జగన్ కు భారమయినా… భరించారా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల పాలన దాదాపు పూర్తయింది. ఈ రెండేళ్ల కాలంలో జగన్ ఏ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. వారిపై చర్యలు తీసుకోలేదు. అలాగని [more]

Update: 2021-05-26 09:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల పాలన దాదాపు పూర్తయింది. ఈ రెండేళ్ల కాలంలో జగన్ ఏ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. వారిపై చర్యలు తీసుకోలేదు. అలాగని మంత్రులు సుద్దపూసలా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. అనేక మంది మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా, వారి పనితీరు సక్రమంగా లేకపోయినా కనీసం చర్యలు తీసుకునేందుకు జగన్ సిద్ధపడలేదు. మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

అధికారంలోకి రాగానే…?

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను అవినీతిని సహించనని, ఎవరిపై ఆరోపణలు వచ్చినా చర్యలు తప్పవని జగన్ మంత్రులను హెచ్చరించారు. అయితే ఎక్కువ శాతం మంది పై అవినీతి ఆరోపణలు రాలేదు. అలాగే పనితీరును కూడా ఎక్కువ మంది కనపర్చలేదు. నలుగురైదుగురు మంత్రులు మాత్రమే తమకు కేటాయించిన శాఖపై పట్టుపెంచుకుని జగన్ తోడుగా నిలిచారు. మిగిలిన మంత్రులు ఉత్సవ విగ్రహాలనే చెప్పుకోవాలి.

కరోనానే కారణమా?

అయితే దీనికి వారు చెబుతున్న కారణం కరోనా. తాము పదవిని చేపట్టిన రెండేళ్లలో దాదాపు సగం సమయం కరోనా కాటేసిందంటున్నారు. తాము క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలన్నా, తమ శాఖ విషయంలో ప్రజలకు అవగాహన పెంచాలన్నా కరోనా అడ్డుపడిందని చెబుతున్నారు. ఇది ఒకసాకు మాత్రమేనని అందరికీ తెలిసిందే. పనితీరు కనపర్చకపోయినా జగన్ వారిని భరిస్తూ రావడానికి కూడా కారణాలున్నాయంటున్నారు.

ఇద్దరు మంత్రులపై….?

ఇక అవినీతి ఆరోపణలు ప్రధానంగా జగన్ కేబినెట్ లో ఇద్దరు మంత్రులపై వచ్చాయి. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లపై ఆరోపణలు వచ్చాయి. విపక్షాలు కూడా ఎక్కువగా వీరినే టార్గెట్ చేశాయి. ఏపీలో ఆలయాలపై దాడులు జరిగినా జగన్ వెల్లంపల్లిని తప్పించలేదు. అలాగే గుమ్మనూరిపై అనేక ఆరోపణలు వచ్చినా జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో జగన్ మంత్రుల వ్యవహారంలో సరిగా స్పందించలేదన్న కామెంట్స్ పార్టీలోనే విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News