అమరావతి మీద జగన్ కొత్త ట్విస్ట్…?

ఏపీలో చూస్తే రోజు రోజుకూ అమరావతి రాజధాని ఆశలు అడుగంటిపోతున్నాయి. విపక్షాలు అన్నీ కూడా ఏకకంఠంతో అమరావతే మన ఒకే ఒక రాజధాని అంటే అనవచ్చు కాక. [more]

Update: 2020-12-26 13:30 GMT

ఏపీలో చూస్తే రోజు రోజుకూ అమరావతి రాజధాని ఆశలు అడుగంటిపోతున్నాయి. విపక్షాలు అన్నీ కూడా ఏకకంఠంతో అమరావతే మన ఒకే ఒక రాజధాని అంటే అనవచ్చు కాక. కానీ 151 సీట్ల బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బలమైన ముఖ్యమంత్రి జగన్ మాత్రం ససేమిరా అనే అంటున్నారు. ఆయన ఎపుడూ ఈ విషయాల గురించి మాట్లాడరు, సమయం సందర్భం వచ్చినపుడు కొన్ని హింట్లు ఇస్తారంటే. దానికి బట్టి అర్ధాలు పరమార్ధాలూ వెతుక్కోవాల్సిందే.

రాజధానిని నిర్మించుకుందాం….

అదేంటి అమరావతి రాజధాని అని ఒకటి ఇప్పటికే ఉంది కదా. దానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ శిల్పిగా ఉన్నారు కదా అని ఎవరైనా అనుకుంటే ఇప్పటికీ పప్పులో అలా కాలు వేసి ఉంచేసినట్లే. జగన్ కి అమరావతి రాజధాని అన్నది ఇష్టం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన మనసులోని ఆలోచనలకు మాత్రం అది అద్దం పట్టేలా లేదు అన్నది కచ్చితంగా జగన్ మాటల ద్వారానే తెలుస్తోంది. అదెలా అంటే ఇళ్ళ పట్టాల పంపిణీ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చూడాలి. కులమత వర్గ వర్ణాలకు తావు లేని రాజధానిని మనం నిర్మించుకుందామని కాకినాడ సభలో జగన్ పిలుపు ఇచ్చారు. మరి దీని సందేశం ఏంటి మహానుభావా అంటే చాలానే ఉంది అనే చెప్పాలిపుడు.

ఇదీ జగన్ డెఫినిషన్….

రాజధాని అంటే ఏమిటి అని ఎవరినైనా అడిగితే ఒక రాష్ట్రానికి ముఖ్య పట్టణం అని చెబుతారు. కానీ జగన్ ని అడిగితే ఆయన ఇలా చెబుతారు. అన్ని వర్గాల ప్రజలు హాయిగా కలసి ఉండేదే అసలైన రాజధాని అని కూడా అంటారు. మరి జగన్ చెప్పిన పద్ధతిలో చూస్తే అమరావతి అందరి రాజధాని అవునా కాదా అన్నదాని మీద‌ ఎవరి మటుకు వారికే సమాధానం దొరుకుతుంది. అమరావతిలో ఒక సామాజికవర్గం వారే పెద్ద ఎత్తున ఉన్నారంటూ వైసీపీ నేతలు తరచుగా చేసే విమర్శలు చూసినా, అక్కడ యాబై వేల మంది ఎస్సీలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వవద్దు అంటూ ఒక సామాజిక‌ వర్గం కోర్టుకు వెళ్ళిన సందర్భాన్ని చూసినా జగన్ ఎందుకు ఈ మాటలు అన్నారో ఇట్టే అర్ధమవుతుంది.

ఎక్కడ నిర్మిస్తారో…?

మూడు రాజధానులు అని ఇంతదాకా జగన్ అంటూ వచ్చారు. ఇపుడు అది హై కోర్టులో విచారణ దశలో ఉంది. మరో వైపు అమరావతిని ఏకైక రాజధానిగా వైసీపీ సర్కార్ ఉన్నంతవరకూ జగన్ సీఎం గా ఉన్నంతవరకూ అసలు ఒప్పుకోరు అని కచ్చితంగా చెప్పవచ్చు. మరి అన్నిటికీ అతీతమైన అన్ని వర్గాలతో కూడిన సమాజంతో కూడిన రాజధానిని నిర్మించుకుందామని జగన్ అనడమే అమరావతికి అసలైన బిగ్ ట్విస్ట్. అమరావతి రాజధానిగా వైసీపీ ఒప్పుకోవాలంటే అక్కడ భూముల మీద విచారణ జరిపించి అన్ని వర్గాలకు అక్కడ నివాస‌యోగ్యం కల్పించేలా చూడడం ఒక ఆప్షన్. అది జరగదు అనుకుంటే మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకు సాగుతూ విశాఖ లాంటి చోట మరో రాజధానిని కొత్తగా నిర్మించడం ఇంకో ఆప్షన్. మరి జగన్ మనసులో ఏముందో. ఎందుకు ఇలా అన్నారో కొద్ది రోజులు ఆగితే అపుడే తెలుస్తుంది.

Tags:    

Similar News