రాధాకృష్ణా… నీ పలుకు… నీ…కులుకు?

కమ్మ సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా ఆ సామాజిక వర్గం సామూహిక ఆత్మహత్యలకు సిద్ధమవుతోందని, ఆంధ్ర ప్రదేశ్ లో మేధావుల మెదళ్ళకు బూజు పట్టిందని ఈ మేథావి [more]

Update: 2019-12-22 13:49 GMT

కమ్మ సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా ఆ సామాజిక వర్గం సామూహిక ఆత్మహత్యలకు సిద్ధమవుతోందని, ఆంధ్ర ప్రదేశ్ లో మేధావుల మెదళ్ళకు బూజు పట్టిందని ఈ మేథావి రాసుకున్న “పలుకు” చదివిన తర్వాత ఇది నా స్పందన. ఆర్కే అంతటి మేధావిని కాకపోయినా ఏదో కొందరు మేధావులతో కొన్నేళ్ళుగా తిరిగిన పరిచయం కారణంగా ఆ మేధావుల గాలిసోకి ఇలా స్పందిస్తున్నాను.

వ్యతిరేకత రావడానికి…..

కమ్మ సామాజిక వర్గంపై ఆయన చాలా సానుభూతి ప్రకటించారు. ఆ సామాజిక వర్గం ఏకైక మేధో ప్రతినిధిగా స్పందించి, ఆ సామాజిక వర్గం సామూహిక ఆత్మహత్యకు పాల్పడే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏ రాజకీయ లక్ష్యంతో పనిచేస్తోందో రాజకీయంగానే విశ్లేషించాలి. కానీ సామాజికంగా ఇక్కడ చెప్పాల్సిందేమంటే కమ్మ సామాజిక వర్గానికి ఆర్కే మాత్రమే ప్రతినిధి కాదు. ఆమాటకొస్తే కమ్మ సామాజిక వర్గంపై ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఆర్కే లాంటి వాళ్ళు తమకు తాముగా ఆ సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ప్రకటించుకొని ఇతర సామాజిక వర్గాలపై పెత్తనం చేసే ప్రయత్నాలవల్లే. డబ్బు, అధికారం వల్ల వచ్చిన అహంకారంతో కొందరు ప్రవర్తించిన తీరు వల్లే మొత్తం కమ్మ కులంపై విద్వేషం వచ్చింది.

వీరంటే ఇప్పటికీ గౌరవమే…..

వాస్తవానికి ఎంతో మంది కమ్మ సామాజిక వర్గ నేతలను ప్రజలు ఇప్పటికీ గౌరవిస్తారు. దేశం కోసం, సమాజం కోసం, ప్రజలకోసం తమ సర్వస్వం త్యాగం చేసిన కమ్మ నేతలు ఎంతో మంది ఉన్నారు. రైతులకోసం పని చేసిన ఎన్ జి రంగా, కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వర రావు, మార్క్సిస్టు నేత మాకినేని బసవ పున్నయ్య, మానవతావాది త్రిపురనేని రామస్వామి చౌదరి, 1930లో మద్రాసు ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా చేసిన బొల్లిన మునుస్వామి నాయుడు, సెంట్రల్ ప్రావిన్స్ (ఇప్పటి మధ్య భారత దేశం)లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రామినేని కేశవేంద్ర రావు, సోషలిస్టు తుమ్మల చౌదరి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి భారీగా విరాళాలిచ్చిన బెజవాడలోని కాట్రగడ్డ మధుసూధన రావు కుటుంబం, ఇలా ఎంతో మంది ఉన్నారు. సోషలిస్టుగా జీవితం మొదలు పెట్టి రైతులకోసం పోరాడే వడ్డే శోభనాద్రీశ్వర రావు, కార్మిక వర్గ హక్కుల పోరాటంలో జార్జ్ ఫెర్నాండేజ్ కు అండగా నిలిచిన వాసిరెడ్డి వెంకట కృష్ణా రావు లాంటి వాళ్ళతో పాటు ప్రజలకోసం తమ ఆస్తులూ, జీవితాలు త్యాగం చేసిన అనేకమంది కమ్మ నేతలు ప్రజల మనస్సులో ఇంకా పదిలంగానే ఉన్నారు. ఇంకా ప్రజల స్మృతుల్లో ఉంటారు. వేలమందికి ఉపాధి కల్పించిన కె ఎల్ ఎన్ ప్రసాద్ ను మర్చిపోగలమా? వైద్యవృత్తిలో నిస్వార్ధంగా సేవలందించిన పిన్నమనేని వెంకటేశ్వర రావును, మాదిగలు చెప్పులు కుట్టే తోలును పరిశ్రమగా వృద్ధి చేసిన లెథర్ టెక్నాలజీ నిపుణుడు నాయుడమ్మను ప్రజలు మర్చి పోగలరా? ద్వేషించగలరా?

వీరిని మర్చిపోగలమా?

రాజకీయాల్లో రెడ్డి, వెలమ, క్షత్రియ కులాల నేతలకు ఏమాత్రం తీసిపోని గొప్ప పాలకులుగా చరిత్రలో నిలిచిన ముక్త్యాల రాజాను, చల్లపల్లి రాజాను, కపిలేశ్వరం రాజాను, మర్చిపోగలరా? వారిని ద్వేషించగలరా? రైతులకు అండగా నిలిచి కె సి పి, ఆంధ్రా షుగర్ వంటి పరిశ్రమలు స్థాపించిన వారిని కేవలం కులం కారణంగా ద్వేషించగలరా?రాజకీయం, వ్యవసాయం, పారిశ్రామికం, సామాజిక సేవ తదితర రంగాల్లో అగ్రస్థానంలో నిలబడిన కమ్మ నేతలను ఈ సమాజం ద్వేషించగలదా? ధాతృత్వానికి ప్రతిరూపంగా నిలిచి తమ సర్వస్వం ప్రజలకోసం త్యాగం చేసిన కమ్మ స్త్రీ, పురుష నేతలు ఎందరో ఉండగా, వారందరినీ ఇప్పటికీ స్మరించి, గౌరవించే పరిస్థితులు ఉన్నాయి అనేది వాస్తవం. ఇప్పటికీ కొందరు కమ్మ నేతల పేర్లు చెపితే నిలబడి నివాళులర్పించే గ్రామాలు అనేకం ఉన్నాయి రాష్ట్రంలో. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

వీరి వల్లనే కాదా?

