భ్రష్టుపట్టిస్తున్నదెవరో గుర్తిస్తేనే మళ్లీ గద్దె దక్కుతుంది

సీఎం జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే బ్యాచ్ ఎవరో కానీ ఆయన్ని సర్వ భ్రష్టం చేసే వరకు వదిలేలా లేరు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల [more]

Update: 2020-03-17 08:00 GMT

సీఎం జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే బ్యాచ్ ఎవరో కానీ ఆయన్ని సర్వ భ్రష్టం చేసే వరకు వదిలేలా లేరు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించగానే., ముఖ్యమంత్రికి ఎన్నికల అధికారి మీద నూరిపోయడం, ఆయన ఆఘ మేఘాల మీద గవర్నర్ దగ్గరకెళ్లి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే ఉరుకులు, పరుగులు మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగిపోయాయి. ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన తొలి మీడియా సమావేశం కోసం జర్నలిస్టులు ఆదివారం మధ్యాహ్నం పరుగులు పెట్టారు. తీరా అక్కడకి వెళ్లిన వారికి భంగపాటు తప్పలేదు. వారు వీరు అనే తేడా లేకుండా కేవలం అతి కొద్ది మంది సెలెక్ట్ మీడియాకి మాత్రమే ఎంట్రీ లభించింది. ఏపీ మీడియాలో పాలక పక్షాలు సెలెక్ట్ మీడియా విధానం అమలు చేయడం కొత్త కాకున్నా, కొత్త ప్రభుత్వం వచ్చాక మరిన్ని కొత్త పోకడలకు శ్రీకారం చుట్టింది. దీనికి సీఎం ని బూచిగా చూపడం సిఎంవో సిబ్బందికి అలవాటుగా మారిపోయింది. ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ కి జాతీయ ఛానల్స్ తో పాటు చాలా మందికి ఎంట్రీ దొరకలేదు. కేవలం సీఎం ప్రజా సంబంధాల సిబ్బందికి అత్యంత సన్నిహితులకు మాత్రమే ప్రవేశం దొరికింది. సీఎం క్యాంప్ ఆఫీసు కి వచ్జిన ఆంగ్ల పత్రికల జర్నలిస్టులు బయట నుంచి చేస్తున్న ఫోన్లు కూడా ఎత్తకుండా జాగ్రత్త పడ్డారు. చివరకి సమాచార శాఖ అధికారులకు కూడా సీఎం ప్రెస్ మీట్ వివరాలు చివరి నిమిషం వరకు తెలియపోవడం, అక్కడ జరిగిన పరిణామాలతో ఐ అండ్ పీఆర్ కమిషనర్ వ్యక్తిగతంగా అందరికి ఫోన్లు చేసి క్షమాపణ చేర్పుకోవాల్సి వచ్చింది.

పెనం మీద నుంచి పొయ్యిలోకి…..

