నీడలా ఉంటే నీరుగారిపోరా?

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మళ్లీ చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకే రెడీ అయిపోయారు. రాజధాని అమరావతి విష‌యంలో పవన్ కల్యాణ్ పెంచిన స్పీడ్ ఆయ‌న కు కాకుండా ఎవ‌రికో [more]

Update: 2020-01-08 03:30 GMT

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మళ్లీ చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకే రెడీ అయిపోయారు. రాజధాని అమరావతి విష‌యంలో పవన్ కల్యాణ్ పెంచిన స్పీడ్ ఆయ‌న కు కాకుండా ఎవ‌రికో ల‌బ్ధి చేకూరుస్తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిపిస్తోంది. రాజకీయాలంటే సొంత నిర్ణయాలు ఉండాలి. తమకంటూ ప్రత్యేక అజెండా ఉండాలి. కానీ పవన్ కల్యాణ్ కు అదేమీ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ వెంటే ఆయన గత ఆరేళ్లుగా నడుస్తున్నారు. ఇది ఆయనకు లాభం కంటే నష్టమే ఎక్కువ తెచ్చిపెడుతుంది.

ప్రతి అడుగునూ….

పవన్ కల్యాణ్ ప్రతి అడుగునూ చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ‌తంలో రాజ‌ధాని రైతుల కోసం ఉద్యమించింది ప‌వ‌న్ కల్యాణ్. అప్పట్లో చంద్రబాబు ఈ భూముల‌ను బ‌లవంతంగా తీసుకుంటున్నార‌ని ఆయ‌న రోడ్డెక్కారు. అయితే, ఇప్పుడు ఇదే రాజ‌ధానిలో రైతుల‌కు తిరిగి భూములు ఇచ్చేసి.. వారికి ప్లాట్లు కూడా అభివృద్ధి చేసి ఇస్తామ‌ని చెబుతున్న ప్రభుత్వ వాద‌న‌తో ఆయ‌న ఎందుకో ఏకీభ‌వించ‌లేక పోతున్నారు. అదే స‌మ‌యంలో విశాఖ‌లో రాజ‌ధాని ఏర్పాటు చేయాల‌ని తాను గ‌తంలో విశాఖ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లోనే చెప్పాన‌ని అంటున్న ప‌వ‌న్ కల్యాణ్ మ‌రి ఇప్పుడు విశాఖ‌లో పాల‌నా రాజ‌ధానినిఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం చేస్తున్న ప్రయ‌త్నాల‌ను ఎందుకు విమ‌ర్శిస్తున్నారో క్యాడర్ కూ అర్థం కాని పరిస్థితి ఉంది.

ఆవేశ ప్రకటనలు తప్ప….

పవన్ కల్యాణ్ ఆవేశంతో ప్రకటనలు చేస్తారు కాని ఆ తర్వాత మాత్రం దానిపై నిలబడరు. క‌ర్నూలు నుంచి తాను పోటీ చేస్తాన‌ని గ‌తంలో ఒక‌సారి చెప్పారు. అంతేకాదు, క‌ర్నూలు రాజ‌కీయాలంటే త‌న‌కు చాలా ఇష్టమ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అనేక మంది రాజ‌కీయ మిత్రులు కూడా త‌న‌కు సీమలో ఉన్నార‌ని గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో ప‌వ‌న్ కల్యాణ్ తెలిపారు. మరి ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వం క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తానంటూ.. ముందుకు వ‌స్తుంటే.. ప‌వ‌న్ కల్యాణ్ ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు. ఇక‌, తాజాగా అమ‌రావ‌తిలో ప‌ర్యటించిన ప‌వ‌న్‌ కల్యాణ్ త‌న ప్రసంగాల్లో చంద్రబాబును సునిశితంగా విమ‌ర్శించినా.. ఆ విమ‌ర్శలు టీడీపీ నాయ‌కుల‌కు విన‌సొంపుగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

మద్దతుగానే ఉంటూ….

ఇక‌, మూడు రాజ‌ధానుల అంశంపై త‌న స్టాండ్ ను ఆయ‌న చెప్పక‌నే చెప్పినా.. రాజ‌ధానుల విష‌యం రాష్ట్రాల జాబితాలో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించ‌క‌పోవ‌డం ప్రత్యేకంగా చెప్పాల్సిన విష‌యం. మంద‌డంలో చేసిన హ‌డావుడి కానీ, పోలీసుల‌పై చేసిన వాగ్యుద్ధం కానీ.. ప‌వ‌న్‌ కల్యాణ్ కు రాజ‌కీయంగా పెద్దగా ఫ‌లించే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ముందు త‌ను విశాఖ‌, క‌ర్నూలు స‌హా ఇత‌ర ప్రాంతాల అభివృద్ధికి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంద‌నే విష‌యాన్ని స్పష్టం చేసి జ‌గ‌న్ నిర్ణయాన్ని త‌ప్పుప‌డితే ఎవరైనా హ‌ర్షిస్తారు. అలా కాకుండా కేవ‌లం ఓ పార్టీకి మ‌ద్దతుగా ఆయ‌న గ‌ళం విప్పుతున్నార‌నే వాద‌న‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకునే రీతిలోనే ఆయ‌న ప‌ర్యట‌న ఉండ‌డాన్ని మాత్రం జ‌న‌సేన నాయ‌కులే జీర్ణించుకోలేక పోతున్నారు.

Tags:    

Similar News