హరిత విప్లవం తర్వాత వ్యవసాయంలో లాభాలు రావడం, వారసుల్ని చదువులకోసం విదేశాలకు పంపడంతో ఆర్ధిక, విద్యా రంగాల్లో ఆధిపత్యం సాధించి, ఎన్టీఆర్ ప్రవేశంతో రాజకీయాల్లో కూడా ఆధిపత్యం సాధించిన తర్వాత ఈ కులంలోని కొందరిలో మానసిక మార్పు వచ్చింది. రాజకీయంగా అప్పటివరకూ ఆధిపత్యంలో ఉన్న రెడ్లపై దాడి మొదలుపెట్టి తమ ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేశారు. 1980 నుండి 1994 వరకు నెమ్మదిగా సాగిన ఈ కులాధిపత్య ధోరణి 1995 తర్వాత వేగంగా, బలంగా, బహిరంగంగా కొనసాగింది. పింగళి దశరధ రామ్, వంగవీటి రంగా హత్యలు ఈ ఆధిపత్య ధోరణితో పనిచేస్తున్న కొందరు కమ్మ నేతలకు మరింత ఊతం ఇచ్చింది. అది ఈ కులంలోని యువతరానికి అహంకారాన్ని పెంచింది. అంటే 1985 తర్వాత కాలం నుండి నేటివరకు వచ్చిన, వస్తున్న యువతరమే అధికారం, అహంకారం, ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఈ విధానం వల్లనే ఈ సామజిక వర్గంపై ఇతర సామాజిక వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది.

తెలంగాణ ఉద్యమానికి….?

“ఆంధ్రోళ్ళు వద్దు, వెళ్ళిపోండి. మా పాలన మేం చేసుకుంటాం” అని తెలంగాణ ప్రజలూ ఉద్యమకారులు అన్నది మొత్తం ఆంధ్రోళ్ళని కాదు. “అది అమరావతి కాదు కమ్మరావతి” అన్నది కూడా ఈ అహంకార, ఆధిపత్య ధోరణితో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలను మాత్రమే. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న కులం, ఎన్నో త్యాగాలు చేసిన కులం, ఎందరో గొప్ప నేతలను, సంస్కర్తలను, త్యాగమూర్తులను, పారిశ్రామిక, విద్యావేత్తలను అందించిన ఈ కులం ఇప్పుడు ఇంత ద్వేష భావాన్ని ఎదుర్కోవలసి వస్తోందంటే అది గత మూడు దశాబ్దాల్లో అధికారం, అహంకారం, ఆధిపత్యం చెలాయించడం, ఇతర కులాలను గౌరవించకపోగా అవమానించడం చేస్తున్న “నడమంత్రపు సిరి” గాళ్ళతప్పే కానీ, సదరు మొత్తం కులానిది కాదు. ఈ విషయం ఆ కులంలో కొందరికి తెలంగాణ ఉద్యమంలోనే అర్ధమయినా ఎందుకో మౌనంగా ఉన్నారు. అదే ధోరణి అమరావతిలో కొనసాగినా మౌనంగానే ఉన్నారు. ఈ మౌనానికి ఇప్పుడు కులం మొత్తం దోషిగా నిలబడి మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

వీళ్లు కావాలి…..

ఇప్పుడు ఈ కులానికి కావలసింది “సామూహిక ఆత్మహత్యలు చేసుకోవాలా” అని రెచ్చగొట్టే నాయకులు కాదు, సంస్కారం, మానవతావాదం నేర్పిన త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వారు. ఉన్నదంతా ఆక్రమించుకొని అనుభవిద్దాం అనే వాళ్ళు కాదు, పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించిన వెలగపూడి, ముళ్ళపూడి కుటుంబాలు. రైతుతో పాటు రైతు కూలీ కూడా బ్రతకాలి అనే ఆర్ధిక సమానత్వం నేర్పిన చండ్ర, మాకినేని వంటి వారు కావాలి. ఆస్తులు ఇచ్చిన కాట్రగడ్డ కుటుంబాలు కావాలి… అధికారం, ధనం తోడై అహంకారంతో ఆధిపత్య ధోరణితో ఉండే వాళ్ళు కాదు, మనతోపాటు అందరూ బ్రతకాలి అనే ధోరణితో ఉండే వాళ్ళు కావాలి. అంతే కానీ ఆర్కే రాసుకున్నట్టు ఆ సామాజిక వర్గం మొత్తం సామూహిక ఆత్మహత్య చేసుకోవాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఆ సామాజిక వర్గానికి భూములున్నాయి కాబట్టి అమరావతిలో రాజధాని వద్దని ఎవరూ అనుకోవడం లేదు. ఆ సామాజిక వర్గంలో అహంకారంతో, ఆధిపత్య ధోరణితో ఇతర సామాజిక వర్గాలపై పెత్తనం చేసిన వారికి భూములు ఉన్నాయి కాబట్టి రాజధాని అమరావతి నుండి వెళ్ళిపోతున్నా ఎవరూ మాట్లాడడం లేదు.

 

 

– గోపి దారా

Tags:    

Similar News