సంక్షేమమే అన్ని పార్టీలకూ ప్రధాన అస్త్రం!!

శ్రీలంకకు,భారతదేశంలోని రాష్ట్రాలకూ పొంతన ఉందా? ఏపీ త్వరలో శ్రీలంకలా మారిపోతుందంటూ

Update: 2023-08-25 15:18 GMT

శ్రీలంకకు,భారతదేశంలోని రాష్ట్రాలకూ పొంతన ఉందా? ఏపీ త్వరలో శ్రీలంకలా మారిపోతుందంటూ టీడీపీ, జనసేన ఆరోపిస్తూ వచ్చాయి.ఈ మధ్యనే ఆ పార్టీల స్వరం కొద్దిగా మారింది.జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోయినా ఇప్పుడు అమలులో ఉన్న సంక్షేమ పథకాలేవీ ఆగిపోవని పవన్ కళ్యాణ్ అన్నారు.అంతకు ముందు రాజమండ్రి మహానాడులోనూ సంక్షేమ పథకాలను చంద్రబాబు జపం చేశారు.

అప్పులలో కూరుకుపోయి,ఆర్ధికంగా సంక్షోభ దిశగా పయనిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతున్న రాష్ట్రాలన్నీ దేశంలో అంతర్భాగంగా ఉన్నాయి.రాష్ట్రాలు విడిగా లేవు.ప్రత్యేక దేశాలుగా ప్రకటించుకోలేదు.ఢిల్లీలోని కేంద్రప్రభుత్వంతో సంబంధం లేకుండా అప్పులు చేసే అవకాశాల్లేవు.అలాగే అందరిదీ అంబేద్కర్ రాజ్యాంగమే ! అటువంటప్పుడు కొన్ని రాష్ట్రాలను,అవికూడా బిజెపియేతర పార్టీల పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,పశ్చిమ బెంగాల్,తెలంగాణ వంటి రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చెప్పడం బీజేపీ రాజకీయ ఉద్దేశాలను బయటపెడుతున్నది.

రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందన్నది సాధారణ సూత్రం.కానీ రాష్ట్రాలు బలహీనపడాలని కోరుకోవడం,బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం బీజేపీ కుట్రలను బహిర్గతం చేస్తోంది.''రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు. రాష్ట్రాలు పన్నులు కట్టకుండా, కేంద్రానికి ఎటువంటి ప్రతిపత్తీ లేదు కేంద్రం అనేది మిథ్య''అని తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్ఠీఆర్ చెప్పిన సంగతిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలు సభల్లో గుర్తు చేశారు.దేశంలో అభివృద్ధి ఏ ప్రాంతంలో జరిగినా అది దేశ జీడీపీకే సమకూరుతుంది.

''దేశానికి,రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి,తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం నేరపూరిత చర్య''అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడాది కిందటే అన్నారు.

శ్రీలంక ఆర్ధిక సంక్షోభం,ఆ దేశంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులపై కేంద్రప్రభుత్వం 2022 జూలైలో అఖిలపక్షసమావేశాన్ని నిర్వహించింది.అందులో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,బెంగాల్ వంటి రాష్ట్రాలు ఎట్లా అప్పులల్లో కూరుకుపోయాయో ఒక జాబితాను కేంద్రం వెల్లడించింది.బిజెపియేతర పార్టీల పాలిత రాష్ట్రాలను ఆర్థికంగా దిగజార్చడం,రాజకీయంగా దెబ్బతీయడం,లొంగదీసుకోవడం వంటి వికృత క్రీడ తొమ్మిదేళ్లుగా జరుగుతూనే ఉన్నది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రతిఏటా కేంద్రం ప్రకటిస్తుంది.ఆ తర్వాతే రాష్ట్రాలు వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయి.తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం రూ.53వేల కోట్లుగా ప్రకటించి తర్వాత కేంద్రం మాట మార్చివేసింది.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా,కక్షపూరితంగా రూ.23వేలకోట్లకు కుదించింది.విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయిన వారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాలమీద ఒత్తిడి తీసుకురావడం పట్ల బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తున్నవి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నీతి ఆయోగ్ పలు సందర్భాల్లో ఏపీ,తెలంగాణలను ప్రశంసించింది.వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం ప్రోత్సహించాలని కూడా 'నీతి ఆయోగ్' చేసిన చేసిన సిఫారసులు బుట్ట దాఖలు చేసింది.

గతంలో కేంద్ర -రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై అధ్యయనం చేసిన కమిటీ తన నివేదికలో ఓపెన్‌ మార్కెట్‌ నుంచి నేరుగా కేంద్రం అనుమతితో సంబంధం లేకుండా అప్పు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలని,రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అనుసరించి మార్కెట్‌ క్రెడిట్‌ రేటింగ్స్‌ లభిస్తాయని తెలియచేసింది.

ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాల మూలంగా అటు అర్బన్,ఇటు రూరల్ ప్రాంతాల్లోనూ పేదరికం సగానికి పైగా తగ్గిందని స్వయంగా 'నీతి ఆయోగ్' వెల్లడించింది.సంక్షేమ పథకాలు,ఉచితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.కానీ సంక్షేమ కార్యక్రమాల హామీ లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించే పరిస్థితి లేదు.


Tags:    

Similar News