జమిలి వస్తే జగన్ కే మంచిదా ?

జమిలి ఎన్నికలు అంటూ ఒక వైపు తెలుగుదేశం పార్టీ ప్రతీ రోజూ జపమే చేస్తోంది. చంద్రబాబు అయితే 2022 లో జమిలి ఎన్నికలు ఖాయమని చాలా ఆశలు [more]

Update: 2020-11-12 03:30 GMT

జమిలి ఎన్నికలు అంటూ ఒక వైపు తెలుగుదేశం పార్టీ ప్రతీ రోజూ జపమే చేస్తోంది. చంద్రబాబు అయితే 2022 లో జమిలి ఎన్నికలు ఖాయమని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన రోజులను ఒక్కోటిగా లెక్కబెట్టుకుంటున్నారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచింది. కళ్ళు మూసుకుంటే 2021 పూర్తి అయి 2022 వచ్చేస్తుంది మళ్ళీ పులి అయిపోతానంటూ కమ్మని కలలే కంటున్నారు. జమిలి ఎన్నికల్లో జగన్ ఇంటికెళ్ళిపోవడం ఖాయమని కూడా ఆయన చాలా కచితమైన అభిప్రాయంతో ఉన్నారు. వైసీపీకి 2019 లో వచ్చిన 151 సీట్లు తమకు ఈసారి వస్తాయని కూడా ఆయన నమ్మకంగా ఉన్నారు.

అసలు విషయం అదేనా…?

నిజానికి జమిలి ఎన్నికలు ఇపుడు అధికారంలో ఉన్న పార్టీలకే కావాలట. జమిలి అని మోడీ రెండేళ్ల అధికారాన్ని కూడా వదులుకుని కలవరిస్తున్నారు అంటే ఆయన ఏమైనా మేధావితనం తక్కువై చేస్తారా అని కూడా చర్చ సాగుతోంది. 2024 వరకూ ఆగితే రాహుల్ గాంధీ మరింతగా రాటుదేలుతారు. విపక్షాలు కూడా ఐక్యంగా ఉండి గట్టి కూటమి కడితే కొంప మునుగుతుంది. అందువల్ల ఇంకా జనాల్లో పూర్తిగా వ్యతిరేకత ముదరకముందే జమిలి పేరు మీద ఎన్నికలకు వెళ్ళి జనం ఓట్లు ఓడిలో పడేసుకోవాలన్నదే మోడీ మార్క్ థియరీ. మరి ఆయనకు వర్తించింది ఏపీలో జగన్ కి కూడా వర్తించదా?

అదే జరిగితే…?

ఇక ఏపీలో కూడా జగన్ ఇంకా పాలన‌ ప్రారంభదశలో ఉన్నారు. ఆయన అనుకున్న కార్యక్రమాలు చాలా చేయాల్సి ఉంది. అవి వాయిదా పడి ఎన్నికలకు జగన్ వెళ్తే జనం వాటికోసమైనా తిరిగి జగన్ కావాలనుకుంటారుగా. ఇది ఒక లాజిక్ కూడా కదా. ఇక జగన్ జనాలకు సంక్షేమ పధకాల పేరిట పప్పు బెల్లాలు చాలానే పంచారు. అయిదేళ్ల పాటు అలా పంచడానికి ఖజానా చిల్లు పడి వెక్కిరిస్తోంది. అందువల్ల తొందరగా జమిలి ఎన్నికలు వస్తే జగన్ కే మేలు. మరో అయిదేళ్ల అధికారం ఆ పేరిట చేతిలో పడుతుంది. పధకాలు అమలు సరిగ్గా అమలు చేయలేదన్న చెడ్డ పేరు కూడా లేకుండా పోతుంది.

ఆ ప్రచారాన్నినమ్మితే ఇరకాటమే…?

ఇక చంద్రబాబు విపక్షంలో ఉన్నారు కాబట్టి జగన్ మీద జనం ఆగ్రహంగా ఉన్నారని లెక్కలేసుకోవచ్చు. కానీ జగన్ విషయంలో ఇంకా జనాల్లో వ్యతిరేకత రాలేదు. అయిదేళ్ళు అధికారంలో ఉంటే చివరి ఏడాది ఆ బెడద కొంత ఉంటే చాన్సుంది. కానీ మూడేళ్లకే ఎన్నికలు అంటే తాము పూర్తి సినిమా చూడకుండానే తెర వేసేశారు అని జనాలకూ అసంతృప్తి కలుగుతుంది. దాంతో మళ్ళీ జగన్ కే జై కొట్టే చాన్స్ కూడా ఎక్కువగా ఉంది. గతంలో ఎన్టీఆర్ సీఎం గా ఉన్నపుడు కాంగ్రెస్ నాదెండ్ల భాస్కర రావు రూపంలో నడిపిన వెన్నుపోటు ఎపిసోడ్ తరువాత ఎన్టీయార్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి ఇలాగే లాభపడ్డారు. అంతే కాదు, ఏపీలో చాలా పధకాలు అమలుకాకపోవడానికి చంద్రబాబు అడ్డుకుంటున్నారు అన్న భావనను జనంలో జగన్ సక్సెస్ ఫుల్ గా ఇప్పటికే పంపించారు, అలాగే వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ బాబు కుట్ర రాజకీయలకు పాల్పడుతున్నారు అన్నది కూడా ప్రజలకు చేరిపోయేలా జగన్ వ్యవహరించారు. దాంతో ఎన్నికలు తొందరగా వస్తే కనుక జగన్ కే మేలు అన్న భావన వైసీపీలోనూ అంతకంతకు పెరుగుతోందిట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News