మిషన్ ముమ్మరం చేశారా…?

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ [more]

Update: 2019-07-26 05:00 GMT

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల నేతలను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఆకర్షించేందుకు సుజనా చౌదరికి ప్రత్యేక మిషన్ ను అప్పగించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. అందుకే సుజనా చౌదరికి కాషాయ కండువా కప్పేసి ఆయన కంపెనీల్లో లొసుగుల పరిశోధనకు బ్రేక్ వేసింది కమలం పార్టీ.

ప్రత్యేకంగా అప్పగింతలు…..

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని పార్టీ నేతలకు తీసుకురావాలి. అందులో కమ్మ సామాజిక వర్గం నేతలయితే మరీ మంచిది. ఏ పదవుల్లో ఉన్నా వారిని తీసుకువస్తే సుజనా చౌదరికి భవిష్యత్తులో మంచి పదవులే దక్కే అవకాశముంది. దీంతో సుజనా చౌదరి హస్తిన లో ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు. తనకు పట్టున్న ప్రాంతాల్లో సుజనా చౌదరి టీడీపీ నేతలకు టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.

సుజనాకు అడ్వాంటేజీ అదే….

నారా లోకేష్ యాక్టివ్ కానంత వరకూ తెలుగుదేశం పార్టీలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించేవారు. ఇటీవల జరిగిన ఎన్నికలను మినహాయించి గతంలో జరిగిన రెండు, మూడు ఎన్నికల్లో ఆయనదే ముఖ్య పాత్ర. టిక్కెట్లు ఖరారు విషయంలోనూ సుజనా చౌదరికి చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారంటున్నారు. అదే ఇప్పుడు సుజనా అడ్వాంటేజీ గా మలచుకున్నారంటున్నారు. తనకు పెట్టిన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు సుజనా చౌదరి ప్రతి రోజూ రెండు మూడు గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారని చెబుతున్నారు.

ఆషాఢం తర్వాత….

సుజనా చౌదరి ఎక్కువగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా నేతలపై ఎక్కువగా దృష్టి పెట్టారంటున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువగా కమ్మ సామాజికవర్గం నేతలు టీడీపీలో ఉన్నారు. ఆర్థికంగా బలమైన వారు. వివిధ వ్యాపారాలు ఉండటంతో వీరిని బీజేపీ వైపునకు రప్పించేందుకు సుజనా చౌదరి వేగంగా పావులు కదుపుతున్నారు. ఈ జిల్లాల నుంచి ఇప్పటికే ఐదారుగురు కీలక నేతలు బీజేపీలో జంప్ చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఆషాఢం తర్వాత వీరు కాషాయపార్టీ కండువా కప్పుకోనున్నారు. మొత్తం మీద సుజనా చౌదరి తనకు అప్పగించిన మిషన్ ను పూర్తి చేసి అమిత్ షా, మోదీ లను ఆకట్టుకునే పనిలో ఉన్నారంటున్నారు.

Tags:    

Similar News