చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదట

విపక్షానికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఒకసారి ఇస్తే ఇక అంతే. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అక్కడ బీజేపీ అప్పటి నుంచే [more]

Update: 2021-08-01 15:30 GMT

విపక్షానికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఒకసారి ఇస్తే ఇక అంతే. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అక్కడ బీజేపీ అప్పటి నుంచే పుంజుకుంది. ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ ఆలోచన. ఏమాత్రం ఓట్ల శాతం పెరిగినా ఆ ప్రభావం రాష్ట్ర మొత్తం ఉంటుంది. అందుకే వైఎస్ జగన్ బద్వేలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

గెలుపు తమదే అయినా…?

బద్వేలు ఉప ఎన్నికల్లో గెలుపు వైసీపీ వైపే ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కానీ అక్కడ కొన్నేళ్లుగా టీడీపీ కూడా బలంగా ఉన్న విషయం మరిచిపోకూడదు. బద్వేలు ఉప ఎన్నికల్లో ఏమాత్రం టీడీపీ పుంజుకున్నట్లు కనపడితే జగన్ ఇమేజ్ కే దెబ్బవుతుంది. జగన్ సొంత జిల్లాల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత కనపడిందన్న ప్రచారాన్ని టీడీపీతో పాటు అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. అందుకే జగన్ బద్వేలు ఉప ఎన్నిక విష‍యంలో సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.

అందుకే పర్యటన….

ఇటీవల కడప జిల్లాకు వెళ్లిన వైఎస్ జగన్ బద్వేలు లో కూడా పలుకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ది పనులను ప్రారంభించారు. గతంలో తిరుపతి ఉప ఎన్నిక జరిగినా జగన్ అటువైపు చూడలేదు. కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. అలాంటిది జగన్ తన సొంత జిల్లాలో ఉన్న బద్వేలు విషయంలో ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనపడుతుంది. బద్వేలులో వన్ సైడ్ విజయం ఉండాలన్నది జగన్ అభిప్రాయం.

ప్రత్యేకంగా నేతలతో…?

ఈనెల 8వ తేదీన కడప జిల్లాకు వెళ్లిన జగన్ నేతలతో బద్వేలు ఉప ఎన్నిక గురించి ప్రత్కేకంగా ప్రస్తావించారని తెలిసింది. మండలానికి ఒక ఇన్ ఛార్జిని త్వరలోనే నియమిస్తారని చెబుతున్నారు. అలాగే మంత్రులను కూడా ప్రత్యేకంగా నియమిస్తానని, కలసి కట్టుగా పనిచేసి బద్వేలులో గతంలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీని తీసుకురావాలని జగన్ ప్రత్యేకంగా నేతలకు సూచించినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ బద్వేలు ఉప ఎన్నిక విష‍యంలో ప్రత్యర్థులకు ఎలాంటి చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నారు. ఉపఎన్నిక ప్రచారానికి కూడా తాను వస్తానని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News