మళ్ళీ బాబు జట్టుకేనా?

పవన్ కళ్యాణ్ రాజకీయం ఎపుడూ అయోమయంగానే ఉంది. ఆయన పార్టీ పెట్టి పోటీ చేయకపోవ‌డం దగ్గర నుంచి 2019 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో రంగంలోకి దూకడం [more]

Update: 2020-02-16 14:30 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయం ఎపుడూ అయోమయంగానే ఉంది. ఆయన పార్టీ పెట్టి పోటీ చేయకపోవ‌డం దగ్గర నుంచి 2019 ఎన్నికల్లో చిత్ర విచిత్ర పొత్తులతో రంగంలోకి దూకడం వరకూ ఒక క్లారిటీ లేకుండాగా కధ సాగుతోందని విశ్లేషణలు ఉన్నాయి. ఓడిపోయిన తరువాత తత్వం బోధపడి పవన్ కల్యాణ‌్ బీజేపీతో పొత్తుకు తయారయ్యారు. అది జరిగి నెల రోజులు కాకుండానే కాషాయం పవన్ ని కషాయం తాగించేస్తోంది. నిజానికి బీజేపీకి పొత్తు కావాలనుకుంటే ఏపీలో రెండు బలమైన పెద్ద పార్టీలు ఉన్నాయి. అందులో టీడీపీ అంటే ఇపుడు బీజేపీకి అసలు గిట్టడంలేదు. ఇక జగన్ ని దగ్గర చేసుకోవడం కోసం వేసిన తెలివైన ఎత్తుగడగా పవన్ కల్యాణ్ తో పొత్తుని చూస్తున్నారు.

ఎర వేసి అలా….

పవన్ కల్యాణ్ తో బీజేపీ పొత్తు వైసీపీలో కలవరం కలిగించిందనే చెప్పాలి. పవన్ వరకూ బలం, అధికారం లేకపోయినా బీజేపీ తోడు అయితే కేంద్రం సాయంతో ఊహించని పరిణామాలు ఏపీలో జరుగుతాయని వైసీపీ పెద్దలు వూహించారు. దాంతో వారు సైతం బీజేపీతో మరింత సాన్నిహిత్యానికి రెడీ అయిపోయారు ఇక బీజేపీ కూడా ఢిల్లీ ఫలితాల దెబ్బతో వైసీపీ వైపు చూసింది. ఇలా రెండు వైపుల నుంచి కలసిన చూపులు ఇపుడు జంట కట్టే దిశగా సాగిపోయాయి. ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకున్నపుడు ఏపీలో బీజేపీ కి కావాల్సింది పవన్ కల్యాణ‌్ కాదని జగన్ అని అర్ధమవుతుంది. జగన్ ని కదిలించడానికి పవన్ కల్యాణ్ పొత్తులను ఎరగా చూపించారని ఢిల్లీ వర్గాల సమాచారం.

ఆటలో అరటిపండుగా …

ఏపీ రాజకీయల్లో పవన్ కల్యాణ్ తీరు ఇపుడు మళ్ళీ అయోమయంలో పడింది. ఆయన మాటలు చూస్తున్నా కూడా బేలతనం కనిపిస్తోంది. అమరావతి రైతులను పరామర్శించినపుడు పవన్ ఎవరు తనతో ఉన్నా లేకున్నా పోరాటం ఆగదని చెప్పడం విశేషం. అంటే బీజేపీ మీద పవన్ ఆశలు దాదాపుగా వదిలేసుకున్నట్లు కనిపిస్తోంది. . బీజేపీకి ఈ విషయంలో మొహమాటాలు ఏవీ లేవు. ఏపీలో అధికార వైసీపీతో కలసి అడుగులు వేస్తుంది. రాజకీయంగా జగన్ అంటే గిట్టని పవన్ కల్యాణ్ కి ఇది ఇబ్బందికరం. దానికి తోడు పొత్తు అంటూ బయటకు గట్టిగా చెప్పుకున్నా మర్యాదలు మన్ననలూ అన్నీ కూడా వైసీపీకే ఉంటాయి. దాంతో బీజేపీ పొమ్మనకుండానే పొగ పెట్టినట్లవుతుంది.

బాబు గూటికే…?

ఈ పరిణామాలు చూసుకున్నపుడు పవన్ కల్యాణ్ మళ్ళీ తన పాత మిత్రుడు చంద్రబాబుతోనే కలసి పోరాటాలు చేయాల్సివస్తుంది. పవన్ ఇలా అయిదేళ్ళలో పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్లుగా అన్ని పార్టీలను చుట్టేసి మళ్ళీ మొదటికే వస్తారన్న విమర్శలు కూడా భరించాల్సివస్తుంది. ఇక టీడీపీ, పవన్ కల్యాణ‌్ కలసినా ఆ జోష్, మునుపటి రాజకీయ దూకుడు రావడం కష్టమేనని అంటున్నారు. అయినా తప్పదు కాబట్టి పవన్ కల్యాణ్ ఆ రూట్లోనే వెళ్తారని అంచనా వేస్తున్నారు. అమరావతి టూర్లో పవన్ ముస్లింల నమాజ్ సందర్భంలో తన ప్రసంగాన్ని ఆపేయడం చూస్తూంటే ఫ్యూచర్లో ఆయన కూడా సీఏఏకు వ్యతిరేకంగా గొంతు సవరిస్తారేమోనని కూడా అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News