పంతం… ప్రతిఘటన

నవ్యాంధ్ర ఇప్పుడు కూడలిలో కూర్చుంది. పంతం పట్టి ప్రభుత్వం ఒకవైపు, ప్రతిఘటించేందుకు విపక్షాలు మరోవైపు సమీకరిస్తున్నాయి. ఎట్టకేలకు జేఏసీ రూపంలో సర్కారీ వ్యతిరేకపోరాటం ఏకతాటిపైకి వచ్చి సమైక్యమవుతున్న [more]

Update: 2020-01-09 15:30 GMT

నవ్యాంధ్ర ఇప్పుడు కూడలిలో కూర్చుంది. పంతం పట్టి ప్రభుత్వం ఒకవైపు, ప్రతిఘటించేందుకు విపక్షాలు మరోవైపు సమీకరిస్తున్నాయి. ఎట్టకేలకు జేఏసీ రూపంలో సర్కారీ వ్యతిరేకపోరాటం ఏకతాటిపైకి వచ్చి సమైక్యమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాంతాల వారీ అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ వంటి మాటలెన్ని చెప్పినా ప్రత్యక్షంగా రాజకీయాలు బయటకొచ్చి కాట్లాడుతున్నాయి. మలుపులో నిలుచుని మౌనంగా చూస్తున్న రాజధాని ఎటు తేలుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

శషభిషలు…

ప్రభుత్వం తేనె తుట్టను కదిపింది. అందులోని లాభనష్టాలను బేరీజు వేసే పనిలో పడింది. తాను ఆశించింది అనుకున్నట్లుగా సాగితే ఫర్వాలేదు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. హైకోర్టు, కార్యనిర్వాహక రాజధానులు రెంటినీ రెండు ప్రాంతాలకు తరలించగలిగితే ఎంతోకొంత మేరకు రాజకీయ ప్రయోజనం లభించవచ్చు. ఏదో ఒక దానికి ఆటంకం ఏర్పడితే మాత్రం అసలుకే నష్టం. అందుకే కొందరు నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మూడు రాజధానులపై ఇంకా నిర్ణయం కాలేదంటున్నారు. అయితే ఆ స్వరాలు పేలవంగా, బలహీనంగా మాత్రమే వినిపిస్తున్నాయి. ప్రజల సెంటిమెంటు కూడా ముడిపడి ఉన్న దృష్ట్యా ప్రాంతీయ రాజకీయ సమతుల్యత అన్నది తాజాగా వైసీపీలో సాగుతున్న చర్చ. రాజధాని ప్రాంతంలోని నాయకులు అంతర్గత సమావేశాల్లో సన్నిహితుల వద్ద తమ రాజకీయ భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతున్నట్లుగా సమాచారం. అయితే అధిష్టానాన్ని ధిక్కరించి మాట్లాడేంత సాహసం ఎవరికీ లేదు. పైపెచ్చు జగన్ అనే మంత్రంతోనే తామంతా ఎన్నికయ్యామన్న స్పృహ వారందరికీ ఉంది. మునిగినా తేలినా అధిష్టానమే వారికి మార్గదర్శకం. అందుకే మూడు రాజధానులకు సంబంధించిన తుది తీర్పును అధిష్ఠానం భుజస్కంధాలపైనే ఉంచేశారు.

ఎట్టకేలకు…

మూడు ప్రాంతాలను ముందుకు తెచ్చి సర్కారు బహిరంగంగానే విపక్షాలకు సవాల్ విసిరింది. ప్రత్యేకించి తెలుగుదేశాన్ని టార్గెట్ చేసింది. ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశం కాదన్నట్లుగా చూపించాలనేది ప్రభుత్వ తపన. సామాజిక వర్గాన్ని, పెట్టాల్సిన ఖర్చును, తెలుగుదేశం బినామీలను ముందుకు తేవడం ద్వారా ఇది తమకు సంబంధం లేదని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలు భావించాలనే వ్యూహంతో నడిచింది అధికారపార్టీ. నిజంగానే కొంతమేరకు అది ఫలించింది. కృష్ణా,గుంటూరు జిల్లాలు సైతం తీవ్రస్థాయిలో స్పందించకపోవడానికి కారణమదే. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా కాచుకుంటూనే ప్రభుత్వానికి ఎదురొడ్డాలని చూసింది ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం. అందుకే ప్రాంతాలవారీ భిన్న స్పందనలు వినిపించాయి. దాంతో రాజధాని అంశం రాజకీయ సమస్యగానే కనిపించింది. తాజాగా సంయుక్త కార్యాచరణ సమితి రంగంలోకి రావడంతో పార్టీలకు సైతం ఉత్సాహమొచ్చింది. ఒకే ఒక రాజకీయ పార్టీగా టీడీపీ మొత్తం తానై వ్యవహరించకుండా జేఏసీకి వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీ వైఖరిని ఏకతాటిపైకి తీసుకు వచ్చే అవకాశం లభించింది. చంద్రబాబు నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే ఘట్టమైంది. దాంతో టీడీపీ శ్రేణులు ప్రాంతాలవారీగా ఉన్న సెంటిమెంట్లను పక్కనపెట్టి అధిష్టానం సూచనల మేరకు ఒకే బాటలోకి రావాల్సి వస్తోంది.

కేంద్రం ప్రభుత్వం…

కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు ఇప్పటికిప్పుడు ఆగమేఘాల మీద ఈ రాజధానుల వ్యవహారంలో జోక్యం చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్రప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పార్టీగా తన ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండానే ఇంతవరకూ స్పందిస్తూ వస్తోంది. భవిష్యత్ రాజకీయ అవసరాలనూ దృష్టిలో పెట్టుకుంటోంది. ఎదగాలనుకుంటున్న పార్టీ కాబట్టి సహజంగానే వైసీపీ, టీడీపీలు రెంటీకీ జరిగే నష్టం తమకి లాభమని కమల నాథులు ఆశించడంలో తప్పులేదు. పార్టీల ప్రయోజనాలు, రాజకీయాలు, నాయకుల స్వార్థాలు తాత్కాలిక అంశాలే. రాష్ట్ర రాజధాని పరిపాలనకు గుండెకాయ. తరతరాల ప్రస్థానాన్ని నిర్దేశించాలి. తెలంగాణ ఉద్యమం, ఇతర కీలక పరిణామాల్లో ప్రజావేదికలు చాలా ముఖ్య భూమిక పోషించాయి. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వర్తించి భవిష్యత్తును నిర్దేశించే కీలక పరిణామంలో ప్రజలు, మేధోవర్గాల భాగస్వామ్యం కుదించుకుపోవడం విచారకర పరిణామంగా కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News