బ్రేకింగ్ : ఏపీలో 80 శాతం ప్రాంతంలో కరోనా లేదు

దేశంలో అన్నింటికన్నా ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా టెస్ట్ లు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇప్పటికే 75 వేల టెస్ట్ లను రాష్ట్రంలో నిర్వహించామన్నారు. గతంలో [more]

Update: 2020-04-27 13:02 GMT

దేశంలో అన్నింటికన్నా ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా టెస్ట్ లు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇప్పటికే 75 వేల టెస్ట్ లను రాష్ట్రంలో నిర్వహించామన్నారు. గతంలో ఎటువంటి టెస్ట్ ల సదుపాయం లేని రాష్ట్రంలో నెల రోజుల్లో సమూల మార్పులు చేశామన్నారు. ప్రతి పది లక్షల జనాభాకు 1396 టెస్ట్ లను నిర్వహిస్తున్నామన్నారు. తొమ్మిది వీఆర్డీఎల్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. 676 మండలాల్లో 63 మండలాలు రెడ్ జోన్, 54 మండలాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి. 559 మండలాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రాంతంలో ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు. నెల రోజుల్లో ఆసుపత్రులను పూర్తిగా సిద్ధం చేసుకోగలిగామన్నారు. 44 ట్రూనాట్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు. 40 వేల బెడ్స్ తో ఐసొలేషన్ వార్డులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. నెల రోజుల్లో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లను నియమించామని జగన్ చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పిస్తున్నామని జగన్ చెప్పారు. ఐదు కోవిడ్ క్రిటికల్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని చెప్పారు.

ప్రాణాంతక వ్యాధి కాదు……

మిగిలిన ఆసుపత్రుల్లో మే 15వ తేదీ నాటికి వైద్య సిబ్బందిని నియమిస్తామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఇప్పటికే గుర్తించామని చెప్పారు. రాష్ట్రం కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పేదలకు ఇబ్బంది లేకుండా పింఛను, రేషన్ ఇస్తున్నామని చెప్పారు. ఇన్ని చేస్తున్నా పూర్తిగా కరోనాను ఎవరూ కట్డడి చేయలేమని అన్నారు. కరోనా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కరోనాతో కలసి జీవించాల్సి ఉంటుందన్నారు. కరోనా అంటే ప్రాణాంతక వ్యాధి కాదని గుర్తుంచుకోవాలన్నారు. జీవనంలో కరోనా అంతర్భాగం అవుతుందన్నారు. వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందని జగన్ అన్నారు. 80 శాతం మంది కరోనా వచ్చినా తెలియని వారున్నారన్నారు. ఈ వ్యాధికారణంగా మరణించే వారి సంఖ్య కూడా తక్కువే అని అన్నారు. ఇది ఎవరికైనా రావచ్చు. తనకైనా రావచ్చని, జ్వరం లాంటిదేనని ప్రజలు గుర్తించాలన్నారు. ఎవరూ ఈ వ్యాధిని అంటరానిదని భావించవద్దన్నారు.

రానున్న రోజుల్లో….

కేసుల డబ్లింగ్ రేటులో దేశంలో కన్నా రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉన్నామని జగన్ చెప్పారు. మరణాల సంఖ్య కూడా 2.3 శాతం తో తక్కువగానే ఉన్నామని తెలిపారు. హాట్ జోన్లలో 70 శాతం టెస్ట్ లను నిర్వహించామన్నారు. గ్రీన్ జోన్లను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు భవిష్యత్ లో భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఇంటికీ మాస్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి మనిషికి మూడు మాస్క్ లు ఇస్తామని జగన్ తెలిపారు. ప్రజా రవాణా ను కొద్దిరోజుల పాటు ఆపే అవకాశముందన్నారు. గ్రీన్ జోన్స్ లో అన్ని రకాల యాక్టివీటీలు ప్రారంభమవుతాయన్నారు. రెడ్, ఆరెంజ్ జోన్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని ముస్లిం సోదరులకు జగన్ విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో సహకరిస్తున్న ప్రజలందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News