వైసీపీలో చేరతానన్నారు కానీ?

టీడీపీ నేత వీరశివారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరటం లేదట. వీరశివారెడ్డి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనలో ఉన్న [more]

Update: 2019-10-26 14:30 GMT

టీడీపీ నేత వీరశివారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరటం లేదట. వీరశివారెడ్డి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వీర శివారెడ్డి కూడా వైసీపీలో చేరతానని ప్రకటించారు. జగన్ అమెరికా నుంచి రాగానే తాను పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. కానీ జగన్ అమెరికా వెళ్లొచ్చి రెండు నెలలు దాటుతున్నప్పటికీ వీర శివారెడ్డి వైసీపీలో చేరలేదు. అంతేకాకుండా వీరశివారెడ్డి రాకకు కొందరు కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలే అడ్డుపడటంతో జగన్ ఆయన చేరిక పట్ల సుముఖంగా లేరని చెబుతున్నారు.

టీడీపీలో గ్రూపులతో….

వీర శివారెడ్డి కమలాపురం నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన మొన్నటి ఎన్నికల వరకూ టీడీపీలోనే ఉన్నారు. అయితే కమలాపురం నియోజకవర్గంలో టీడీపీలో రెండు గ్రూపులున్నాయి. ఒకటి వీర శివారెడ్డి వర్గం కాగా, మరొకటి పుత్తానరసింహారెడ్డి వర్గం. పుత్తా నరసింహారెడ్డితో వీరశివారెడ్డికి ఆది నుంచి పడదు. అయినా అప్పట్లో సీఎం రమేష్ వంటి నేతలు వారికి సర్దిచెప్పేవారు. మొన్నటి ఎన్నికల్లో వీర శివారెడ్డి కమలాపురం, ప్రొద్దుటూరు స్థానాలను ఆశించినా రెండింటిలో ఏదీ ఇవ్వలేదు.

గత ఎన్నికల్లో….

దీంతో వీర శివారెడ్డి వర్గం కమలాపురం నియోజకవర్గంలో పరోక్షంగా మద్దతు పలికింది. కమలాపురం నియోజకవర్గం నుంచి జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే వీర శివారెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ హయాంలో డీసీసీబీ ఛైర్మన్ గా పనిచేశారు. ఇప్పుడు వైసీపీ దీనికి అంగీకరించే పరిస్థితిలేదు. రవీంద్రనాధ్ రెడ్డి కూడా వీర శివారెడ్డి చేరికకు సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. వీర శివారెడ్డి గత కొంతకాలంగా వైసీపీలో చేరాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

బీజేపీలో చేరాలని…..

వీర శివారెడ్డికి జిల్లా వైసీపీ నేతలే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. దీంతో విసుగు చెందిన వీరశివారెడ్డి టీడీపీలో మాత్రం ఉండలేనని స్పష్టంగా చెబుతున్నారు. ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను వైసీపీలో చేరాలనుకున్నప్పటికీ వారు సహకరించకుంటే తాను ఏం చేయగలనని వీర శివారెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ సీఎం రమేష్ వీర శివారెడ్డికి మద్దతుగా నిలిచారు. అందుకే ఆయన సలహాతోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద వైసీపీలో వీర శివారెడ్డి చేరడం లేదన్నది స్పష్టమయింది.

Tags:    

Similar News