“పవర్” ప్రతీకారం కోసమేనా?

అధికారం చేతులు మారుతుంది. పార్టీ, పాలకులు మాత్రమే సీట్లు మార్చుకుంటారు. అవే విధానాలు, అవే సంస్థలు, అవే కాంట్రాక్టులు. ఇందులోని మతలబు అందరికీ తెలిసిందే. అధికారాన్ని ఆశ్రయించి [more]

Update: 2019-09-23 15:30 GMT

అధికారం చేతులు మారుతుంది. పార్టీ, పాలకులు మాత్రమే సీట్లు మార్చుకుంటారు. అవే విధానాలు, అవే సంస్థలు, అవే కాంట్రాక్టులు. ఇందులోని మతలబు అందరికీ తెలిసిందే. అధికారాన్ని ఆశ్రయించి విధేయతను మార్చుకుంటూ ఉంటారు అధికారులు. కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని పట్టేసి పనులు కానిచ్చేసుకుంటారు పైరవీకారులు. కమీషన్లు, పర్సంటేజీలు, కోటరీలు..అంతా మామూలే. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. అంతటి ప్రజాదరణతో ఇటీవలి కాలంలో ఏ ప్రభుత్వమూ పగ్గాలు చేపట్టలేదు. అందువల్ల విప్లవాత్మక పాలన విధానాలతో కనీసం ఆరు నెలలపాటు ప్రతిపక్షం నోరెత్తలేని పరిస్థితి నెలకొంటుందని అంతా భావించారు. అయితే పాలనపరమైన అంశాల్లో గత ప్రభుత్వాన్నే తలపిస్తుండటంతో ఏ తాను ముక్కలైనా ఒకటే కదా? అన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రత్యర్థి పక్షమే కాదు, రాజకీయ విశ్లేషకుల నుంచీ పెదవి విరుపులు ఎదుర్కొంటోంది సర్కారు.

అవే సంస్థలు…

అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తామంటూ ప్రమాణ స్వీకారం రోజునే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుస్పష్టంగా పేర్కొన్నారు. తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు సైతం అదే విషయాన్ని జగన్ పదే పదే చెప్పారు. దీంతో ప్రభుత్వం పారదర్శక విధానాలపై చాలా గట్టి పట్టుదలతోనే ఉందనుకున్నారు. కేంద్రం నుంచి నిపుణుల నుంచి కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడంలో సీఎం జగన్ వెనకడుగు వేయలేదు. మిగిలేదెంత? అన్న విషయాన్ని పక్కనపెడితే తాను నమ్మిన విషయంలో చాలా సీరియస్ గానే జగన్ ఉన్నారన్న విషయాన్ని బయటికి పంపగలిగారు. అయితే గతంలో టీడీపీ హయాంలో టెండర్లు వేసిన సంస్థలే తిరిగి కాంట్రాక్టు ప్యాకేజీలు దక్కించుకోవడం అభియోగాలకు తావిస్తోంది. తెలుగుదేశం హయాంలో ఉదారంగా సొమ్ములు వెచ్చించేందుకు సిద్ధపడటంతో అధికమొత్తాలకు కోట్ చేశారనే విషయాన్ని బహిరంగపరచాలనేది ప్రభుత్వ యోచన. ఆ మేరకు ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అయితే ఖర్చు పెరిగిందనే నెపంతో తర్వాత ఎంతోకొంత మొత్తం కాంట్రాక్టు సొమ్మును పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. అది ప్రభుత్వానికి , సదరు సంస్థకు మధ్య పెద్దగా ప్రచారం లేకుండానే సాగిపోతుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక కాంట్రాక్టుల విషయంలో ఇదే పద్దతిని అనుసరించింది. ముందుగా తక్కువ మొత్తానికి ఆశ్రిత సంస్థల ద్వారా కాంట్రాక్టులు వేయించేవారు. తర్వాత తమకు నచ్చిన రీతిలో క్రమేపీ మొత్తాన్ని పెంచేసుకునేవారు. ఆ విధానాన్నే ఇక్కడ అమలు చేస్తారనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రోజురోజుకీ పెరుగుతున్న ఖర్చులు , ముడిసరుకుల వ్యయం పెంపుదలతో గతం కంటే తక్కువకు టెండరు వేయడమంటే సాహసంతో కూడిన విషయమే. కానీ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇందులో ఏదో మర్మం దాగి ఉందనే భావన వ్యక్తమవుతోంది.

