టీడీపీకి ఓ స‌ల‌హా .. ఆ రూట్ కరెక్ట్ కాదేమో?

ఒక‌వైపు టీడీపీ ఖాళీ అవుతోంది. ఆ జిల్లా ఈ జిల్లాఅనే తేడా లేకుండా.. ఆ నేత‌.. ఈ నేత అనే తేడా లేకుండా నాయ‌కులు జారిపోతున్నారు. ఈ [more]

Update: 2020-06-14 11:00 GMT

ఒక‌వైపు టీడీపీ ఖాళీ అవుతోంది. ఆ జిల్లా ఈ జిల్లాఅనే తేడా లేకుండా.. ఆ నేత‌.. ఈ నేత అనే తేడా లేకుండా నాయ‌కులు జారిపోతున్నారు. ఈ సమ‌యంలో పార్టీ అధినేత‌గా చంద్రబాబు చేయాల్సింది ఏమిటి ? అధికార ప‌క్షంపై విమ‌ర్శలు చేస్తూ కూర్చుంటారా ? లేక పార్టీని కాపాడుకుంటారా ? అనే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. ఇప్పటికైతే.. చంద్రబాబు పార్టీని కాపాడుకోవ‌డంపై దృష్టి పెట్టలేదు. కేవ‌లం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డంపైనే ఆయ‌న దృష్టి పెట్టారు. అందుకే పార్టీలో చంద్రబాబుపై న‌మ్మకం స‌న్నగిల్లుతోంద‌నే వాద‌న నేత‌ల నుంచి వినిపిస్తోంది. ఇక‌, ఇప్పటి వ‌ర‌కు ఎలా జ‌రిగిందో ఏమో.. ఇక నుంచైనా.. చంద్రబాబు.. జాగ్రత్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

యువనేతలకే ఎక్కువ బెంగ…..

మ‌రీ ముఖ్యంగా యువ నాయ‌కుల భ‌విత‌పై పార్టీలో బెంగ ఏర్పడింది. ఇప్పటి వ‌ర‌కు పార్టీ మారిన వారు అంటే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ మారిపోయిన వారిని గ‌మ‌నిస్తే.. య‌ువ నేత‌లే క‌నిపిస్తారు. గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ కానీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరిధ‌ర్ కానీ.. యువ‌కులే..! ఇక‌, చీరాల ఎమ్మెల్యేక‌ర‌ణం బ‌ల‌రాం త‌న కుమారుడి కోసం పార్టీ మారిపోయారు. విచిత్రం ఏంటంటే క‌ర‌ణం వెంక‌టేష్ పార్టీ మారుతున్నప్పుడు ప‌రిటాల శ్రీరామ్ ఫోన్ చేసి ఇది మ‌న పార్టీ… మ‌నం ఇందులోనే ఉండాలి… ఆ పార్టీలోకి మ‌నం వెళ్లడం ఏంట‌ని వారించిన‌ట్టు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే ప‌రిటాల శ్రీరామ్ కూడా టీడీపీ నుంచి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌ద్దామా ? అన్న ఆలోచ‌న‌లో ఉన్నారన్న వార్తలు వ‌స్తున్నాయి. ఇక ఏపీ తెలుగు యువ‌త రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అవినాష్‌కు ఆ పార్టీలో భ‌విష్యత్ క‌నిపించ‌కే వైసీపీలో చేరిపోయారు.

యువత అంటే ఎవరో?

ఇక‌, ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు కూడా త‌న కుమారుడి కోసం పార్టీ మారిపోయారు. అదే స‌మ‌యంలో మ‌రెంతో మందియువ నేత‌లు పార్టీ మార్పున‌కు ఎదురు చూస్తున్నారు. ఇదంతా చూస్తే.. కేవ‌లం యువ‌త భ‌విత కోస‌మే త‌మ్ము ళ్లు పార్టీ మారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. టీడీపీలో ఉంటే.. త‌మ పిల్లల‌కు భ‌విష్యత్తు ఉండ‌దు! అనే నిర్ణయానికి నాయ‌కులు వ‌చ్చేశారా? అని అనిపిస్తుంది. దీనికి ప్రధాన కార‌ణం యువ‌త‌ను ప్రోత్సహిస్తాన‌ని చెప్పిన చంద్రబాబు.. ఇప్పటి వ‌రకు వారి ఊసు ఎత్తలేదు పైగా యువ‌త అంటే.. కేవ‌లం త‌న కుమారుడు లేదా మ‌రికొంద‌రు అనుకునే వ‌ర‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. అంతేకాదు, చంద్రబాబు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో త‌న కుటుంబం నుంచి పోటీ చేసిన త‌న కుమారుడు, త‌న వియ్యంకుడు కుటుంబం నుంచి పోటీ చేసిన వ‌రుస‌కు కుమారుడి వ‌ర‌స అయ్యే గీతం యూనివ‌ర్సిటీ సీఈవో మ‌తుకుమిల్లి భ‌ర‌త్ లు ఓడిపోయారు.

లోకేష్ కోసమేనా ఇదంతా?

అయితే, వీరు ఓడిపోవ‌డం ఏమో కానీ.. వీరిని గెలిపించుకోలేక పోయార‌నే అపప్రధను మాత్రం చంద్రబాబు ఎదుర్కొనాల్సి వ‌స్తోంది. ఇక‌, యువ‌త‌లో స్థయిర్యం నింపేందుకు కూడా చంద్రబాబు ప్రయ‌త్నించ‌డం లేదు. ఇప్పటి వ‌ర‌కు నిర్వహించిన యువ స‌ద‌స్సుల‌కు కొద్దిమందినే ఆహ్వానించినా.. వారిని కూడా త‌న కుమారుడు లోకేష్‌కు మ‌ద్దతివ్వాల‌నే విధంగా ఒత్తిడి తేవ‌డం కూడా విమ‌ర్శల‌కు అవ‌కాశం ఇచ్చింది. టీడీపీలో రాజ‌కీయ భ‌విష్యత్తు వెతుక్కుందామ‌నుకుంటోన్న వారికి లోకేష్‌ను చూస్తే ఆ ఆశ‌లు క‌ల‌గ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పార్టీలో భారీ ప్రక్షాళ‌న అవ‌స‌రమ‌నే సూచ‌న‌లు అనంత‌పురం నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కు టీడీపీలో వినిపిస్తున్నాయి. మ‌రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? ప‌ర‌నింద‌ల ద్వారా పొందేది ఏమీలేద‌ని గుర్తిస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News