జగన్ ఇంతగా ఆయాసపడుతున్నా…?

చంద్రబాబు ఎపుడూ ఒక్క మాట చెబుతూ ఉంటారు. తనకు సంక్షోభాలు కొత్త కాదు అని. వాటిని సవాల్ గా తీసుకుని ముందుకు పోతానని, విజయాలు సాధిస్తాను అని [more]

Update: 2021-05-26 15:30 GMT

చంద్రబాబు ఎపుడూ ఒక్క మాట చెబుతూ ఉంటారు. తనకు సంక్షోభాలు కొత్త కాదు అని. వాటిని సవాల్ గా తీసుకుని ముందుకు పోతానని, విజయాలు సాధిస్తాను అని కూడా ధీమా పోతూంటారు. మరి అవే సంక్షోభాలు జగన్ ని మాత్రం ముప్ప తిప్పలు పెడుతున్నాయి. జగన్ మంత్రి కాకుండానే ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేశారు. ఫరవాలేదు బాగానే బండిని లాక్కోస్తున్నారు అనుకునేలోగానే మొదటి దశ కరోనా వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే అప్పట్లో జగన్ సక్సెస్ అయ్యారనుకుంటే ఇపుడు రెండవ విడత మాత్రం వైసీపీ సర్కార్ కి హై బీపీనే పెంచుతోంది. ఆక్సిజన్ కొరత పడకల కొరత ఈసారి ప్రభుత్వానికి గట్టిగానే చాలెంజ్ చేస్తున్నాయి.

లైట్ తీసుకుంటున్నారే …?

జగన్ అధికారులను బాగా ఆదరిస్తారు. ఫలానా పని చేయమని మాత్రమే సూచిస్తారు. జగన్ ఈ విషయంలో స్మూత్ గా డీల్ చేస్తారు. బహుశా దానివల్లనే అధికారులు ప్రతీ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు అంటున్నారు. కరోనా వేళ కూడా జగన్ తరచూ సమీక్షలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేస్తూంటే క్షేత్ర స్థాయిలో మాత్రం వాటి ఫలితాలు కనీసంగా కనిపించంలేదు. జగన్ ఆదేశాలను మక్కీకి మక్కీ దిగువ స్థాయి అధికారులకు పాస్ చేసేసి ఉన్నతాధికారులు తమ పని అయిపోయింది అనిపించేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటన ఒక అచ్చమైన ఉదాహరణ.

వెన్నంటి ఉండాల్సిందే…?

అధికారుల విషయంలో జగన్ కూడా చంద్రబాబు మాదిరిగా కఠినంగా ఉండాలని సూచనలు అందుతున్నాయి. చంద్రబాబు ఈ సమయంలో చేసేది ఒక్కటే. తాను వరస పర్యటనలు పెట్టుకుంటారు. అధికారులను కూడా అప్రమత్తం చేస్తారు. దాని వల్ల వారిలో వేడి పుడుతుంది. చాలా వరకూ ఫలితాలు కూడా వస్తాయి. మరి జగన్ మాత్రం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు. పూర్తి బాధ్యత వారి మీదనే ఉంచి పని జరగాలనుకుంటున్నారు. కానీ అధికారుల వ్యవస్థ అంత తేలిగ్గా పట్టుకు దొరకదు. జగన్ కరోనా రెండవ దశలో అయినా రాష్ట్రంలోని పలు జిల్లాలలోని ఆసుపత్రులకు ఆకస్మిక తనిఖీలు చేయాలని, దాని వల్లనే అధికార యంత్రాంగం మొత్తంలో చురుకుదనం పుడుతుందని అంటున్నారు.

కాడి వదిలేస్తే…?

ఒక వైపు ప్రాణ వాయువు దొరక్క కరోనా రోగులు అల్లాడుతూంటే అందరూ బాధ్యతలను పై నుంచి దిగువ దాకా బదలాయించేవారే. అందరూ ఆదేశాలు జారీ చేసేవారే. దాని వల్లనే ఆక్సిజన్ అందక సామాన్యులు ఊపిరి వదులుతున్నారు. మంత్రులు అయినా తమ జిల్లాలలో కరోనా రోగులకు అందుతున్న వైద్యం మీద సమీక్ష చేస్తే బాగుండేది. కానీ తమ పని కాదన్నట్లుగా చాలా మంది ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం ఎక్కువ మంది ఇల్లు దాటి బయటకు రావడంలేదు. మొత్తానికి జగన్ తాడేపల్లి నుంచి మీటింగులు పెడుతూ తెగ ఆయాసపడుతున్నా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం సరిగ్గా పనిచేయడంలేదు అన్న విమర్శలే వస్తున్నాయి. దీంతోనే జగన్ కి క్రైసిస్ మేనేజ్ మెంట్ తెలియదు అని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి వారు హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News