చంద్రబాబు మార్గమే…

ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం, ప్రత్యర్థులను రాజకీయంగా నిరాశ్రయులను చేసే విధానాలను తెలుగుదేశం అధినేత తన పరిపాలన కాలంలో అనుసరించారు. వైసీపీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా పార్టీలో చేర్చేసుకున్నా, జగన్ మోహన్ రెడ్డిపై కేసుల పిడి బిగించాలని కేంద్రం పై ఒత్తిడి పెంచినా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చేశారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం సైతం నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తోంది . గత ప్రభుత్వం చేపట్టిన పనులు నిలిపివేయడమే కాకుండా ప్రతీకార ధోరణితో చర్యలు తీసుకోవడమూ కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంతో అనవసరమైన రచ్చ పెట్టుకుని ఓటుకు నోటు కేసుతో అమరావతి రాజధానికి తరలివచ్చింది గతంలో టీడీపీ ప్రభుత్వం. వైసీపీ ప్రాబల్యానికి గండి కొట్టి శాశ్వతంగా టీడీపీ అధికారంలో కొనసాగాలనే దిశలో ఎత్తుగడలు వేసింది. రాజకీయమే ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంది. అదే ఫార్ములాను అనుసరిస్తోంది వైసీపీ. ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోకపోయినప్పటికీ ఎక్కడికక్కడ టీడీపీ నేతలపై కేసుల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. నైతికంగా, ఆర్థికంగా తెలుగుదేశాన్ని బలహీనపరిచే ఎత్తుగడలను అమలు చేస్తోంది.

అతివృష్టి ..అనావృష్టి…

తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పరిపాలన విధానాలు భిన్నమైనవి. అయితే రెండింటిలోనూ సమతుల్యత లోపించడం గమనార్హం. తెలుగుదేశం ప్రభుత్వం నేలవిడిచి సాము చేసినట్లుగా రాజధాని ఇతర అంశాలను అతిశయోక్తులతో నింపేసింది. ప్రజలను సమ్మోహ పరచాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. అప్పటి గ్రాఫిక్ డిజైన్లు, ప్లాన్లు చర్చనీయాంశంగానే మిగిలిపోయాయి. అయితే ప్రభుత్వ పాలన చివరి నాలుగు నెలల్లో దాదాపు 30వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి రాజధానిలో హడావిడి సృష్టించింది. జగన్ ప్రభుత్వం పూర్తిగా పనులు నిలిపివేసి రాజధానిని స్తబ్దంగా మార్చేసింది. అవసరమైన పనులు సైతం సాగడం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట తాత్సారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి తనంతతానుగా గండి కొట్టింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భూసేకరణ అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మారిపోయింది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే భూసమీకరణ లో వేలాది ఎకరాలు అందుబాటులో ఉంది. ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టడం ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఆటంకమేమీ కాదు. టీడీపీ రాజధాని ప్లాన్ ను కొనసాగించి తనకు ఉన్న ఆలోచన మేరకు కొత్త ప్రాజెక్టులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నెలకొల్పేందుకు ప్రయత్నించి ఉంటే బాగుండేది. అటు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. ఇటు పాత ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రం రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రతీకార రాజకీయ ధోరణులకే పెద్ద పీట వేస్తున్నారు. అదే సమయంలో కాంట్రాక్టు సంస్థలు, పైరవీ కారులు మాత్రం అక్కడా ఇక్కడా ప్రాపకం పొందుతున్నారు. టీటీడీ బోర్డుకు శేఖరరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించడాన్ని ఇందుకొక నిదర్శనంగా చెప్పుకోవాలి.

 

 

-ఎడిటోరియల్

Tags:    

Similar News