సంక్షోభంలో జగన్

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ పాదయాత్రల్లో రాష్ట్రానికి సంబంధించి తనదైన అవగాహన ఏర్పరచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో దానికి అనుగుణంగానే జగన్ ప్రకటనలు చేశారు. ఇప్పుడు వాటిని [more]

Update: 2019-10-01 15:30 GMT

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ పాదయాత్రల్లో రాష్ట్రానికి సంబంధించి తనదైన అవగాహన ఏర్పరచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో దానికి అనుగుణంగానే జగన్ ప్రకటనలు చేశారు. ఇప్పుడు వాటిని పూర్తి చేసే విధంగా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. విధానపరమైన అంశాల్లో గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేనంత వేగంతో యంత్రాంగం పరుగులు తీయాల్సి వస్తోంది. అంతవరకూ బాగానే ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సర్కారు ఉద్దేశానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచికి పోతే చెడు ఎదురవుతున్నట్లు కొన్ని సార్లు ఇబ్బందులను చవిచూడాల్సి వస్తోంది. వెంటనే స్పందించే దిద్దుబాటు యంత్రాంగం కరవు అవుతోంది. అధినేత జగన్ కు సకాలంలో సలహాలు ఇచ్చి సమర్థ నిర్ణయాలకు ఊతమిచ్చే సలహాదారులూ కరవు అయ్యారు. ఫలితంగా అఖండ మెజార్టీతో గెలిచిన వైసీపీ అప్పుడప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు చేసే రాజకీయ విమర్శలు పెద్దగా పట్టించుకోనవసరం లేకపోవచ్చు. కానీ తటస్థులు , ప్రజాసంఘాలు, పౌరసమాజం నుంచి వినవచ్చే వాటికి మాత్రం ప్రాధాన్యం ఉంటుంది. ఆయా వర్గాల ప్రతినిధులే ఒపీనియన్ మేకర్స్ గా మారుతుంటారు. వారు చేసే ప్రచారం భవిష్యత్తులో ప్రభుత్వంపైన, పార్టీపైన ప్రభావం చూపుతుంది.

స్పీడ్ మంచిదే కానీ…

సంస్కరణల శకంలో ప్రభుత్వాలు ఉద్యోగుల సంఖ్యను సాధ్యమైనంతవరకూ కుదించుకోవాలని చూస్తున్నాయి. అందువల్ల గడచిన దశాబ్దకాలంగా తప్పనిసరి విభాగాల్లో తప్ప పెద్దగా నియామకాలు కనిపించవు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు రకరకాల పేర్లతో పని కానిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటువంటి తరుణంలో జగన్ సర్కారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చేందుకు సంకల్పించింది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలోనే కాదు, దేశంలోనే ఒక రికార్డుగా లక్షా 26 వేల మందిని ఒకేసారి నియమించారు. అందులోనూ పంచాయతీరాజ్ సేవలను పటిష్ఠం చేసేందుకు ఉద్దేశించిన ఈ ఉద్యోగాలు గడపగడపకూ గ్రామస్వరాజ్యం నినాదాన్ని నిజం చేయాలనే సంకల్పాన్ని చాటిచెబుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మొత్తం తతంగాన్ని ముగించాలన్న తొందరలో అనేక పొరపాట్లు చోటు చేసుకున్నట్లు అధికారవర్గాలు పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. దీనిని ప్రతిపక్షం అడ్వాంటేజ్ గా తీసుకుని జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు గుప్పించింది. అర్హులైన వారు అవకాశాలను కోల్పోతే అంతకుమించిన అన్యాయం మరొకటి ఉండదు. అదే సమయంలో అనర్హులకు ఉద్యోగాలిస్తే సమర్థత ప్రశ్నార్థకమవుతుంది. ఇటువంటి విషయాల్లో పకడ్బందీ ఏర్పాట్లతో నియామక ప్రక్రియ చేపట్టి ఉండాల్సిందనేది జనాభిప్రాయం. శాశ్వత స్థాయి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఒకటి రెండు నెలల ఆలస్యమన్నది పెద్ద సమస్య కాబోదు.

