పవన్ కూడా ఊహించలేదట.. అందుకే ఈసారి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఆశలు పెరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన మద్దతుదారులు గెలుపొందడం ఆయనకు మంచి ఊపు నిచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ [more]

Update: 2021-03-06 15:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఆశలు పెరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన మద్దతుదారులు గెలుపొందడం ఆయనకు మంచి ఊపు నిచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ముఖ్యమైన మున్సిపాలిటీలను సొంతం చేసుకుని జనసేన జెండా ఎగురవేయాలని పవన్ కల్యాణ‌్ భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కొన్ని చోట్ల పాల్గొనేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు.

తన ప్రమేయం లేకుండానే…?

పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే పంచాయతీ ఎన్నికలలో జనసేన మద్దతుదారులు తన ప్రమేయం లేకుండానే గెలుపొందడంతో ఇక మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసన మద్దతు దారులు అధిక సంఖ్యలో గెలుపొందారు. రాజోలులో రాపాక వరప్రసాద్ కు షాక్ ఇస్తూ జనసైనికులు చేసిన పోరాటాన్ని ఆయన పదే పదే గుర్తు చేసుకుంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ…..

అందుకే మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందేలా చూసేందుకు నాదెండ్ల మనోహర్ ను రంగంలోకి దించారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాదెండ్ల మనోహర్ పర్యటిస్తూ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పాలకొల్లు మున్సిపాలిటీని కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నారు. తమ సొంత ప్రాంతం కావడంతో పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంలో ప్రచారాన్ని నిర్వహించేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కనీసం పది మున్సిపాలిటీలు టార్గెట్ గా…..

పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ధైర్యంతో జనసేన కార్యకర్తలు పోరాటం చేశారని, ఇదే రకంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని జనసేన పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు బీజేపీ ఓటు బ్యాంకు కూడా కలసి వస్తుండటంతో కొంత సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. మొత్తం 75 మున్సిపాలిటీల్లో కనీసం పది మున్సిపాలిటీలోనైనా జెండా ఎగరవేయాలన్నది పవన్ కల్యాణ‌్ ప్లాన్ గా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News