రాజకీయ నాయకుల గుండెలు ఎన్నికల లబ్ డబ్ తో కొట్టుకుంటున్నాయి. జనవరి నాటికి ఎన్నికలు జరిపేయవచ్చంటూ తాజాగా సాగుతున్న ప్రచారంతో నాయకులు ఉలికిపడుతున్నారు. ఎన్నికలు కావాలంటూ అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ సర్కారు తన వ్యవధిని తానే కుదించుకుంది. ఈ దెబ్బ ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. డిసెంబరులోపు తెలంగాణకు ఎన్నికలు జరపకపోతే జనవరిలో ఏపీ అసెంబ్లీని కలిపేసి ఎన్నికలకు పోవచ్చనే సూచనలు అందుతున్నాయి. సాంకేతికంగా జనవరి నుంచి ఎప్పుడైనా ఏపీలో ఎన్నికలు జరిపే రాజ్యాంగబద్ధ అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది. 2019 జూన్ నెల మొదటివారానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలవ్యవధి ముగిసిపోతుంది. జనవరిలో ఎన్నికలు జరపడానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఈ లెక్కలే ఇప్పుడు అధికారపార్టీ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. వాస్తవిక కాలవ్యవధి వరకూ అధికారంలో ఉండాలనేది తెలుగుదేశం పార్టీ యోచన. కానీ ఎన్నికల కమిషన్ అంతకాలం కొనసాగిస్తుందన్న నమ్మకం కనిపించడం లేదు. కేంద్రం నుంచి ఈమేరకు ఒత్తిడి ఉందంటున్నారు. లోక్ సభకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోందని సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గడ్, మిజోరం ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ అదృష్ట రేఖలు తారుమారు కావచ్చనే అంచనాలు ఉన్నాయి. అందుకే బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ రాష్ట్రాలతో కలిపి చాలావరకూ ఎన్నికలు జరిపేస్తే బాగుంటుందనే భావనతో ఉన్నారు. ఒడిసా ఈవిషయంలో ఇప్పటికే అంగీకారం తెలిపింది.
ఎంకిపెళ్లి...
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తోనూ, కేంద్రంతోనూ చర్చలు జరుపుతూ ఎన్నికలు ఎప్పుడు పెడతారంటూ ఒత్తిడి పెంచుతోంది. జాతీయ సార్వత్రిక ఎన్నికలతో కలిసి వెళ్లడం కేసీఆర్ కు అస్సలు ఇష్టం లేదు. కమలంతో ఇటీవలికాలంలో స్నేహబాంధవ్యాలు బలపడిన స్థితిలో ఆ ఎఫెక్టు తన పార్టీపై పడుతుందనే ఆందోళనలో ఉన్నారు కేసీఆర్. దానికి పరిష్కారంగా, ప్రత్యామ్నాయంగా ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. ఒకవేళ ఫలితాలు బాగా ఉంటే సాధారణ ఎన్నికల నాటికి బీజేపీతో చెలిమి చేయవచ్చని అనుకుంటున్నారు. ముందస్తు లో సీన్ రివర్స్ అయితే మళ్లీ సార్వత్రిక ఎన్నికల నాటికి పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. లోక్ సభ, శాసనసభ ఎన్నికలు రెండూ ఒకేసారి వస్తే గెలుపైనా , ఓటమైనా దాదాపు ఒకే బాటలో ఉంటుంది. దీనిని తెలంగాణ రాష్ట్రసమితి అధినేత సుతరామూ ఇష్టపడటం లేదు. జాతీయ పార్టీల ప్రభావం తెలంగాణపై పడకుండా నిరోధించాలంటే విడిగా వెళ్లాలని కేసీఆర్ గ్రహించారు. అందువల్లనే కొంత సాహసంతో రిస్కీ ప్రయత్నం చేశారు. తన పార్టీ పనితీరు ద్వారా స్వతంత్రంగా బలం నిరూపించుకునే అవకాశాన్ని తానే స్రుస్టించుకున్నారు. దీనిని సాహసం అని అభివర్ణించడం కంటే ఎత్తుగడ అని చెప్పడమే మేలు. అయితే ఆ ప్రయత్నం నెరవేరుతుందా? లేదా? ఎన్నికల సంఘం కలగాపులగం చేసేస్తుందా? అన్నది వేచి చూడాలి.
ఢిల్లీ బెల్...
దేశంలో భారతీయ జనతాపార్టీకి పరిస్థితులు బాగా లేవని అధిష్టానం గ్రహించింది. ఒకవైపు రాఫెల్ కుంభకోణానికి సంబంధించి రోజురోజుకీ వివాదం ముదిరిపోతోంది. ఇది మరో బోఫోర్స్ కుంభకోణంగా పరిణమించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అంబానీలకు మేలు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఈవిషయంలో ఉదారంగా వ్యవహరించిందన్న సమాచారాన్ని సామాన్యులు అంత తేలికగా తీసుకోరు. పేద,మధ్యతరగతి ప్రజలకు రిలయన్స్ సామ్రాజ్యం పేరు చెబితే చాలు ఏదో జరిగిపోతోందన్న భావన కలుగుతుంది. రాజకీయనాయకులు, కార్పొరేట్ సంస్థలు కుమ్మక్కై దేశాన్ని దోచుకుంటున్నారన్న ఆలోచన కలిగితే చాలు తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయిపోతాయి. రాజీవ్ గాంధీ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి బోఫోర్స్ ప్రధాన కారణంగా నిలిచింది. నిజానికి ఈ కుంభకోణంతో సామాన్య ప్రజలకు పెద్దగా సంబంధం లేకపోయినా అవినీతి చోటు చేసుకుందన్న సంగతిని క్షమించలేకపోయారు. అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతమవుతుందేమోనన్న భయాందోళనలు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీని వెన్నాడుతున్నాయి. దాంతో లోక్ సభను రద్దు చేసి ముందస్తుకు పోవాలనే యోచన పెద్ద ఎత్తున సాగుతోందని హస్తినవర్గాల సమాచారం.
మూడో కోణం...
తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కారు ఒక ఆలోచనతో అసెంబ్లీని రద్దు చేసింది. కేంద్ర వైఫల్యాలు తమపై పడకూడదని భావించింది. జాతీయ పార్టీలతో పోటీ లా కాకుండా ఒక ప్రాంతీయ పార్టీగా తనకు అడ్వాంటేజ్ లభించాలని యోచించింది. కేంద్ర ప్రభుత్వం సైతం మరింతగా ప్రతిష్ఠ దిగజారకుండా ఎన్నికలకు వెళితే లాభం చేకూరుతుందని లేకపోతే పూర్తిగా మునిగిపోవడం ఖాయమని గ్రహించింది. అందులోనూ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాకుండానే లోక్ సభను రద్దు చేయాలనే దిశలో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మరో కోణంలో ఆలోచిస్తోంది. తమ నాయకుడు ప్రజల్లోకి వచ్చి 250 రోజులు దాటిపోయింది. మరో నెలన్నరలోపు పాదయాత్ర ముగిసిపోతుంది. తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రభావం అడుగంటిపోతుంది. అందువల్ల ప్రజల్లో ఉండగానే షెడ్యూలు వస్తే బాగుంటుందని ఆ నాయకులు ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు మినహాయిస్తే మెజార్టీ పార్టీలు ఎన్నికలు వస్తే బాగుంటుందనే భావనలోనే ఉన్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్