ఊరికే వదిలిపెడతారా?

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అమిత్ షాలు తమ శత్రువులను అంత తేలిగ్గా వదలిపెట్టరన్నది రాజకీయాలను ఎరిగిన వారికి తెలిసిన విషయమే. అయితే చంద్రబాబునాయుడు [more]

Update: 2019-08-10 12:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అమిత్ షాలు తమ శత్రువులను అంత తేలిగ్గా వదలిపెట్టరన్నది రాజకీయాలను ఎరిగిన వారికి తెలిసిన విషయమే. అయితే చంద్రబాబునాయుడు విషయంలో వారు ఎన్నికల తర్వాత ఎందుకు సాఫ్ట్ గా ఉన్నారు? వైఎస్ జగన్ పార్టీపై బీజేపీ నేతలు ఎందుకు ధ్వజమెత్తుతున్నారు? చంద్రబాబుతో తిరిగి మిత్రత్వం చేయాలన్నదే మోదీ, షాల ఆలోచనా? అన్న చర్చ ఆంధ్రప్రదేశ్ లో జోరుగా సాగుతోంది. అయితే మోదీ, షాల మనస్తత్వం తెలిసిన వారు ఎవరూ చంద్రబాబుతో మిత్రత్వాన్ని తిరిగి నెరుపుతారని మాత్రం నమ్మడం లేదు.

బాబును దరిచేయనీయమని….

ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నరసరావుపేట బహిరంగ సభలో ప్రకటించారు. చంద్రబాబుకు ఎన్డీఏ దారులు మూసుకుపోయాయని, తిరిగి ఆయన వస్తామన్నా చేర్చుకునేది లేదని ప్రకటించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురిని తమ పార్టీలో చేర్చుకున్నారు అమిత్ షా. దీంతోనే అనుమానాలు బయలుదేరాయి. వీరిలో ముగ్గురు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతోనే చంద్రబాబు పంపించి ఉంటారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.

విలీనం చేసుకున్నారు కాని….

కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే… వారి నలుగురిని పార్టీలో చేర్చుకున్నా రాజ్యసభలో టీడీపీని తమ పార్టీలో విలీనం చేసుకున్నారన్న విష‍యం. ఆ విధంగా మోదీ, షాలు టీడీపీని దెబ్బతీశారంటున్నారు. ఇక మరో అనుమానం ఇటీవల వైఎస్ జగన్ పైనా, సర్కార్ పైనా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబును వదిలేసి జగన్ ను టార్గెట్ గా చేసుకున్నారు. దీనికి కొందరు చెప్పే వాదన ఏంటంటే రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకే అధికార వైసీపీని లక్ష్యంగా చేసుకున్నారన్నది. కానీ ఏపీలో కిందా మీదా పడ్డా బీజేపీ బలపడే అవకాశాలే కన్పించవు. ఏపీలో టీడీపీనేతలను వరసగా చేర్చుకున్నా ఫలితం ఉండదన్నది వారికి తెలియంది కాదు.

సానుభూతి రాకుండా ఉండేందుకేనా?

కాకుంటే ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా మోదీ, షాల తీరుపై అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబు నాయుడిపై కేసులు పెట్టకుండా మోదీ, షాలు వదలరు. ఇది వాస్తవం. అయితే ప్రజల్లో సానుభూతి చంద్రబాబుకు రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే జగన్ సర్కార్ ను తిడుతూ ఉండాలట. ఇలా జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ.. సైలెంట్ గా చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకోవాలన్నది వారి ప్లాన్ గా తమ్ముళ్లకు స్లోగా అర్థమవుతున్నట్లుంది. అందుకే చంద్రబాబు ఇటీవల మోదీకి జగన్ తనపై ఫిర్యాదు చేశారని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా పోరాడతానని వ్యాఖ్యానించారని తమ్ముళ్లు అల్లేసుకుంటున్నారు. మొత్తం మీద ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే.

Tags:    

Similar News