ఈమెకు ప్రమోషన్ ఇచ్చి కూడా వేస్టయిందా?

ఏ పార్టీలో అయినా ఒక నేత‌కు ప్రమోష‌న్ ఇచ్చి.. మంచి ప‌ద‌వి ఇచ్చారంటే.. దాన‌ర్థం.. మ‌రింత ఎక్కువ‌గా పార్టీని డెవ‌ల‌ప్ చేస్తార‌ని, పార్టీ కోసం ఇంకొంచెం స‌మ‌యం [more]

Update: 2020-08-29 11:00 GMT

ఏ పార్టీలో అయినా ఒక నేత‌కు ప్రమోష‌న్ ఇచ్చి.. మంచి ప‌ద‌వి ఇచ్చారంటే.. దాన‌ర్థం.. మ‌రింత ఎక్కువ‌గా పార్టీని డెవ‌ల‌ప్ చేస్తార‌ని, పార్టీ కోసం ఇంకొంచెం స‌మ‌యం కేటాయిస్తార‌ని, వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించి పార్టీని క‌ష్టకాలంలో ముందుకు తీసుకువెళ్తార‌నే క‌దా..! అధికార పార్టీ వైసీపీలో కూడా అనేక మందికి సీఎం జ‌గ‌న్ గ‌తంలోనూ ఇప్పుడు కూడా ప్రమోష‌న్ ఇచ్చారు. వారంతా పార్టీకోసం ప‌నిచేస్తున్నారు. ప్రమోష‌న్ రాగానే మ‌రింత‌గా పార్టీ కోసం కృషి చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఎంతో మంది యువ‌నేత‌ల‌కు జ‌గ‌న్ ఛాన్స్ ఇవ్వగా ఇప్పుడు వారంతా అహ‌ర‌హం శ్రమిస్తున్నారు. ఇలా అనేక మందికి జ‌గ‌న్ ప్రమోష‌న్ ఇచ్చారు.

మున్సిపల్ ఛైర్ పర్సన్ నుంచి…..

ఇక‌, ప్రతిప‌క్షం టీడీపీలో మాత్రం దీనికి రివ‌ర్స్ కొన‌సాగుతోంది. టీడీపీలో చాలా మంది నేత‌ల‌కు చంద్రబాబు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. పార్టీ అధికారం కోల్పోయినా.. ఆయ‌న కొంద‌రిని ఎంపిక చేసుకుని మ‌రీ వారికి కొన్ని ప‌ద‌వులు ఇచ్చారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లానే తీసుకుంటే.. పాలకొల్లు నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడుకు కోర‌కుండానే అసెంబ్లీలో డిప్యూటీ లీడ‌ర్ ప‌ద‌విని ఇచ్చారు. దీంతో ఆయ‌న త‌న ప‌రిధిలో ఉన్నంత మేర‌కు పార్టీ కోసం కృషి చేస్తున్నారు. కానీ, ఇదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు.. మాజీ రాజ్యస‌భ స‌భ్యురాలు తోట సీతారామ‌ల‌క్ష్మి.. మాత్రం చంద్రబాబు ఆశ‌ల‌కు భిన్నంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో 2005-2010 వ‌ర‌కు భీమ‌వ‌రం మునిసిప‌ల్ చైర్ ప‌ర్సన్‌గా వ్యవ‌హ‌రించారు.

రాజ్యసభకు ప్రమోట్ చేసి….

త‌ర్వాత 2009లోనే తోట సీతారామ‌ల‌క్ష్మికి చంద్రబాబు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యత‌లతో పాటు న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇచ్చారు. ఈ క్రమంలోనే 2014 వ‌ర‌కు ఆమె పార్టీ కోసం ఎంతో క‌ష్టప‌డ్డార‌ని భావించి ఆమెను మ‌రింత‌గా ప్రోత్సహించాల‌నే ఉద్దేశంతో అదే సంవ‌త్సరం తోట సీతారామ‌ల‌క్ష్మిని రాజ్యసభ‌కు పంపారు. ఈ ప్రమోష‌న్‌తో మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో తోట సీతారామ‌ల‌క్ష్మి ప‌ని చేస్తార‌ని భావించారు. అయితే, దీనికి భిన్నంగా ఆమె వ్యవ‌హ‌రిస్తుండ‌డం ఇప్పుడు పార్టీకి శ‌రాఘాతంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో కూడా ఆమె చాలా నిర్వేదంగా వ్యవ‌హ‌రించార‌ని… పార్టీ గెలుపుకోసం ఎంత మాత్రం ప్రచారం చేయ‌లేద‌న్న అభిప్రాయం పార్టీ శ్రేణుల‌కే ఉంది. ఆ ఎన్నిక‌ల్లో త‌న త‌న‌యుడు తోట జ‌గ‌దీశ్‌కు భీమ‌వ‌రం ఎమ్మెల్యే సీటు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టినా బాబు ఇవ్వలేదు.

ఏడాది కాలంగా…..

ఇక ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయాక తోట సీతారామ‌ల‌క్ష్మి మ‌రింత ముభావంగా ఉంటున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. త‌న‌కు బీజేపీ నుంచి ఆహ్వానం అందినా.. వెళ్లలేద‌ని, నిబద్ధత క‌లిగిన నాయ‌కురాలిగా పార్టీలోనే ఉన్నాన‌ని చెప్పుకొంటున్నారే త‌ప్ప పార్టీ కోసం ప‌నిచేయ‌డం లేదు. జిల్లాలో కొంద‌రు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌న్న వాద‌న వినిపిస్తున్నా త‌నకేమీ ప‌ట్టన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీపై అనేక రూపాల్లో ఆందోళ‌న‌లు చేసేందుకు చంద్రబాబు పిలుపు ఇచ్చినా తోట సీతారామ‌ల‌క్ష్మి మాత్రం పార్టిసిపేట్ చేయ‌లేదు. కంచుకోట లాంటి ప‌శ్చిమ టీడీపీని న‌డ‌ప‌క‌లేక ఆమె కాడి కింద‌ప‌డేసిన వాతావ‌ర‌ణ‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఆమెకు ప్రమోష‌న్ ఎందుకు ఇచ్చారా? అని జిల్లా పార్టీ నేత‌లు విమ‌ర్శలు గుప్పిస్తున్నారు.

Tags:    

Similar News