మళ్లీ రివర్స్ గేమ్ మొదలయిందిగా?

అవును. రాజకీయాల్లో ఒక్కోసారి సొంత బుర్రలు పెద్దగా పనిచేయవు. ప్రత్యర్ధుల వ్యూహాలే క్లిక్ అవుతాయి. అలా విజయవంతమైన స్ట్రాటజీలను తిరిగి తీసుకోవడం, వారి మీదనే వాటిని ప్రయోగించడం [more]

Update: 2020-11-08 15:30 GMT

అవును. రాజకీయాల్లో ఒక్కోసారి సొంత బుర్రలు పెద్దగా పనిచేయవు. ప్రత్యర్ధుల వ్యూహాలే క్లిక్ అవుతాయి. అలా విజయవంతమైన స్ట్రాటజీలను తిరిగి తీసుకోవడం, వారి మీదనే వాటిని ప్రయోగించడం ఎంత మాత్రం తప్పు కాదు. పైగా బతకనేర్చిన తీరు అని అంటారు. విషయానికి వస్తే జగన్ విపక్ష నేతగా ఉండగా బాబును అయిదేళ్ళ పాటు చెడుగుడే ఆడుకున్నారు. అలా ఇలా కాదు, అయిన దానికీ కానిదానికీ బాబునే కారణంగా చూపించేవారు. దాన్ని జనాలు నమ్మేలా ఊరూ వాడా మీటింగులు పెట్టి మరీ రెచ్చగొట్టారు. చివరికి జగన్ గెలిచారు. చరిత్రలో ఎరగని ఘోర పరాజయాన్ని బాబు అందుకున్నారు.

హోదా ఆయుధంతో …..

ప్రత్యేక హోదా అంటూ జగన్ అయిదేళ్ల పాటు చేసిన యాగీ అంతా ఇంతా కాదు, కేంద్రంలోని బీజేపీకి చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టేశారని కూడా ఆరోపించారు. చంద్రబాబు ప్యాకేజీలకు కక్కుర్తి పడి సంజీవిని లాంటి హోదాను ఏపీ కాకుండా చేశారని గుట్టుమట్లు కూడా విప్పి చెప్పారు. యువభేరీలు, సదస్సులు అంటూ రాష్ట్రమంతటా తిరిగి చంద్రబాబుని బాగానే బదనాం చేశారు. యువకులకు ఉద్యోగాలు లేకుండా చేసి చంద్రబాబు తన అధికారాన్ని కాపాడుకుంటున్నారని కూడా జగన్ నాడు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే హోదా అనే ఆయుధంతో టీడీపీ కొండను జగన్ గట్టిగానే మోదారు.

పోలవరంగా మారి …

పోలవరం వైసీపీకి ఇపుడు శాపమైంది. అటూ ఇటూ కనీసం కదలకుండా గట్టి దెబ్బేశారు మోడీ. మీరేంచేసుకుంటారో మీ ఇష్టం. 20 వేల కోట్లకు ఎక్కువ ఒక్క పైసా ఇచ్చేది లేదంటూ బాంబు లాంటి వార్తనే పేల్చేశారు. దాంతో జగన్ సర్కార్ నెత్తిన ఏకంగా ముప్పై వేల కోట్ల పెను భారం పడిపోయింది. అసలే మూలిగే నక్కలా ఏపీ ఆర్ధిక పరిస్థితి ఉంది. దాని మీద తాటిపండులా ఈ కొత్త బేరం ఏంటని వైసీపీ పెద్దలు హడలిపోతున్నారు. మోడీ మార్క్ రాజకీయం చూసిన వారెవరికైనా ఆయన వెనక్కు వస్తాడని, ఏపీ సర్కార్ చెప్పిన మాటలు వింటాడని కానీ నమ్మకం అసలు లేదు. ఇదే పాయింట్ తో వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయడానికి పోలవరమనే ఆయుధాన్ని పసుపు పార్టీ అందుకుంటోందిట.

జగనే కారకుడు …..

అపుడే చినబాబు జగన్ మీద బురద జల్లుడుని స్టార్ట్ చేశారు. జగన్ తనకున్న కేసులను మాఫీ చేయించుకోవడానికి పోలవరాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశాడని లోకేష్ గట్టిగానే గర్జిస్తున్నాడు. 22 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ ఇపుడు తన తల వంచుతున్నాడని కూడా లోకేష్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని, ప్రజల ఆశలను వైసీపీ పెద్దలు చిదిమేశారని కూడా విమర్శిస్తున్నారు. అంటే నాడు జగన్ కి హోదా సంజీవినిగా కనిపిస్తే ఇపుడు లోకేష్ బాబుకు పోలవరం జీవనాడిగాగా మారిందన్న మాట. ఈ రెండూ కూడా ఏపీ ప్రజలకు అవసరం అయినవే. కానీ వీటిని తేవడంలో కలసికట్టుగా కృషి చేయాల్సిన రాజకీయ పక్షాలు అసలు దోషి అయిన మోడీ సర్కార్ని కనీసం ఒక్క మాట అయినా అనకుండా తమ సొంత రాజకీయాన్ని చక్కగా చేస్తున్నాయని జనం భావిస్తున్నారు. నాడు జగన్ మోడీని తిట్టలేదు, అందుకే హోదా రాలేదు, ఇపుడు చంద్రబాబు కూడా డిటోగానే చేస్తున్నారు. మరి పోలవరం పూర్తి అవుతుందో లేదో కానీ జగన్ ని బదనాం చేసే పాలిటిక్స్ మాత్రం ఏపీలో మొదలైపోయిందని విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News