత నెత్తిన పెట్టుకుంటారో ? తేడా వ‌స్తే అంతే ప‌క్కన పెట్టేస్తారు. మ‌హామ‌హులు అయిన నేత‌లు కూడా తోకాడిస్తే వైసీపీలో ఎంత సైడ్ అయిపోయారో చూస్తూనే ఉన్నాం. ఆనం లాంటి వాళ్లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. వైసీపీలో ఓ కీల‌క నేత ప‌రిస్థితి కూడా ఇప్పుడు అత్యంత దీనంగా ఉంది. మేకా శేషుబాబు దివంగత వైఎస్సార్ అందండ‌ల‌తో సామాన్య స్థాయి నుంచి జ‌డ్పీ చైర్మన్ వ‌ర‌కు ఎదిగారు.

పార్టీకి నష్టం చేసినా…..

2004 ఎన్నిక‌ల్లో నాడు పాల‌కొల్లు సీటును వైఎస్ గుణ్ణం నాగ‌బాబుకు ఇవ్వగా మేకా శేషుబాబు కాంగ్రెస్ రెబ‌ల్‌గా పోటీ చేసి 13 వేల ఓట్లు చీల్చారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఆ సీటును 11 వేల‌తో కోల్పోయింది. కేవ‌లం శేషుబాబు వ‌ల్లే నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ గాలులు బ‌లంగా వీచినా పాల‌కొల్లులో మాత్రం కాంగ్రెస్ ఓడింది. పార్టీకి న‌ష్టం చేసినా కూడా వైఎస్ శేషుబాబుపై ద‌య చూపారు. ఆ త‌ర్వాత పాల‌కొల్లు జ‌డ్పీటీసీగా పోటీ చేసి గెలిచిన శేషుబాబు 2009లో నాటి జ‌డ్పీచైర్మన్ కారుమూరి నాగేశ్వర‌రావు త‌ణుకు ఎమ్మెల్యే అవ్వడంతో జ‌డ్పీ చైర్మన్ అయ్యారు. ఇలా పార్టీకి న‌ష్టం చేసినా వైఎస్ ద‌య‌తోనే శేషుబాబు రెండున్నరేళ్లకే జ‌డ్పీ చైర్మన్ అయ్యారు.

తొలి ఎమ్మెల్సీగా….

వైఎస్ మ‌ర‌ణాంత‌రం శేషుబాబు జ‌డ్పీ చైర్మన్‌గా ఉండి కూడా వైసీపీలోకి జంప్ చేసి ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ తొలి ఎమ్మెల్సీల‌లో ఒక‌డిగా రికార్డుల‌కు ఎక్కడంతో పాటు జ‌గ‌న్ వ‌ద్ద మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పాల‌కొల్లు సీటు ఇవ్వగా ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో పోరాటాలు చేయ‌డం మానేసి పార్టీకి న‌ష్టం చేకూర్చే చ‌ర్యలు చేయ‌డంతో జ‌గ‌న్ వ‌ద్ద శేషుబాబు ప‌లుకుబ‌డి క్రమ‌క్రమంగా త‌గ్గుతూ వ‌చ్చింది. ఆ త‌ర్వాత క్యాస్ట్ ఈక్వేష‌న్లలో భాగంగా జ‌గ‌న్ పాల‌కొల్లు పార్టీ బాధ్యత‌లు గుణ్ణం నాగ‌బాబుకు ఇచ్చారు. ఇది న‌చ్చని శేషుబాబు పార్టీ వ్యతిరేక కార్యక్రమాల‌కు పాల్పడ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాటు టీడీపీలో చేరేందుకు చంద్రబాబును కూడా క‌లిశార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఆ ఒక్క సీన్ తోనే….

