ఆప్ విక్టరీ…ఏపీలో హ్యాపీ

ఎక్కడో దేశ రాజధాని ఢిల్లీలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ ఆప్ విజయం దక్షిణాదిన బలమైన రాష్ట్రంగా ఉన్న ఏపీపైన తీవ్ర ప్రభావం చూపుతుందా అంటే కచ్చితంగా [more]

Update: 2020-02-11 13:30 GMT

ఎక్కడో దేశ రాజధాని ఢిల్లీలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ ఆప్ విజయం దక్షిణాదిన బలమైన రాష్ట్రంగా ఉన్న ఏపీపైన తీవ్ర ప్రభావం చూపుతుందా అంటే కచ్చితంగా అంటున్నారు రాజకీయం తెలిసిన వారు. ఆప్ విజయం, ఎంత ఆపసోపాలు పడినా బీజేపీకి తప్పని పరాజయం ఇపుడు ఏపీలో పెద్ద చర్చకు వస్తున్నాయి. ఏపీలో బీజేపీ గాలి సోకని వాతావరణం ఉంది. బీజేపీని గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పక్కన పెట్టారు. నోటా కంటే తక్కువ సీట్లు ఇచ్చి మూలన‌ కూర్చోబెట్టారు. అయితే బీజేపీ మాత్రం కేంద్రంలో అధికారం అండ చూసుకుని ఏపీలో పెద్దన్న కావాలనుకుంటోంది. దానికి స్థానిక రాజకీయం, రెండు ప్రాంతీయ పార్టీల మధ్య కొట్లాటలు కలగలిపి బీజేపీకి సందు దొరికేలా చేస్తున్నాయి. దాంతో ఏపీలో ఏం చేయాలన్నా తామేనని బీజేపీ గొప్పలు పోతోంది.

వైసీపీకి ఊపిరి….

ఇప్పటికి వరసగా అనేక రాష్ట్రాల్లో దెబ్బ తింటున్న బీజేపీకి ఢిల్లీలో ఓటమి ఘోర పరాభవమే. తామున్న చోటనే కాషాయం కరిగిపోవడం అంటే దారుణమే. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో దెబ్బ తిన్న బీజేపీ ఢిల్లీ మీద కాస్త ఎక్కువ ఆశలే పెట్టుకుంది. పార్లమెంట్ లో ఇక్కడ ఏడింటికి ఏడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. బీజేపీ మొత్తం రాజకీయం అక్కడే కేంద్రీకృతం కావడంతో గెలుపు ఈసారి పక్కా అనుకున్నారు. అయితే అక్కడ ఓటరు గట్టి ఝలక్ ఇచ్చేశారు. ఈ పరిణామంతో కొన్నాళ్ళ పాటు అయినా బీజేపీ గమ్మునుంటుంది. దాంతో ఏపీలో అధికార వైసీపీకి కొంత ఊపిరి వచ్చినట్లే. ఏపీలో జగన్ ని జైలుకు పంపిస్తారని, ఆయన మీద సీబీఐ కేసులను వేగవంతం చేస్తారని వస్తున్న ప్రచారానికి ఇప్పటికైతే బ్రేకులు పడినట్లే.

బాబుకు ఉత్సాహం….

ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి కూడా ఆప్ విజయం కావాలి. బీజేపీకి ఎక్కడా సీన్ లేదని తేలిపోవడమే బాబుకు కావాల్సింది. అలా అయితేనే బీజేపీ బాబు వైపు చూస్తుంది. బాబు ఆసరా కోరుకుంటుంది. అపుడు తన పంట పండుతుందని బాబు ఆలోచన. ఏపీ వరకూ చూసుకుంటే ఇప్పటికీ పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. వరస దెబ్బలతో ఏపీలో ప్రయోగాలకు పోకుండా బుద్ధిగా వచ్చే ఎన్నికల నాటికైనా బీజేపీ తమ గూటికి చేరుతుందని బాబు అంచనా వేసుకుంటున్నారు. ఆ విధంగా అయితే తన చక్రం మరో మారు ఇటు ఏపీలో, అటు ఢిల్లీలో గట్టిగా తిరుగుతుందని బాబు ఆశ.

జనసేన..అంతేనా…?

మోడీ, అమిత్ షా దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు అంటూ ఊదరగొట్టి ఉత్సాహపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనానికి బీజేపీ వరస‌ పరాజయాలు వెక్కిరిస్తున్నాయి. బీజేపీకి జాతీయ స్థాయిలో బలం ఉందని, ఆ వెలుగులో ఏపీలో కొత్త కాంతులు సంతరించుకోవచ్చునని పవన్ అత్యాశ పడుతున్నారు. ఉత్తరాదిన ఉత్త పార్టీగా బీజేపీ మిగిలితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని సగం అయిపోయి నీరసించిపోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదని పవన్ కి కూడా మెల్లగా అర్ధమవుతున్నట్లుగా ఉంది. 2024లో ఏపీలో మాదే అధికారం అని పొత్తు పొడిచిన వేళ గట్టిగా చెప్పిన పవన్ ఢిల్లీలో బీజేపీ ఓటమితో ఇకనైనా సొంత అజెండాకు పదును పెడతారేమో చూడాలి. ఏది ఏమైనా పవన్ 2024 వరకూ బీజేపీతో కలసి ఉంటారని ఎవరూ అనుకోవడంలేదట. ఆఖరుకి బీజేపీ పెద్దలు కూడా. మొత్తానికి ఢీల్లీలో చీపురు పార్టీ బీజేపీకి అక్కడ ఊడ్చేయడం కాదు ఏపీలో ఆ భూతం భయాన్ని కూడా లేకుండా చేసి పారేసిందని అంటున్నారు.

Tags:    

Similar News