తమ్ముళ్లు తోకాడిస్తున్నారుగా

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. చంద్రబాబు మాటే శిరోధార్యం అంటారు. అయితే అదంతా ఒకనాటి మాట. ఇపుడు చంద్రబాబు పదవి పోయిన అమావాస్యచంద్రుడు. అందువల్ల [more]

Update: 2019-10-28 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. చంద్రబాబు మాటే శిరోధార్యం అంటారు. అయితే అదంతా ఒకనాటి మాట. ఇపుడు చంద్రబాబు పదవి పోయిన అమావాస్యచంద్రుడు. అందువల్ల ఆయన ముందే తోకాడించే తమ్ముళ్ళు టీడీపీలో గజానికి ఒకరు కనిపిస్తారు. చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తెలుసు కాబట్టి అవసరం ఉంటే ఆయనే పిలుస్తాడు అని భావించేవారు కూడా ఎక్కువ. ఇపుడు ప్రతిపక్షంలో పార్టీ ఉన్నందువల్ల చంద్రబాబు చెప్పినా వినని మొండిఘటాలు టీడీపీలో చాలానే ఉన్నాయి. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ ఒకరైతే, విశాఖలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న అర్బన్ జిల్లా టీడీపీ మాజీ ప్రెసిడెంట్ వాసుపల్లి గణేష్ కుమార్ ని పేర్కొనాలి. ఈ ఇద్దరూ కూడా సొంత పార్టీ ఆఫీస్ గడప తొక్కరంతే. వారికి అంతటి పట్టుదల, చినబాబు కాదు కదా పెదబాబు చెప్పినా ఈ విషయంలో తలాయించేస్తారు.

బాబుకు షాకే….

ఈ మధ్యన రెండు రోజుల పాటు చంద్రబాబు శ్రీకాకుళంలో జిల్లా పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ ఆఫీస్ లోనే చంద్రబాబు పెట్టిన ఈ సమావేశానికి ససేమిరా రానుపొమ్మన్నారు మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ. బాబు అందులో మీటింగ్ పెడితే నేను రానంతే అనేశారు అయితే ఆయనకు చంద్రబాబుతో గొడవ లేదు. ప్రస్తుత టీడీపీ ప్రెసిడెంట్ గౌతు శిరీషతోనే తగవు అంతా. తాను చమటోడ్చి కష్టపటి టీడీపీకి ఓ స్థలాన్ని సమకూరిస్తే ఆ స్థలాన్ని శిరీష అమ్మేశారని, పైగా పార్టీ పెద్దల అండదండలతో కలసి మరో ఆఫీస్ నిర్మించారని గుండా అలక. తాను సంపాదించిన స్థలాన్ని అమ్మేసుకోవడానికి ఆమె ఎవరు అన్నది కూడా ఆయన బాధ. దీని మీద పెద్ద పంచాయతీ నడిచినా న్యాయం జరగకపోవడంతో ఏకంగా ఆఫీస్ కే ఆయన నమస్కారం అనేశారు. ఇది శిరీష కట్టిన ఆఫీస్. అంతే తప్ప టీడీపీది కాదు అన్నది ఆయన భావన. దాంతో చంద్రబాబు పార్టీ ఆఫీస్ కి వచ్చినా సమీక్షలకు ఈ మాజీ మంత్రి గారు డుమ్మా కొట్టేశారు.

వాసుపల్లి డిటో….

ఇక విశాఖలో ఇదే రకమైన కధ ఉంది. ఎన్నికల ముందు వరకూ అర్బన్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సొంత పార్టీలో తన ప్రత్యర్ధి అయిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రహమాన్ ని ప్రెసిడెంట్ చేయడాన్ని తట్టుకోలేకపోయారు. గంటా శ్రీనివాసరావు వర్గానికి చెందిన ఆయన ప్రెసిడెంట్ గా ఉండడం సహించలేకపోతున్నారని అంటున్నారు. ఇక మరో కధ కూడా ఉంది. 2019 ఎన్నికల్లో తన ఓటమికి రహమాన్ కృషి చేశారని, వెన్నుపోటు పొడిచారని కూడా వాసుపల్లి అనుమానం. దాంతో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నంతవరకూ పార్టీ ఆఫీస్ లో అడుగుపెట్టనని పంతం పట్టారు. దాంతో చంద్రబాబు వచ్చి అదే ఆఫీస్ లో పార్టీ మీటింగు పెట్టినా కూడా వాసుపల్లి వెళ్ళడం మానుకున్నారంటారు. మొత్తం మీద చూసుకుంటే తమ్ముళ్ళు ఇలా తల్లి లాంటి పార్టీ ఆఫీస్ ముఖం చూడకుండా సొంత అజెండాలతో తన్నుకుంటున్నా అధినేత చంద్రబాబు తాపీగా సమీక్షలు నిర్వహించి వెళ్ళిపోవడమే అసలైన విశేషం.

Tags:    

Similar News