పెద్దాయనను ఎందుకు పక్కన పెట్టారు?

వైఎస్ జగన్ తనను నమ్ముకున్న వారికి, తన వెంట ఉన్న వారికి అన్యాయం చేయరు. ఇది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక పెద్దాయన మాత్రం [more]

Update: 2019-10-25 15:30 GMT

వైఎస్ జగన్ తనను నమ్ముకున్న వారికి, తన వెంట ఉన్న వారికి అన్యాయం చేయరు. ఇది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక పెద్దాయన మాత్రం జగన్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా పిలుపు రాకపోవడంతో అసలు పదవి వస్తుందా? రాదా? అన్న అనుమానం ఆ పెద్దాయనలో బయలుదేరింది. ఇంతకీ ఆయన ఎవరంటే పెనుమత్స సాంబశివరాజు. విజయనగరం జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన నేత. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ఉండి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పెనుమత్స సాంబశివరాజు.

సీనియర్ నేతగా…..

విజయనగరం జిల్లా పేరు చెప్పగానే ముందుగానే గుర్తుకు వచ్చేది పెనుమత్స సాంబశివరాజు. ఆయన ఎందరికో రాజకీయ గురువు. చివరకు ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా పెనుమత్స రాజకీయ గురువు. ఎనిమిది సార్లు శానసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించారు. 1967 నుంచి 2004 వరకూ మొత్తం ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘన చరిత్ర పెనుమత్స సాంబశివరాజుకుంది. ఒక్క సతివాడ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి నియోజకవర్గం రద్దయ్యే వరకూ ఒక్కసారి తప్పిస్తే ప్రతి ఎన్నికల్లో గెలిచారు పెనుమత్స సాంబశివరాజు. మంత్రిగా కూడా పనిచేశారు.

వయసు పైబడటంతో…

కాంగ్రెస్ లో ఉన్న పెనుమత్స సాంబశిరాజు 2014 ఎన్నికల్లో వయసు పైబడిన కారణంగా పోటీకి దూరంగా ఉండి తన కుమారుడు పెనుమత్స సూర్యనారాయణరాజును నెలిమర్ల నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. అయితే ఓటమి పాలయ్యారు. అప్పుడు త్రిముఖపోటీ నెలకొని ఉండటంతోనే ఓటమి పాలయ్యామని భావించారు. కానీ 2019 ఎన్నికలల్లో నెలిమర్ల టిక్కెట్ ను తన కుమారుడికే ఇవ్వాలని పెనుమత్స సాంబశివరాజు జగన్ ను కోరారు. తొలుత ప్రామిస్ చేసిన జగన్ టిక్కెట్ల పంపీణీ దగ్గరకు వచ్చే సరికి సమీకరణాలు మారడంతో ఆయన స్థానంలో బడుకొండ అప్పలనాయుడికి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే జగన్ ఈ సందర్భంగా పెనుమత్స సాంబశివరాజుకు ప్రామిస్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు.

గౌరవం ఉన్నప్పటికీ….

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించగానే పార్టీలో చేరిన పెనుమత్స సాంబశివరాజు అంటే వయసు, రాజకీయ అనుభవం కారణంగా జగన్ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇస్తారు. కనీసం ఆ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వలేకపోయానన్నది జగన్ మనసులో ఉందటారు. తన శిష్యుడైన బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండటం, తాను ఎలాంటి పదవి లేకపోవవడంతో పెనుమత్స సాంబశివరాజు తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకుల్లో ఎవరో ఒకరికి పదవి గ్యారంటీ అని వైసీపీ వర్గాలు చెబుతున్నా ఐదు నెలలు గడిచినా ఎలాంటి పదవి రాకపోవడంతో పెనుమత్స వర్గీయులు ఆవేదనతో పాటు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జగన్ పెద్దాయనపై కరుణ చూపిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News