పులి మీద స్వారీ చేస్తున్న వైసీపీ ?

వైసీపీది ఇపుడు అచ్చం గత టీడీపీ సర్కార్ లాంటి బాధే. కేంద్రంలో యధాప్రకారం బీజేపీ, మోడీ ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు ప్లేస్ లో జగన్ ముఖ్యమంత్రిగా [more]

Update: 2021-03-04 02:00 GMT

వైసీపీది ఇపుడు అచ్చం గత టీడీపీ సర్కార్ లాంటి బాధే. కేంద్రంలో యధాప్రకారం బీజేపీ, మోడీ ఉన్నారు. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు ప్లేస్ లో జగన్ ముఖ్యమంత్రిగా వచ్చారు. నాడు ప్రత్యేక హోదా ఏపీ జనాల సెంటి మెంట్ గా ఉంటే ఒక్క దెబ్బతో దాన్ని మోడీ తుళ్ళగొట్టారు. అది ముగిసిన అధ్యాయం అంటూ చాలా తెలివిగా ముక్తాయింపు ఇచ్చారు. ఫలితంగా చంద్రబాబు నెత్తిన పెద్ద బండ వేశారు. ఆ మీదట ఏపీ జనాలు ఓడించి ఇంటికి పంపారు. ఇపుడు వైసీపీ వంతు వచ్చింది.

భారీ రిస్క్ ….

జగన్ ఈ మధ్య విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ జేఏసీతో చర్చలు జరిపారు. వారి బాధలు విన్నారు. అభయ హస్తం ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానీయబోమని కూడా హామీ ఇచ్చారు. ఇక విశాఖలో వైసీపీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి అయితే భారీ ఎత్తున పాదయాత్ర చేపట్టారు. తాము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకమని ఘంటాపధంగా చెప్పేశారు. జనాలు నమ్మారు, ఆయన సారధ్యంలో టీడీపీ తప్ప అన్ని పార్టీలు, కార్మిక యూనియన్లూ పోరాట బాట పట్టాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ కేంద్రం మనసెరిగి కూడా వైసీపీ ఇలా భారీ రిస్క్ చేస్తోందా అన్న చర్చ అయితే వస్తోంది.

రివర్స్ అయితే..?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నది పాలసీ డెసిషన్. ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు కేంద్రం సుతరామూ ఒప్పుకోదు అంటున్నారు. ఇప్పటికే వెల్లువలా సాగుతున్న రైతుల ఉద్యమం విషయంలోనే కేంద్రం మారనపుడు అంతంత మాత్రంగా సాగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమాన్ని లెక్క చేస్తుందా? అన్న సందేహాలు అయితే అందరిలోనూ ఉన్నాయి. కానీ వైసీపీ పెద్దలు మాత్రం ప్రైవేటీకరణ జరగదు, మనదే విజయం అని చెబుతున్నారు. అది కనుక రివర్స్ అయితే వైసీపీ ఏ రకంగా జనాలకు సమాధానం చెప్పగలుతుంది అన్నది అతి పెద్ద ప్రశ్న.

బదనాం చేయడానికే..?

బీజేపీకి ఏపీలో పోయేదేమీ లేదు. అక్కడ జనాలు మెచ్చి నెత్తిన పెట్టుకున్న ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఎపుడూ చూస్తుంది. నాడు చంద్రబాబు అయినా నేడు జగన్ అయినా ఎవరూ వారికి దగ్గరి చుట్టం కారు. జగన్ కోరారని ఉక్కు ప్రైవేటీకరణ ఆపేస్తే ఆ మొత్తం క్రెడిట్ జగన్ కే పోతుంది. ఆయన రాజకీయంగా మరింత బలోపేతం అవుతాడు. ఈ లెక్కలు అన్నీ తెలిసిన బీజేపీ కోరి మరీ ఆ చాన్స్ ఇస్తుందా. ఇక దేశంలో విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాలనే లెక్క చేయకుండా ఉక్కు పాదం మోపుతున్న మోడీ ఏపీలో తనను పల్లెత్తు మాట అనడానికి కూడా ఆలోచించే ప్రాంతీయ పార్టీలను చూసి జడుసుకుంటారు అంటే అది ఉత్త మాటే అంటున్నారు. మొత్తానికి వైసీపీకి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం జీవన్మరణ సమస్యలాంటిది, అందుకే పులి మీద స్వారీకి నేతలు సిద్ధపడ్డారు, పులి తో చెలగాటమని దిగలేరు. ముందుకు సాగలేరు. ఇదీ వాస్తవ రాజకీయ ముఖ‌ చిత్రం.

Tags:    

Similar News