అందుకే ఇప్పట్లో కనిపించరా ?

పవన్ కళ్యాణ్ అంటేనే యువతకు అదో రకం పూనకం. ఆయన చేసింది పట్టుమని పాతిక సినిమాలు. కానీ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు, పవన్ యూత్ ఐకాన్ [more]

Update: 2020-03-05 03:30 GMT

పవన్ కళ్యాణ్ అంటేనే యువతకు అదో రకం పూనకం. ఆయన చేసింది పట్టుమని పాతిక సినిమాలు. కానీ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు, పవన్ యూత్ ఐకాన్ అయిపోయాడు. ఆ ధీమాతోనే ఆయన జనసేన పార్టీ పెట్టి జనంలోకి వచ్చాడు. యువత ఓట్లేసింది కానీ మిగిలిన వారు సీరియస్ గా తీసుకోకపోవడంతో పవన్ కు ఓటమి తప్పింది కాదు. ఆయన ఎంతో ఆశపెట్టుకున్న ఉత్తరాంధ్రా కూడా ఓడించేసింది. దాంతో పవన్ కల్యాణ్ ఈ వైపుగా రావడమే మానుకున్నారు. గాజువాకలో పార్టీ సమీక్ష చేయడానికి పవన్ కి నాలుగు నెలలు పట్టిందంటేనే ఆయన ఎంతటి డిప్రెషన్ లోకి వెళ్ళారో అర్ధమవుతోంది.

లాంగ్ లాంగ్….

విశాఖలో లాంగ్ మార్చ్ ని పవన్ కల్యాణ్ ఆరు నెలల క్రితం నిర్వహించారు. అదొక్కటే అతి పెద్ద ప్రొగ్రాం ఆ తరువాత పవన్ ని చూసి లాంగ్ లాంగ్ ఎగో అయిందని జనసైనికులు నిట్టూరుస్తున్నారు. పవన్ దర్శన భాగ్యం లేదా అని వాపోతున్నారు. ఇక ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో మీటింగులు ఉంటాయి దానికి పవన్ వస్తారని ఇన్నాళ్ళూ ఆశపడ్డారు. అయితే తన తరఫున నాదెండ్ల మనోహర్ ని పంపించేసి పవన్ తప్పుకున్నారు. ఆయన సినిమా షూటింగుల బిజీలో ఉన్నారని అంటున్నారు. మరో వైపు అది కాదు వేరే కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

బాబుని చూసి…

విశాఖలో చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో గో బ్యాక్ అంటూ బాగానే రచ్చ చేసి వైసీపీ కార్యకర్తలు అటునుంచి అటే విమానంలో తిప్పి పంపారు. బాబు బలమైన నాయకుడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ముమ్మారు సీఎం సీటు ఎక్కిన నేత. జాతీయ స్థాయి స్టేచర్ ఉన్న వాడు. అటువంటి బాబునే రచ్చ చేసి వెనక్కి పంపించిన ఎపిసోడ్ కళ్ళ ముందు ఉండడంతో పవన్ ఎందుకు అనవసరం తలనొప్పి అని మానుకున్నారని అంటున్నారు. ఇప్పటికే కర్నూలు వెళ్ళి అక్కడ నిరసనలు చవిచూసిన పవన్ కల్యాణ్ విశాఖలో కూడా గొడవలు తెచ్చుకుంటే సానుభూతి మాట దేముడెరుగు విశాఖ రాజధానికి తాను వ్యతిరేకిని అన్న బలమైన ముద్ర పడుతుందని భయపడుతున్నారని అంటున్నారు.

వేడి తగ్గాకేనా…?

అందరిలాగానే పవన్ కల్యాణ్ కూడా మూడు రాజధానుల విషయంలో జగన్ వైపే చూస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఎవరెన్ని చెప్పినా జగన్ అనుకున్నది చేస్తారని, ఆయన విశాఖకు రాజధాని తెస్తారని జనసేనలో కూడా ఒక అభిప్రాయం ఉందిట. ఈలోగా అక్కడకు వెళ్తే జనాల పేరిట వైసీపీకి సంజాయిషీ ఇచ్చుకోవాల్సివుంటుందని, అమరావతి అనలేక, జై విశాఖ చెప్పలేక ఎందుకు తలనొప్పి అన్నదే పవన్ విధానంగా ఉందని అంటున్నారు. తాను ఏ ఒక్కప్రాంతానికి వ్యతిరేకినని అనిపించుకోవడం పవన్ కి ఇష్టం లేదని కూడా అంటున్నారు.

వ్యూహమేనా..?

చంద్రబాబు విశాఖ వెళ్ళి ఆ ప్రాంతం వ్యతిరేకిగా ముద్ర పడ్డాని కూడా ఆలోచిస్తున్నారుట. మరో వైపు ఉత్తరాంధ్ర అంటే మునుపటి ఉత్సాహం, ఆసక్తి పవన్ కల్యాణ్ లో తగ్గిందని కూడా చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన వేరే చోట నుంచి పోటీకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. మొత్తం మీద ఈ కారణాలన్నీ కలసి పవన్ కల్యాణ్ ఈ వైపుగా రావడంలేదని టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News