కొంద‌రి అత్యుత్సాహం.. జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతోందా..?

అవును! ఏపీ ప్రభుత్వంలో కొంద‌రు చేస్తున్న అత్యుత్సాహం వ‌ల్ల ప్రభుత్వం ఇరుకున ప‌డుతోందనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కొన్ని విష‌యాల్లో ఏం చేస్తే బాగుంటుంది? అని ఏ [more]

Update: 2020-04-22 02:00 GMT

అవును! ఏపీ ప్రభుత్వంలో కొంద‌రు చేస్తున్న అత్యుత్సాహం వ‌ల్ల ప్రభుత్వం ఇరుకున ప‌డుతోందనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కొన్ని విష‌యాల్లో ఏం చేస్తే బాగుంటుంది? అని ఏ సీఎం అయినా.. ప్రభుత్వంలో కీల‌కంగా ఉన్నవారిని అడుగుతారు. ఇది ఏ ప్రభుత్వంలో అయినా జ‌రిగేదే! అయితే, అప్పటి ప‌రిస్థితుల‌ను గుర్తించి గ‌మ‌నించి స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌డం అనేది స‌ల‌హాదారులుగా వారికి ఉన్న ధ‌ర్మం. అయితే, గ‌త చంద్రబాబు ప్రభుత్వంలో కానీ, ఇప్పుడు వైసీపీ ప్రభుబుత్వంలో కానీ.. నాయ‌కులు అధినేత‌ను మ‌చ్చిక చేసుకుని, వారి ద్వారా నామినేటెడ్ ప‌ద‌వులు సొంతం చేసుకోవాల‌ని భావించారు.

మచ్చిక చేసుకునేందుకే?

ఈ క్రమంలోనే వారు ఇచ్చిన అనేక స‌ల‌హాలు అప్పుడు.. ఇప్పుడు కూడా వివాదాల‌కు తావిచ్చాయి. గ‌తంలోనూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదానికి గుర‌య్యాయి. ముఖ్యంగా ప్రత్యేక హోదా విష‌యంలోను, పోల‌వ‌రం విష‌యంలోనూ ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదానికి తావిచ్చాయి. వీటివ‌ల్ల ఏకంగా రాష్ట్రానికి కూడా న‌ష్టం వ‌చ్చింది. వాటిని త‌ట్టుకునేందుకు చంద్రబాబు అనేక ప్రయ‌త్నాలు చేసి నా కూడా ఫ‌లించ‌లేదు. ఇక‌, ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వానికి అనేక మంది అనేక రూపాల్లో స‌ల‌హాలు ఇచ్చేందుకు ఉన్నారు. వీరంతా కూడా ఆచి తూచి వ్యవ‌హ‌రించ‌డం మానేసి.. ప్రభుత్వ పెద్ద జ‌గ‌న్‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

రంగుల విషయంలోనూ….

ఈ క్రమంలోనే వారు ఇస్తున్న స‌ల‌హాలు, సూచ‌న‌లుకూడా తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. కోర్టుల్లోనూ ప్రభుత్వం ఇబ్బంది ప‌డుతోంది. నిజానికి పంచాయ‌తీ భ‌వ‌నాలు.. ప్రభుత్వ కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు వేయ‌డం స‌రికాద‌ని గ‌తంలో రెండున్నరేళ్ల కింద‌టే సుప్రీం కోర్టు స్వయంగా ఓ కేసులో వెల్లడించింది. అయితే, రాష్ట్రంలో కొంద‌రు స‌ల‌హాదారులు మాత్రం త్వర‌లోనే పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి.. మ‌న‌కు భారీ ఎత్తున ప్రజ‌లు మ‌ద్ద‌తిచ్చారు. 151 మంది ఎమ్మెల్యేల‌ను ఇచ్చారు. కాబ‌ట్టి మ‌న పార్టీ రంగులు వేసేద్దాం.. అని స‌ల‌హా ఇచ్చారు. అంతేకాదు.. ఇది కోర్టుల‌కు వెళ్లినా.. ఈలోగా ఎన్నిక‌లు కానిచ్చేద్దాం.. అని సూచించారు.

సుప్రీంకోర్టు చెప్పినా…

అదే ఇప్పుడు ప్రభుత్వం మెడ‌కు ఉచ్చుగా బిగుసుకుంది. తాజాగా .. మ‌రోసారి హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బత‌గిలింది. వెనువెంట‌నే ప్రభుత్వ కార్యాల‌యాల‌కు వేసిన పార్టీ రంగుల‌ను తీసేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని కోరినా .. ఎన్నిక‌లు వాయిదా వేస్తామంటే..ఓకే అని చెప్పింది. మొత్తంగా ఈ వివాదానికి ఇంకా శుభం కార్డు ప‌డ‌క‌పోగా.. వివాదం మాత్రం ప్రభుత్వాన్ని మ‌రోసారి బోనులోకి నెట్టింది. ఇలా.. మొత్తంగా చూస్తే.. కొంద‌రు ఇస్తున్న స‌ల‌హాలు ప్రభుత్వానికి త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News