జగన్ మార్క్ మొదలైంది

అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలు చూసి చూడనట్టు పోయినా చలో ఆత్మకూరు లో ఓ సెక్షన్ మీడియా పూనకం వచ్చినట్టు రెచ్చిపోవడం చూసి వైఎస్ జగన్ [more]

Update: 2019-09-13 06:30 GMT

అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలు చూసి చూడనట్టు పోయినా చలో ఆత్మకూరు లో ఓ సెక్షన్ మీడియా పూనకం వచ్చినట్టు రెచ్చిపోవడం చూసి వైఎస్ జగన్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఇన్నాళ్లూ సున్నితంగా డీల్ చేద్దామని భావించినా ఓ వర్గం మీడియా దారికి రాకుండా నిత్యం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుండటం., కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టేలా కథనాలు వండి వారుస్తుండటంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు తిక్క రేగింది. గురువారం ఎమ్మెస్వోలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రులు తేల్చి చెప్పారు. నిజానికి కేబుల్ వ్యాపారం మొత్తం అదే సామాజిక వర్గం చెప్పు చేతల్లో ఉండటంతో గత పదేళ్ల రాజకీయ పోరాటంలో వైఎస్ జగన్ ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మీడియా నుంచి సహకారం అంతంత మాత్రంగా ఉన్నా 2019 ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయాన్ని కట్ట బెట్టారు. ముఖ్యమంత్రి గా పాలనలో కుదురుకోక ముందే వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం రోజుకో రకంగా సాగుతూ ప్రభుత్వాన్ని చిరాకు పెడుతోంది. పల్నాడు వ్యవహారంలో మీడియా ఏక పక్ష కథనాలతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. దీంతో ప్రభుత్వం ప్రతి చర్యలకు దిగింది. రెండు ప్రధాన చానెల్స్ ప్రసారాలను నిలిపి వేయాలని ఎమ్మెస్వోలకు మౌఖికంగా ఆదేశించింది.

అసలు కారణాలు వేరేనా….

వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా మీడియా కథనాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో దాదాపు అన్ని పత్రికలు, టీవీ లు ఏక పక్షంగా నాటి ప్రభుత్వానికి ప్రచారాన్ని ఉదరగొట్టాయి. ఇలా ప్రకటనల రూపంలో దాదాపు 100కోట్ల రూపాయలు మీడియా సంస్థలకు ప్రభుత్వం బాకీ పడింది. ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయనే ఉద్దేశంతో ముందస్తు ప్రచారం చేసిన మాధ్యమాలకు ఫలితాలతో ఊహించని షాక్ తగిలింది. పాత ప్రకటనల బకాయిల విషయంలో వైఎస్ జగన్ కఠినంగా వ్యవహరించడం, కొత్త ప్రకటనలు ఇవ్వకపోవడం వంటి విషయాల్లో అన్ని సంస్థలు గుర్రుగా ఉన్నాయి. దీంతో ఛాన్స్ రాగానే రెచ్చిపోయాయి.

వాటి లెక్క వేరే….

ఇక ప్రభుత్వ ఆగ్రహానికి గురైన రెండు ఛానెల్స్ విషయంలో వ్యక్తిగత వైరం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. వైఎస్ జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మొదటి నుంచి భుజానికి ఎత్తుకున్న ఛానల్ సంగతి చూడాలని వైఎస్ జగన్ పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నికలకు ముందు వైసీపీ తో కోరి శతృత్వం పెంచుకున్న ఛానల్ విషయంలో ఆర్థిక లావాదేవీలు ముడి పడి ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతాయి. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఆ సంస్థ కార్యాలయ స్థలంతో పాటు, కొన్నేళ్లుగా పెట్టుబడుల రూపంలో ఇచ్చిన నగదు విషయంలో విభేదాలు రావడంతో వైఎస్ జగన్ వ్యతిరేక పంథా పుచ్చుకున్నట్టు సమాచారం. నమ్మించి మోసం చేసిన వారిని ఉపేక్షించేది లేదని ఇప్పటికే వైసీపీ కీలక నేతలు సదరు ఛానల్ యాజమాన్యానికి సమాచారం కూడా ఇచ్చారని, పద్ధతి మార్చుకోవాలని చేసిన సూచనలు పట్టించుకోక పోవడంతో చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News