ఆ ఇద్దరూ అలా…పవన్ ఇలా

పవన్ కళ్యాణ్ మిగిలిన వారి కంటే తొందరగానే రాజకీయాన్ని వంటబట్టించుకున్నారనే చెప్పాలి. లేకపోతే తనను కాదని దూరం జరుగుతున్న వారిని సైతం దగ్గరకు తీసుకోవాలంటే ఎంతటి విశాలత్వం [more]

Update: 2020-01-11 03:30 GMT

పవన్ కళ్యాణ్ మిగిలిన వారి కంటే తొందరగానే రాజకీయాన్ని వంటబట్టించుకున్నారనే చెప్పాలి. లేకపోతే తనను కాదని దూరం జరుగుతున్న వారిని సైతం దగ్గరకు తీసుకోవాలంటే ఎంతటి విశాలత్వం ఉండాలి. ఎంతగా పెద్ద మనసు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ తాజాగా జిల్లాల వారీగా కమిటీలను ప్రకటిస్తున్నారు. అందులో కొన్ని పేర్లు చూస్తూంటే వారు పొతామంటున్నా పవన్ కళ్యాణ్ వారిని అసలు వదులుకోదలచుకోలేదన్నది అర్ధమవుతోంది. అటువంటి వారిలో విశాఖలో 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఒకరు అయితే, మరొకరు తూర్పు గోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఈ ఇద్దరూ జనసేనలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. వారి కామెంట్స్ కూడా అలా ఉంటూ వచ్చాయి. వారు ఎపుడైనా జారిపోతారని అంతా అనుకుంటున్న వేళ వారికి జనసేనాని పిలిచి మరీ పట్టం కట్టడం అంటే రాజకీయ తెలివిడిగానే భావిస్తున్నారు.

సొంత జెండాతో జేడీ…..

జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన ఆ తరువాత జనసేనలో పెద్దగా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షల్లోనూ ఆయన ఎక్కడా అయిపూ అజా లేరని ప్రచారమూ ఉంది. జనసేన రాజకీయ కమిటీల్లో కూడా జేడీ పేరు లేకపోవడంతో ఆయన దూరం జరిగారని అంతా అనుకున్నారు. మరో వైపు జేడీ బీజేపీ వైపు చూస్తున్నారని టాక్ నడిచింది. అది వర్కౌట్ అయిందో లేదో తెలియదు కానీ జేడీ ఇక తన సొంత జెండా, అజెండాల‌తో స్వచ్చంద సంస్థ ద్వారా ప్రజా కార్యక్రమాల నిర్వహణకు రెడీ అయిపోతున్నారు. అటువంటి జేడీని విశాఖ ఎంపీ సీట్లో ఇంచార్జిగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఆయన పార్టీని ముందుకుతీసుకుపోతారని భావించే ఇలా చేశారని అంటున్నారు.

రాపాక ఇంచార్జిగా…

రాపాకను రాజోలు ఇంచార్జిగా పవన్ నియమించారు. నిజానికి రాపాక మనసు వైసీపీ మీద ఉందని ప్రచారం సాగుతోంది. పైగా ఆయనపవన్ కళ్యాణ్ మీద గట్టిగానే విమర్శలు చేసారు. ఇంగ్లీష్, అమరావతి, మూడు రాజధానుల విషయంలో ఆయన పవన్ తీరుని బాహాటంగానే తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ కి సీఎం అయ్యే ఆలోచన లేదని, పార్టీ పడకేసిందని కూడా ఈ మధ్యనే హాట్ కామెంట్స్ చేసిన రాపాకను ఎటూ పోనీయకుండా జనసేనాని తెలివిగా ఇంచార్జిని చేశారని అంటున్నారు. ఇపుడు రాపాక‌ పార్టీలో ఉంటారా? వెళ్తారా? అన్నది ఆయన ఇష్టం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన్ని బహిష్కరించి ఎమ్మెల్యే సీటుతో సహా బయటకు పంపాలనుకోవడంలేదని తాజా పరిణామాల బట్టి తెలుస్తోంది.

అయిన వారేనా?

జనసేనలో ఉన్న వారిలో చాలా మంది ఎన్నికల తరువాత తట్టా బుట్టా సర్దుకున్నారు. మిగిలిన వారు అలా ఉండిపోయారు. పార్టీ బలం పెరగలేదు, ఉన్న వారికి కూడా వదులుకుంటే వేరే ఆప్షన్ కూడా లేదు. అందువల్లనే వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఇంకా పార్టీలో ఉన్నట్లుగా కనిపిస్తున్న వారందరినీ ఇంచార్జులుగా చేసేశారు. వారు తమ పనితీరు కనబరచి పార్టీని పటిష్టం చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారేమో. ఈలోగా ఉండేవారేవరో తేలితే పార్టీ పరిస్థితి మీద కూడా అంచనా వస్తుందని పవన్ కళ్యాణ్ అలా చేశారని అంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ ని కలిశారన్న ఒకే ఒక కారణంతో తన ఎమ్మెల్యే మద్దాల గిరిని తప్పించి కొత్త ఇంచార్జిని వేసిన బాబు కంటే రాపాక గీత దాటినా ఇంచార్జిగానే ఉంచిన పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం బాగుందని అంటున్నారు. చూడాలి మరి జనసేనకు ఎవరు ఎలా ప్లస్ అవుతారో.

Tags:    

Similar News