జగన్ ప్లాన్ వర్క్ అవుట్ కావడం లేదుగా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనంతట తాను ఎవరినీ పార్టీలోకి రమ్మనరు. ఆ సీన్ ను క్రియేట్ చేస్తారు. దీంతో పోలోమని టీడీపీ నేతలు తాడేపల్లి గడప తొక్కుతున్నారు. [more]

Update: 2020-11-01 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనంతట తాను ఎవరినీ పార్టీలోకి రమ్మనరు. ఆ సీన్ ను క్రియేట్ చేస్తారు. దీంతో పోలోమని టీడీపీ నేతలు తాడేపల్లి గడప తొక్కుతున్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుండటంతో వరస పెట్టి వైసీపీలో చేరిపోతారనుకున్నారు. కానీ జగన్ ఆశించిన రీతిలో జరగడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టారు. జగన్ తొలుత ఎమ్మెల్యేలపైనే గురిపెట్టారు. ఎమ్మెల్యేలు తగినంత మంది వస్తే టీడీపీ శాసనసభపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనతో తొలినాళ్లలో అన్ని ప్రయత్నాలు చేశారు.

నలుగురు ఎమ్మెల్యేలే……

కానీ జగన్ ఆలోచనకు అనుగుణంగా ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మాత్రమే వైసీపీకి మద్దతుగా నిలిచారు. అంటే 23 మంది ఎమ్మెల్యేలలో కేవలం నలుగురే వైసీపీ వైపు చూశారు. చాలా ప్రయత్నాలు జరిగినా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూడటం లేదు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్లు బలంగా విన్పించాయి.

ఆర్థిక మూలాలపై దాడి చేసినా…..

గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ కంపెనీలపై కూడా దాడులు జరిగాయి. భారీగా జరిమానాలు విధించారు. అయినా హైకోర్టుకు వెళ్లి వ్యాపారాలను రక్షించుకున్నారే తప్ప ఫ్యాన్ పార్టీ వైపు రాలేదు. ఏలూరి సాంబశివరావు పరిస్థితి కూడా అంతే. ఇక పార్టీలోకి వచ్చే వాళ్లలో గంటా శ్రీనివాసరావు పేరు ఒక్కటే వినపడుతుంది. అయితే ఆయన రాకకు అనేక ఇబ్బందులు ఉండటంతో ప్రస్తుతానికి పక్కన పెట్టారు.

బాబు సమర్థంగా…..

ఇక మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేరు కూడా వైసీపీలో చేరతారని ప్రచారం బాగా జరుగుతుంది. కానీ ఆయన రాకకు కూడా బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని చేర్చుకుని చంద్రబాబు ప్రతిపక్ష హోదాను తొలగించాలని చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లే కనిపిస్తుంది. ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు తప్పించి వెళ్లేవారు లేరనే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అదే జరిగితే జగన్ అనుకున్నది నెరవేరకపోవచ్చేమో.

Tags:    

Similar News