అక్కడ చింతమనేని ఇక్కడ…?

విశాఖ జిల్లాలో వైసీపీకి కంట్లో నలుసుగా ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ [more]

Update: 2019-10-16 05:00 GMT

విశాఖ జిల్లాలో వైసీపీకి కంట్లో నలుసుగా ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఆయన విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వరసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టేశారు. అంతవరకూ మద్యం వ్యాపారిగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు లక్కు పరీక్షించుకుందామని కొత్తగా అప్పట్లో ఏర్పాటైన తూర్పు సీటు నుంచి బాలయ్య ద్వారా టికెట్ తెచ్చుకుని మరీ పోటీ చేశారు. ఓ వైపు చిరంజీవి ప్రజారాజ్యం ప్రభంజనం, మరో వైపు కాంగ్రెస్ లో వైఎస్సార్ ఇమేజ్ ఇలా అన్ని విధాలుగా ప్రతికూలతలు ఉన్నా కూడా కేవలం మూడు వేల ఓట్లతో బయటపడిపోయారు. 2014 నాటికీ అది 48 వేల మెజారిటీ అయింది. ఇక 2019 ఎన్నికల నాటికి పాతిక వేల పై చిలుకు మెజారిటీతో హ్యాట్రిక్ విక్టరీని సొంతం చేసుకున్న వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ సర్కార్ మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. నేరుగా జగన్ మీదనే మాటల దాడి చేస్తున్నారు.

ఆ కేసు అలా ఉండగానే….

మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు విజయోత్సవ ఊరేగింపుని కూడా ఎన్నికల నియమాలకు వ్యతిరేకంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహించారు. ఆ సందర్భంగా వెలగపూడి రామకృష్ణబాబు అప్పటికే వైసీపీకి మెజారిటీ వచ్చి సీఎం అవుతాడని తెలిసినా కూడా జగన్ ని అసభ్యపదజాలంతో దూషించారు. దాని మీద వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. అది అలా ఉండగానే తాజాగా చంద్రబాబు విశాఖ వచ్చిన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీయడం, ఏకంగా పోలీసులనే నిలదీయడం, వాగ్వాదం పెంచుకోవడం వంటివి చేసి వరసగా నాలుగైదు కేసుల్లో వెలగపూడి రామకృష్ణబాబు ఇరుక్కున్నారు. దీంతో ఇపుడు వెలగపూడి మీద వైసీపీ సీరియస్ గానే దృష్టిపెట్టిందని అంటున్నారు.

గట్టిగా ఇరికిస్తారా…?

విశాఖ తూర్పులో బలమైన నాయకుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. అన్నగారి భక్తుడు, పసుపు జెండా ఆరాధకుడు. ఆయన టీడీపీ ఓటమిని అసలు తట్టుకోలేకపోతున్నారు. దాంతో వైసీపీ మీద చీటికీ మాటికీ విరుచుకుపడుతున్నారు. టీడీపీ హయాంలో మధ్యం సిండికేట్ నడిపి బాగానే సంపాదించిన వెలగపూడి రామకృష్ణబాబు తూర్పు నియోజకవర్గంలో ఉన్న పేదలను ఆకట్టుకుని బలం పెంచుకున్నారు. ఆయన అక్కడ గట్టిగా నిలబడినంతవరకూ వైసీపీకి ఫ్యాన్ ఉన్నా కూడా ఉక్కబోత తప్పదు. అందువల్ల వెలగపూడి రామకృష్ణబాబు మీద కేసులు బలంగానే పెట్టాలని వైసీపీ నిర్ణయించిందని అంటున్నారు. మరో చింతమనేనిలా వెలగపూడి మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని కూడా తిరగతోడాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు గతంలో విజయవాడలో వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. దాంతో పాటు మధ్యం సిండికేట్ లోనూ అక్రమాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా పాతవీ, కొత్తవీ కేసులను పెట్టడం ద్వారా వెలగపూడిని పూర్తిగా అణగదొక్కాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి వైసీపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News