రంగయ్యకు అంత స్ట్రాంగ్ వార్నింగా?
టీడీపీకి కీలక జిల్లాగా ఉన్న అనంతపురంలో గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మినహా వైసీపీ అన్నీ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే, ఈ ఆనందం.. ఆ [more]
టీడీపీకి కీలక జిల్లాగా ఉన్న అనంతపురంలో గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మినహా వైసీపీ అన్నీ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే, ఈ ఆనందం.. ఆ [more]
టీడీపీకి కీలక జిల్లాగా ఉన్న అనంతపురంలో గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మినహా వైసీపీ అన్నీ క్లీన్ స్వీప్ చేసేసింది. అయితే, ఈ ఆనందం.. ఆ పార్టీకి నిలబడే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఎక్కడికక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఆధిపత్య పోరులో తలమునకలై ఉండడమే. నిన్న మొన్నటి వరకు హిందూపురం పార్లమెంటు పరిధిలో వైసీపీ పరిస్థితి చేతులు దాటుతోందనే వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఎంపీ రంగయ్య వర్సెస్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యేల మధ్య కూడా ఇదే తరహాలో కీచులాటలు జరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వివాద రహితుడిగా….
అనంతపురం ఎంపీగా గత ఎన్నికల్లో మాజీ ప్రభుత్వ అధికారి తలారి రంగయ్య విజయం సాధించారు. జిల్లాలు సుదీర్ఘ కాలం ప్రభుత్వ అధికారిగా ఉండడంతో ఆయనకు జిల్లా మొత్తంపై మంచి గ్రిప్ ఉంది. సౌమ్యుడు, వివాద రహితుడుగా ఆయనకు పేరుంది. అంతేకాదు.. అందరితోనూ కలుపుగోలుగా ఉండే నాయకుడికూడా పేరు తెచ్చుకున్నారు. ఇదే ఇప్పుడు తలారి రంగయ్యను వివాదంలోకి లాగిందని అంటున్నారు పరిశీలకులు. ఇక, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్ గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై విజయం సాధించారు.
అసమ్మతి వర్గం సమావేశానికి…
సంపన్న కుటుంబానికి చెందిన ఆమెకు రాజకీయాలు కొత్త.. పైగా ఆమె సాధారణ కార్యకర్తలతో మాట్లాడే పరిస్థితి లేదు. ఆమె ఎక్కువగా నియోజకవర్గంలో కాకుండా.. బెంగళూరులోనే మకాం వేశారని, నియోజకవర్గానికి విజిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారని కూడా తరచుగా ఇక్కడ ఆరోపణలు వైసీపీ కేడర్‌లోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ వర్గం కూడా తయారైంది. అయితే, ఎవరు ఈ వర్గాన్ని లీడ్ చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలియలేదు. ఇదిలావుంటే.. ఎమ్మెల్యే అసమ్మతి వర్గం ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీ రంగయ్యను ఆహ్వానించారు.
తనకు తెలీదని చెప్పినా…..
ఆయన సాధారణంగా ఎవరు పిలిచినా.. కాదనకుండా వస్తున్నారు కనుక.. ఈ నేపథ్యంలో ఇక్కడకు కూడా వచ్చారు. అయితే, సదరు సమావేశం జరిగిన సమయంలో ఉషశ్రీచరణ్.. నియోజకవర్గంలో లేరు. కొన్నాళ్ళకు తిరిగి వచ్చిన తర్వాత.. సదరు సమావేశం విషయం తెలిసింది. దీంతో ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను లేనప్పుడు నా నియోజకవర్గంలో ఎంపీకి ఏం పని ? అయినా.. నాకు అసమ్మతిగా ఉన్న నేతలు పిలిస్తే.. ఆయన రావడమేంటి ? కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వరా ? అని ఆమె రంగయ్యపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. దీంతో తలారి రంగయ్య తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కాలు పెడితే సహించనంటూ ఆమె మాటల యుద్ధానికి కూడ తెరలేపారట.
కమ్యునికేషన్ గ్యాప్ అయినా…..
వాస్తవానికి ఇక్కడ గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయని… ఎమ్మెల్యే ఉషశ్రీకి వ్యతిరేకంగా ఓ వర్గం ఉందని … ఎంపీ తలారి రంగయ్యకు తెలియదని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. అనవసరంగా ఎమ్మెల్యే ఉషశ్రీ.. నోరు పారేసుకుంటున్నారని.. కూడా ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. దీంతోఈ వివాదం చిలికి చిలికి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిపోయింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు గుస్సాగా ఉన్నారు. మరి సీనియర్ నేతలు కలుగజేసుకుని వీరి మధ్య ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్‌ను సరిచేస్తారో… లేదో చూడాలి. లేకుంటే.. ఈ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.