విపక్షంలో ఉన్నప్పడే బెటరా? ఇప్పడా ఊపు లేదా?

వైసీపీలో అనూహ్యమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గత క‌ట్టుబాటు త‌ప్పిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. కొన్ని జిల్లాల్లో పోరు రోడ్డున ప‌డ‌గా.. మ‌రికొన్ని జిల్లాల్లో మాత్రం [more]

Update: 2020-03-07 14:30 GMT

వైసీపీలో అనూహ్యమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గత క‌ట్టుబాటు త‌ప్పిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు పరిశీల‌కులు. కొన్ని జిల్లాల్లో పోరు రోడ్డున ప‌డ‌గా.. మ‌రికొన్ని జిల్లాల్లో మాత్రం తెర‌చాటునే నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. దీంతో ప్రభుత్వం ఎన్ని ప‌థ‌కాలు తెర‌మీదికి తెస్తున్నా.. వాటిని ప్రచారంలోకి తీసుకురావ‌డంలోను, ప్రభుత్వానికి ప్లస్ అయ్యేలా చేయ డంలోను కార్యక‌ర్తలు, నాయ‌కులు పూర్తిస్థాయిలో విప‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇటీవ‌ల ఓ కార్యక్రమం అనంతరం జ‌గ‌న్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాడు -నేడు కార్యక్రమం ల‌క్ష్యాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రించ‌డంలోను, పింఛ‌ను పెంపు విష‌యంలో విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శలు తిప్పికొట్టడంలోను విఫ‌ల‌మ‌వుతున్నార‌నే వాద‌న ఉంది.

ఇన్ ఛార్జి మంత్రులే….

మ‌రి ఈ స‌మయంలో జిల్లాల్లో ఏర్పడుతున్న లోపాల‌ను ప‌సిగ‌ట్టడంలోను, జిల్లాలోని నాయ‌కుల‌ను ఏక‌తాటిపై న‌డిపించ‌డం లోను ఎవ‌రు బాధ్యత వ‌హిస్తారు ? ఆయా స‌మ‌స్యల‌ను ఎవ‌రు ప‌రిష్కరిస్తారు? నాయ‌కుల‌ను స‌మ‌న్వయం చేసి ఏక‌తాటిపై ఎవ‌రు న‌డిపిస్తారు? అంటే.. ఖ‌చ్చితంగా ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులే. గ‌తంలో టీడీపీకి ఉన్న ఇంచార్జ్ మంత్రులు చీమ చిటుక్కుమంటే.. ఆ జిల్లాలో వాలిపోయేవారు. ఆయా స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు ఉత్సాహం చూపించేవారు. అంతేకాదు, వారంతా కూడా షార్ప్ షూట‌ర్లుగా ప్రాధాన్యం తెచ్చుకున్నారు.

ఆ ఊపు లేదే…?

కానీ, నేడు ఆ త‌ర‌హా ఉత్సాహం.. ఊపు కూడా వైసీపీలో క‌నిపించ‌డం లేదు. జ‌రిగేదే జ‌రుగుతుంది.. మేం వెళ్లి ఆపితే మాత్రం ఆగుతుందా ? అనే వేదాంత ధోర‌ణిని అవ‌లంబిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మొత్తం ప‌ద‌మూడు జిల్లాల‌కు సీఎం జ‌గ‌న్ కీల‌క‌మైన నేత‌లుగా భావించిన వారిని ఇంచార్జ్‌లుగా నియ‌మించారు. అయితే, వీరు ఆయా జిల్లాల‌పై ప‌ట్టు పెంచుకోవ‌డంలోనే కాలం గ‌డిపేస్తున్నార‌నే భావ‌న వ్యక్తమ‌వుతోంది. కొంద‌రు మంత్రులు మ‌రీ సుతిమెత్తగా ఉండ‌డం, నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుక‌డుగు వేయ‌డం, ఎవ‌రినీ నొప్పించ‌కూడ‌ద‌నే సిద్ధాంతాన్ని అమ‌లు చేస్తుండ‌డంతో ఎక్కడి స‌మ‌స్యలు అక్కడే అనేవిధంగానే కాకుండా ఆయా స‌మ‌స్యలు మ‌రింత పెరిగి పెద్ద‌వి అవుతున్నాయి.

మంత్రుల కంటే ఎమ్మెల్యేలే…

కొడాలి నాని, క‌న్నబాబు లాంటి ఒక‌రిద్దరు మంత్రులు మిన‌హా మిగిలిన మంత్రులు అంతా ఇన్‌చార్జ్ మంత్రులుగా ఫెయిల్ అయ్యార‌ని జ‌గ‌న్ కూడా భావిస్తున్నట్టు వైసీపీ వ‌ర్గాల్లోనే ప్రచారం జ‌రుగుతోంది. ఇందుకు మ‌రో కార‌ణం కూడా ఉంది. ఇప్పటి కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారి కంటే ఎమ్మెల్యేల్లోనే చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు. అంబ‌టి రాంబాబుతో పాటు రోజా, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, గుర్నాథ‌రెడ్డి, రాజ‌న్న దొర‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పిన్మెల్లి రామ‌కృష్ణా రెడ్డి లాంటి సీనియ‌ర్లు ఎంతో మంది ఉన్నారు. వీళ్లతో పాటు చాలా మంది సీనియ‌ర్లు మంత్రుల మాట వినే ప‌రిస్థితి లేదంటున్నారు. ఇవే ఇప్పుడు జిల్లా ప‌రిధులు కూడా దాటి నేరుగా జ‌గ‌న్ స‌ముఖానికి చేరుతున్నాయి. వీటివ‌ల్ల పార్టీ ప‌రువు ఏమేర‌కు డ్యామేజీ అవుతుందో అనే ప్రశ్న క‌న్నా కూడా ప్రతిప‌క్షం పుంజుకునేందుకు చేజేతులా అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్పటికైనా ఇంచార్జ్ మంత్రులు దూకుడు చూపిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News