జిల్లాలో త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి పార్టీ మారే అంశంపై కూడా చ‌ర్చించారు. ఆ త‌ర్వాత కూడా జ‌గ‌న్ త‌న పాద‌యాత్రలో శేషుబాబు నీ ఫ్యూచ‌ర్ నాది.. నాగ‌బాబుకు స‌పోర్ట్ చేసి గెలిపించాల‌ని ఇద్దరి చేతులు క‌లిపేందుకు ప్రయ‌త్నించ‌గా శేషుబాబు జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే వాడికి ఎవ‌డు స‌పోర్ట్ చేస్తాడు ? అని క‌సురుకోవ‌డంతో అప్పుడే జ‌గ‌న్ సైలెంట్ అయ్యి ముందుకు వెళ్లిపోయార‌‌ని వైసీపీ వ‌ర్గాలు అప్పట్లో చ‌ర్చించుకున్నాయి. ఆ ఒక్క సీన్‌తోనే శేషుబాబు వైసీపీ ఫ్యూచ‌ర్‌కు శుభం కార్డు ప‌డిపోయిందంటారు. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పాల‌కొల్లు సీటు మాజీ ఎమ్మెల్యే సీటు బాబ్జీకి ఇవ్వగా.. ఆ ఎన్నిక‌ల్లో కూడా స‌రిగా స‌పోర్ట్ చేయ‌లేద‌న్న రిపోర్టులు పైకి వెళ్లాయి.

పూర్తిగా పక్కన పెట్టేసి….

ఇక ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక శేషుబాబు అనే లీడ‌ర్ ఉన్నట్టే పార్టీ నేత‌ల‌కు గుర్తు లేదు. బీసీల్లో గౌడ / గౌడ ఉప‌కులాల నేత‌లు జ‌గ‌న్‌కు కూడా అవ‌స‌ర‌మే. ఈ కులం నుంచి ప‌శ్చిమ‌లో కీల‌క నేత‌గా ఉన్న మాజీ మంత్రి పితానికి ధీటుగా వైసీపీలో కూడా ఓ నాయ‌కుడు ఉండాల‌న్నదే జ‌గ‌న్ టార్గెట్‌. అయితే గౌడ / ఉప కులాల్లో శేషుబాబును జ‌గ‌న్ న‌మ్మే ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ సీఎం హోదాలో జిల్లాల‌కు వ‌చ్చిన‌ప్పుడు శేషుబాబు ప‌ల‌క‌రిస్తున్నా జ‌గ‌న్ ప‌ట్టించుకుంటోన్న ప‌రిస్థితి లేదంటున్నారు. పార్టీ అధిష్టానంలో ఉన్న కీల‌క నేతలు కూడా శేషుబాబును లైట్ తీస్కొంటున్నారు.

ఆయనను చేరదీస్తూ…..

ఈ క్రమంలోనే శెట్టిబ‌లిజ వ‌ర్గం నుంచి జిల్లాలో కవురు శ్రీనివాస్‌ను ప్రోత్సహిస్తున్నారు. 2014లో జిల్లాలో పార్టీ అడ్రస్ లేన‌ప్పుడే క‌వురు శ్రీను వీర‌వాస‌రం ఎంపీపీగా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆచంట వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప‌నిచేసి.. పితానిని ఢీకొట్టి మ‌రీ అక్కడ వైసీపీని బలోపేతం చేశారు. చివ‌ర‌కు రంగ‌నాథ‌రాజు కోసం జ‌గ‌న్ సూచ‌న‌ల మేర‌కు సీటు త్యాగం చేయ‌గా…. పార్టీ గెలిచిన వెంట‌నే జ‌గ‌న్ క‌వురును పాల‌కొల్లు ఇన్‌చార్జ్‌గా, డీసీసీబీ చైర్మన్‌గా నియ‌మించారు. ఇక ఇప్పటికే ప‌శ్చిమ జ‌డ్పీ వైసీపీ అభ్యర్థిగా కూడా క‌వురు పేరు దాదాపు ఖ‌రారైంది. అందుకే ఆయ‌న య‌ల‌మంచిలి జ‌డ్పీటీసీగా పోటీ చేస్తున్నారు. అన్ని సానుకూల‌త‌లు క‌లిసి వ‌స్తే క‌వురు ప‌శ్చిమ జ‌డ్పీ చైర్మన్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. యువ‌నేత‌గా ఉన్న క‌వురుకు వ‌రుస‌గా కీల‌క ప‌ద‌వులు వ‌స్తున్నాయి. భ‌విష్యత్తులో కూడా శేషుబాబుకు చిన్న ప‌ద‌వి కూడా ఇవ్వడానికి జ‌గ‌న్ ఇష్టప‌డ‌డం లేద‌ట‌. ఈ మేర‌కు జ‌గ‌న్‌ క్యాస్ట్ ఈక్వేష‌న్ల బ్యాలెన్స్‌లో క‌వురు శ్రీను తిరుగులేని నేత‌గా ఎదుగుతున్నారు.

Tags:    

Similar News