వారధి కావాలి…

ప్రభుత్వ కార్యకలాపాలు నిరంతరం కొనసాగే ప్రక్రియలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అదే యంత్రాంగం ఉంటుంది. సంక్షేమం, సేవలు కూడా దాదాపు అవే ఉంటుంటాయి. కొత్తగా కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం, మరికొన్ని పథకాలను నిలిపివేయడం జరుగుతుంటుంది. కొన్ని సార్లు అవే పథకాలకు పేర్లు మారుతుంటాయి. అయితే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కనబరిచే వైరుద్ధ్యం రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా ఉంటుంది. రాష్ట్ర ప్రగతికి పెట్టుబడి వ్యయం అంచనా వేయడంలోనూ, కేటాయింపుల్లోనూ ఆయా పార్టీల విధానాలను అనుసరించి నిర్ణయాలు ఉంటాయి. జగన్ ప్రభుత్వం సంక్షేమం వైపు మొగ్గు చూపే సర్కారు. రకరకాల కారణాలు, ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలతో ఖజానా ఖాళీగా బోసి వెక్కిరిస్తున్న మాట వాస్తవమే. అయితే దాని ప్రభావం అభివృద్ధి పనులపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ సర్కారుదే. సంక్షేమం అన్నది ప్రజలకు ఆరోజు అవసరాలు తీర్చి కడుపు నింపే ప్రక్రియ. అభివృద్ధి ప్రజల జీవనప్రమాణాలు పెరిగేలా చేస్తూ భవిష్యత్ తరాల ప్రగతికి ఉద్దేశించినది. ఈ రెంటి మధ్య బాలెన్స్ చేసుకోవడంలోనే సర్కారు సామర్థ్యం వెల్లడవుతుంది. జగన్ అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులన్నీ నిలిపివేశారన్న ప్రచారం సర్కారు ప్రతిష్టను దెబ్బతీసే అంశమే. అమరావతి నిర్మాణం, మిగిలిన ప్రాజెక్టుల విషయంలో ఉన్నతస్థాయిలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక కారణాలతో పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో ప్రభుత్వం వికేంద్రీకరణకు యోచన చేస్తోంది. దీంతో మొత్తం వ్యవహారం లో ఏదో జరగబోతోందన్న రీతిలో ప్రచారం పుంజుకోవడంతో ప్రభుత్వ ప్రతిష్ఠకు వాటిల్లిన నష్టం అంతా ఇంతా కాదు. దానిపై ఇప్పటికీ సరైన వివరణ లేకపోవడంతో అసందిగ్ధత, అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పరపతిపై నీలి నీడలు ముసురుకున్నాయి.

విద్యుత్ కోతలు…

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తొలి సంక్షోభంగా చెప్పాలి. ప్రజలందరి జీవనంతో ముడిపడిన సమస్య కాబట్టి సులభంగా విమర్శలకు ఆస్కారమేర్పడుతోంది. రాష్ట్రంలో వాతావరణం అనుకూలించలేదు. అధికారులు రాజకీయ అధినాయకత్వాన్ని సకాలంలో అప్రమత్తం చేయలేదు. వీటికి తోడు ప్రభుత్వం విధానపరంగా సంప్రదాయేతర ఇంధనవనరుల నుంచి లభించే విద్యుత్ రేట్లపై పోరాటం సాగిస్తోంది. పవన, సౌర విద్యుత్ ఒప్పందాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై అధికభారం పడుతోందనే ఆలోచనలో ఉంది. దాంతో అక్కడ నుంచి కొనుగోళ్లు లేవు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం రాజకీయంగా సంకట పరిస్థితిలో చిక్కుకుంది. ప్రస్తుతం విద్యుత్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. ప్రతిపక్షానికి అంతకుమించిన రాజకీయాస్త్రం ఉండదు. ప్రస్తుతం జరుగుతున్నదదే. పాలనపరమైన ముందుచూపు , జాగరూకత లేకపోవడంతో ఈ అంశం మరింత ముదురుపాకాన పడే ప్రమాదం కనిపిస్తోంది.

కొత్త డిమాండ్లు…

దీర్ఘకాలిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం సముచితమైన నిర్ణయమే. అయితే ఏ ప్రాంతమూ అసంతృప్తికి లోనుకాకుండా బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. ముందుగా ఫీలర్స్ వదిలితే ఆందోళనలు చెలరేగుతాయి. హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేస్తారనే వాదనతో విశాఖ, రాజధాని ప్రాంతాల్లో అలజడి మొదలైంది. ఏయేప్రాంతాలకు ఏవిధంగా న్యాయం చేయబోతున్నారనే అంశం పై స్పష్టత ఇచ్చిన తర్వాతనే వికేంద్రీకరణ వంటి అంశాలపై విధానాలను ప్రకటించాలి. లేకపోతే భావోద్వేగాలతో ప్రాంతాలవారీ ఉద్యమాలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఇది జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇప్పటికే హైకోర్టు విషయంలో మూడు ప్రాంతాల నుంచి డిమాండ్లు వినవస్తున్నాయి. రానున్న అయిదేళ్ల కాలంలో రాష్ట్రం ఏయేరంగాల్లో ఏవిధంగా ముందడుగు వేయబోతోందనే అంశంపై సమగ్ర విధాన పత్రాన్ని జగన్ ప్రభుత్వం ప్రకటించాలి. తద్వారా అన్ని ప్రాంతాల ప్రజలు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈవిషయంలో జగన్ సర్కార్ కొంత మెలకువగా ఉంటేనే రాష్ట్రానికి , పార్టీకి కూడా ప్రయోజనదాయకం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News