హవ్వా….సొంత మనుషులే లేరా…?

పదేళ్ల పోరాటం….. నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి పాలనా వ్యవస్థలో సొంత మనుషులే లేకుండా పోయారు. ప్రభుత్వానికి,పార్టీకి మధ్య కళ్లు,చెవుల్లా పనిచేయాల్సిన నిఘా [more]

Update: 2019-09-12 14:30 GMT

పదేళ్ల పోరాటం….. నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి పాలనా వ్యవస్థలో సొంత మనుషులే లేకుండా పోయారు. ప్రభుత్వానికి,పార్టీకి మధ్య కళ్లు,చెవుల్లా పనిచేయాల్సిన నిఘా వ్యవస్థ అచ్చంగా నిద్రపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కళ్లు తెరవలేకపోతున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్‌ రవీంద్రను ఏరికోరి వైఎస్ జగన్ అమరావతి తెచ్చుకున్నారు. డిఓపిటి అనుమతి రాకముందే సెలవులో విజయవాడ వచ్చి స్టీఫెన్ రవీంద్ర విధులు ప్రారంభించారు. అయితే సూపర్‌ టైం స్కేల్‌లో ఉన్న స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్‌ మీద ఏపీ పంపేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించలేదు. దీని వెనుక కారణాలు ఏవైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నమ్మకమైన స్టీఫెన్‌ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

నిఘా బాధ్యత ఎవరిది…?

స్టీఫెన్‌ రవీంద్ర వెళ్లాక తర్వాత ఇంత వరకు ఆ పోస్ట్‌ లో ఎవరిని నియమించలేదు. నిఘా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న కీలకమైన అధికారి నేరుగా కేంద్ర హోం శాఖతోనే టచ్‌లో ఉంటారనే ప్రచారం ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్‌., స్పెషల్ బ్రాంచ్, సిఐ., ఐఎస్‌డబ్ల్యూ ఇలా అన్ని విభాగాలు నిర్లిప్తంగా పనిచేస్తున్నప్పటికీ సొంత టీంను బలోపేతం చేసుకోవడంలో మాత్రం ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్ విఫలమయ్యారు. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులతో అప్పటి ఇంటెలిజెన్స్‌ ఏడిజి ఏబి వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్‌ బాద్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా కీలకమైన స్థానాల్లో సొంత బృందాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేసుకోలేదు. చలో ఆత్మకూరు పేరుతో టీడీపీ వేసిన ప్లాన్‌ విజయవంతం కావడం వెనుక పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. దీనికి తోడు మీడియా మేనేజ్‌మెంట్‌లో వైసీపీకున్న లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. పల్నాడులో ఏం జరిగిందనే విషయం కంటే వైసీపీని విలన్‌గా మార్చడంలో ప్రసార మాధ్యమాలను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. ఏదో జరిగిపోతుందనే హడావుడిని ఉదయం నుంచి మొదలుపెట్టి విజయవంతంగా ఎస్టాబ్లిష్‌ చేయగలిగాయి.

ప్రభుత్వం వచ్చినా అదే ఉదాసీనత….

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా నిఘా విభాగాల్లో పాత అధికారులే కీలక స్థానంలో ఉండటం., టీడీపీతో అంటకాగిన వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడాన్ని పోలీసు వర్గాలు తప్పు పడుతున్నాయి. గత ఐదేళ్లలో టీడీపీ నేతలతో అంటకాగారో వారినే కీలక స్థానాల్లో ఉంచడం…. సొంత టీంను బలోపేతం చేసుకోవడంపై ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్ కానీ., డీజీపీ కాని దృష్టి పెట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లంచుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన మూడునెలల్లోనే ప్రధాన ప్రతి పక్షం దూకుడు పెంచుతున్నా దానిని గ్రహించలేకపోవడం…. రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వాధినేతకు చేరవేయడంలో నిఘా వర్గాలు విఫలమవుతున్నాయి. ఇక గత ఐదేళ్లలో రాజకీయ కారణాలతో ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసుకుని డిజీపీ కార్యాలయానికే పరిమితమైన అధికారులను కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. పదవీ విరమణ చేసిన అధికారులకు రెండు, మూడేళ్ల ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వడం…. గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న వారి సేవల్ని పోలీస్ శాఖలో వినియోగించుకోవడాన్ని సీనియర్ ఐపీఎస్‌లు తప్పు పడుతున్నారు.

సంక్షేమం భేష్‌….. వ్యూహాలే వేస్ట్….

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనవసర అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారనే భావన కూడా పోలీసు వర్గాల్లో ఉంది. ప్రజా వేదికను కూల్చే బదులు దానిని ప్రజోపయోగంగా ఆస్పత్రిగానో., నిరాశ్రయుల వసతి గృహంగానో మార్చి ఉంటే ముఖ‌్యమంత్రికి పేరు ప్రతిష్టలు వచ్చేవని కూల్చివేయడం ద్వారా రెండు విధాల పైచేయి సాధించగలిగేవారని చెబుతున్నారు. అలా చేసి ఉంటే మాజీ ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉండే వారు కాదని కరకట్ట విషయంలో అనవసర రచ్చ జరిగేది కాదంటున్నారు. ఇసుక విషయంలో సైతం వైఎస్ జగన్ అనాలోచితంగానే వ్యవహరించారంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో రాబోయే పర్యవసానాలను వివరించే అధికారులు వైఎస్ జగన్ కు లేకపోవడమే మైనస్‌గా మారిందంటున్నారు. వైఎస్ జగన్ కోటరీలో కీలకంగా ఉన్న వారిలో సమన్వయ లేమి కూడా ఆయనకు చుట్టుకుంటోంది. చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ‌్మణ్యం ఉండగా… మాజీ సీఎస్‌ అజేయ కల్లాంను సలహాదారుగా నియమించారు. వీరిద్దరిలో ఎవరి మాట ఎవరు వినాలనే విషయంలో స్పష్టత లేదు. చీఫ్‌ సెక్రటరీ స్వతంత్ర నిర్ణయాలను సలహాదారు ప్రభావితం చేస్తారా అనే చర్చ కూడా సచివాలయంలో ఉంది. ఎవరి పరిధి ఏమిటనే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి చర్చ తలెత్తుతోంది. వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయకపోతే మున్ముందు సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News