ఈ ప్రచారం నమ్మబుల్ గా ఉందా… ?

ఆయన టీడీపీకి వీర విధేయుడు. ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వాడు. పైగా కరడు కట్టిన కార్యకర్త. అటు నందమూరికి ఇటు నారాకు అత్యంత ఇష్టుడైన [more]

Update: 2021-06-04 09:30 GMT

ఆయన టీడీపీకి వీర విధేయుడు. ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వాడు. పైగా కరడు కట్టిన కార్యకర్త. అటు నందమూరికి ఇటు నారాకు అత్యంత ఇష్టుడైన ఎమ్మెల్యే. ఆయనే విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు. పసుపు పార్టీకి ప్రతిరూపమైన రామక్రిష్ణ బాబు టీడీపీని వీడుతారు అంటూ ఈ మధ్యన వస్తున్న వార్తలు అందరికీ విస్మయానికి గురి చేస్తున్నాయి. అది సాధ్యమేనా అన్న చర్చ కూడా సాగుతోంది.

కొట్టి పారేస్తున్నారు…..

చిత్రమేంటి అంటే టీడీపీలోనే దాన్ని అంతా కొట్టి పారేస్తున్నారు. ఇది వైసీపీ నేతల మైండ్ గేమ్ అని కూడా అంటున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విక్టరీని కైవశం చేసుకున్న వెలగపూడి రామక్రిష్ణబాబుకి వేరే పార్టీలోకి వెళ్ళాల్సిన అగత్యం అవసరం ఏంటి అన్న ప్రశ్నను కూడా తమ్ముళ్ళు సంధిస్తున్నారు. ఆయన నేరుగా అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని, ఇక బాలక్రిష్ణకు అతి ముఖ్యమైన అనుచరుడు అని చెబుతున్నారు. పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి అయ్యే అర్హత ఉన్న వెలగపూడి రామక్రిష్ణబాబుకి ఇపుడు జంప్ చేయాల్సిన సీన్ లేదని అంటున్నారు.

అసలు ఎందుకిలా ?

వెలగపూడి రామక్రిష్ణబాబు వైసీపీలోకి వస్తారట అంటూ ఒక ప్రచారం అయితే కొన్నాళ్ళుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయాక ఈ ప్రచారానికి తెర లేవడం విశేషం. లోకల్ బాడీ ఎన్నికల్లో వెలగపూడి నియోజకవర్గంలో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. కేవలం మూడే టీడీపీకి దక్కాయి. అంటే వెలగపూడి ప్రభ మసకబారినట్లే కదా. పైగా ఇక్కడ యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది. వారి నుంచే అక్రమాని విజయనిర్మలకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఇంత క్లారిటీగా ఉన్న వేళ ఎందుకు వెలగపూడి అవసరం వైసీపీకి ఉంది అన్నదే చర్చగా ఉంది.

అనుమానాలు అవే…?

అసలు వీటన్నిటికీవెలగపూడి రామక్రిష్ణబాబు వ్యవహార శైలే కారణం అంటున్నారు. ఆయన ఈ మధ్య వైసీపీ మీద విమర్శలు చేయడంలేదు. ఆయన భూ కబ్జాలకు పాల్పడ్డారని వైసీపీ మూడు నెలల క్రితం ఆరోపణలు చేసింది. ఆయన ఆక్రమించుకున్న కొంత భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఏకంగా విజయసాయిరెడ్డి, వెలగపూడి సవాళ్ళు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గం మీద దృష్టి పెట్టి మరీ కలియతిరిగారు. దాంతో వైసీపీకి మంచి రిజ‌ల్ట్ కూడా వచ్చింది. ఆ తరువాత వెలగపూడి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. నిజానికి విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గమ్మున ఉన్నారు. ఇక మరో ఎమ్మెల్యే గణబాబు కూడా నోరు విప్పడంలేదు. అందరికీ బదులుగా వెలగపూడి ఒక్కరే వైసీపీ మీద విరుచుకుపడతారు. అయితే కొన్నాళ్ళుగా ఆయన కూడా మౌనమే నా భాష అంటున్నారు. ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు. రంగా హత్య కేసు ముద్దాయి అంటూ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు తోడు ఆయన అమరావతికి జై అంటూ విశాఖ క్యాపిటల్ ని వ్యతిరేకించిన తీరుతో కొంత ఇబ్బంది పడుతున్నారు. బహుశా ఆయన వీక్ నెస్ ని చూసే పార్టీ ఫిరాయిస్తారు అన్న ప్రచారం పుట్టిస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక మాట. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. అందువల్ల దేన్నీ కొట్టి పారేయలేమని కూడా అటూ ఇటూ నాయకులు అంటున్నారు

Tags:    

Similar News