టార్గెట్ ఫెయిలయ్యారో?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రెండు విష‌యాల‌ను కీల‌కంగా తీసుకున్నారు. ఒక‌టి త్వర‌లోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు. రెండు మూడు రాజ‌ధానుల ఏర్పాటు. ఈ [more]

Update: 2020-01-11 13:30 GMT

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రెండు విష‌యాల‌ను కీల‌కంగా తీసుకున్నారు. ఒక‌టి త్వర‌లోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు. రెండు మూడు రాజ‌ధానుల ఏర్పాటు. ఈ రెండు విష‌యాల‌ను కూడా వైసీపీ స‌హా జ‌గ‌న్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏడు మాసాల కిందట జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌య దుందుభి మోగించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 151 కైవ‌సం చేసుకుంది. 25 ఎంపీ స్థానాల్లో 22 సొంత చేసుకుని న‌భూతో.. అన్నవిధంగా రికార్డు మెజారిటీ సాధించి అధికారంలోకి వ‌చ్చారు. అయితే, ఏడు మాసాలు గిర్రున తిరిగిపోయాయి. అనేక సంక్షేమ ప‌థ‌కాలు ప్రజ‌లకు జగన్ అందించారు.

అన్నీ చేసినా……

పింఛ‌న్ పెంచారు. ఇత‌ర‌త్రా అనేక ప‌థ‌కాల‌ను జగన్ ప్రవేశ పెట్టారు. ఎంద‌రు వ్యతిరేకించినా ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్య‌మ‌మే ప్ర‌వేశ పెడ‌తామ‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో రైతు భ‌రోసాను అమ‌లు చేస్తున్నారు. ఎంతో కీల‌క‌మైన అమ్మ ఒడిని అమ‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను జ‌గ‌న్ ప్రభుత్వం మ‌రింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా జిల్లాల్లోనూ ప‌ట్టు పెంచుకునేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మకంగా ముందుకు సాగాల‌ని నిర్ణయించారు. అయితే, దీనికి సంబంధించి జిల్లాల్లో కార్యకర్తల‌ను ఎలా న‌డిపించాలి? నాయ‌కులు ఎలా ఉండాలి? అనే వ్యూహాన్ని తాజాగా జ‌గ‌న్ జిల్లా స్థాయి నేత‌ల‌కు వివ‌రించారు.

జోష్ పెంచేందుకు…..

ఇటీవల ఆయ‌న పార్టీ జిల్లా స్థాయి నేత‌ల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. త్వర‌లోనే తాము ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్కరికీ కోట్ల నిధులను విడుద‌ల చేయ‌నున్నామ‌ని, ఈ నిధుల‌ను జిల్లా స్థాయిలో అభివృద్ధికి వినియోగించి ప్రభుత్వ కార్యక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేసిన ట్టు తెలిసింది. వాస్తవంగా ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితిని చూస్తే జ‌గ‌న్ స‌హా కొంద‌రు మంత్రులు మాత్రమే దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు త‌మ‌కు నిధులు ఇవ్వడం లేద‌నే నిర్వేదంలో మునిగిపోయారు. దీంతో వారిలో జోష్ పెంచేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన జిల్లా స్థాయి నేత‌ల స‌మావేశంలో జ‌గ‌న్ ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకు సాగాల‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం.

రాజధానిపై కూడా……

ఇక‌, రెండో కీల‌క అంశం.. రాజ‌ధానుల ఏర్పాటు, మూడు రాజ‌ధానుల ఏర్పాటు విష‌యంలో వెన‌క్కి త‌గ్గే ప్రస‌క్తి లేద‌ని, ఈ విష‌యాన్ని నాయ‌కులు ప్రజ‌ల‌కు సానుకూలంగా వివ‌రించే ప్రయ‌త్నం చేయాల‌ని, ఏ ప్రాంతంపైనా వైసీపీకి రాగ‌ద్వేషాలు లేవ‌ని, అన్నిప్రాంతాల అభివృద్ధి కీల‌క‌మ‌ని, ఇప్పటికే వెనుక‌బ‌డి ఉన్న ప్రాంతాల‌ను అభివృద్ధి చేయ‌డం ద్వారా రాష్ట్రం స‌ర్వతోముఖాభివృద్ధి చెందేలా వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విష‌యాన్ని వివ‌రించాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. మొత్తంగా స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌యం తోపాటు రాజ‌ధానుల‌పై ప్రతి ఒక్కరికీ అవ‌గాహ‌న క‌ల్పించేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

Tags:    

Similar News