ఏపీ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మీడియా పరిస్థితి దయనీయంగా తయారు అయ్యింది. చాలా మంది జర్నలిస్టులకు ప్రభుత్వ సమాచారం దొరకడం గగనం అయిపోయింది. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక ముద్ర వేసి జర్నలిస్టుల్ని దూరం చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. నిజానికి పత్రికల పాలసీలను, ఆసక్తులను ఏమాత్రం ప్రభావితం చేయలేని జర్నలిస్టులను దూరం చేయడం ద్వారా ముఖ్యమంత్రి మీడియా విభాగం ఏమి సాధించిందో ఎవరికి తెలియదు. చంద్రబాబు హయాంలో కొద్ది మంది కమ్మ జర్నలిస్టులు చక్రం తిప్పేవారు. ఐదేళ్ల పాటు చంద్ర బాబు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఆయన సొంత కులస్తులకు తప్ప మరో వర్గానికి దక్కలేదు. నిజానికి ఈ పైత్యం అప్పట్లో మీడియా సలహాదారుగా పని చేసిన వ్యక్తి నిర్వాకం అని సమాచార శాఖ అధికారులు వాపోయేవారు. ఏరికోరి చంద్రబాబు కులం కోటరీని ప్రోత్సహించడం ద్వారా టీడీపీ సర్కారుకు ఎనలేని మేలు చేశాడు. సీఎంవోలో మొదలైన ఈ అసంతృప్తి చివరకి ఏ జర్నలిస్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వం రాకూడదు అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది. గత ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే సలహాలు ఇవ్వడం, స్వీయ ప్రయోజనాలు, జర్నలిస్ట్ సంఘాల ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం ద్వారా మిగిలిన వారిని చంద్రబాబు దూరం చేసుకున్నారు. సీఎం తమ కులం కాబట్టి ప్రభుత్వ విధి విధానాలు తమ కనుసన్నల్లో నడుస్తాయి అనేలా వారి శైలి ఉండేది. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో జర్నలిస్టుల మితిమీరిన జోక్యంతో పాటు వారికి లభించే ప్రత్యేక గుర్తింపు, ప్రయోజనాలు అంతిమంగా బాబు కొంప ముంచడానికి ఉపయోగ పడ్డాయి. ఎన్నికల్లో ఓడిన తర్వాత కానీ చంద్రబాబుకి తన కులం చేసిన గాయం అర్థం కాలేదు.

ఏ మాటకు ఆ మాటే……

చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్., పీఆర్ స్కిల్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి మీడియా విభాగం చురుకుగా, వేగంగా పని చేసేది. గంటల తరబడి సాగే ప్రెస్ మీట్ లు ముగిసిన నిమిషాల వ్యవధిలో తెలుగు, ఇంగ్లీష్ ప్రెస్ నోట్లు జారీ అయ్యేవి. సీఎం మాట్లాడుతుండగానే స్క్రోల్ పాయింట్స్ కూడా అధికారిక గ్రూప్ లలో వచ్చేవి. ఇప్పుడు సీఎం ఏం మాట్లాడాలో, ఎంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలో సలహా ఇచ్చే వారు కూడా లేకుండా పోయారు. ముఖ్యమంత్రికి మంచి చెడులు వివరించడం, రూల్ పొజిషన్ తెలియచేయడం కంటే ఆయన అగ్రహావేశాలకు మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారు. సీఎం మాట్లాడాల్సిన అంశాల మీద స్పష్టత లేకుండా, జనంలో నవ్వుల పాలయ్యే పారసెట్ మాల్ ., బ్లీచింగ్ సలహాలు రాసిచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి మొట్ట మొదటి ప్రెస్ మీట్ మధ్యాహ్నం 3గంటలకు ముగిస్తే రాత్రి పొద్దుపోయే వరకు అది బయటకు రాలేదు. నిజానికి స్థానిక ఎన్నికల వాయిదా మీద సీఎం అసంతృప్తి చెంది ఉంటే అది మరో మార్గంలో వార్తల్లో ఉండేలా జాగ్రత్త పడి ఉండేవారు. ఎన్నికల కోడ్ అమలవుతున్న వేళ నేరుగా రాజ్యాంగ సంస్థతో ఢీకొట్టి భంగ పడకుండా జాగ్రత్త పడేవారు. అనుభవ రాహిత్యం, అవగాహనా లేమితో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసి సమస్యను మరింత జఠిలం చేసుకునే వారు కాదు

.అప్పుడు ఇప్పుడు ఒక్కటి కాదు…..

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు వైసీపీకి మీడియాతో అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథా అవలంబిస్తుండటం విచిత్రంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అనుకూల వైఖరి ఉన్నా., లేకున్నా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా బయటకు చెప్పుకోలేని స్థితిలో సీఎం మీడియా విభాగం ఉంది.ఇలాంటి లోటుపాట్లను సరిదిద్దుకోకుండా దుందుడుకుగా వ్యవహరించడం చేటు చేస్తుందని గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News