అంత తేలిగ్గా తీసిపారేస్తారా?

పవన్ కళ్యాణ్ సినిమాటిక్ భాషలో డైలాగులు కొడితే ఆయన ఫ్యాన్స్ కి ఆనందమే కానీ ఆయన ప్రజా జీవితంలో ఉన్న సంగతిని కూడా గుర్తు పెట్టుకోవాలని రాజకీయ [more]

Update: 2019-12-14 11:00 GMT

పవన్ కళ్యాణ్ సినిమాటిక్ భాషలో డైలాగులు కొడితే ఆయన ఫ్యాన్స్ కి ఆనందమే కానీ ఆయన ప్రజా జీవితంలో ఉన్న సంగతిని కూడా గుర్తు పెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పవన్ ఈ మధ్య తరచూ ఒకే మాట అంటున్నారు. వైసీపీ 151 మంది ఎమ్మెల్యే సీట్లను గెలిచింది. అయితే వారు మా ముందు ఎంత అంటూ ఆయన గట్టిగానే అంటున్నారు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటే ఆయన వెనక జనం ఓట్లు, ఆశలు, కోరికలు, బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక ఎమ్మెల్యేని కనీసం లక్షకు తగ్గకుండా ఓట్లు వేసి ప్రజలు గెలిపించుకుంటారు ఆ విధంగా చూసుకుంటే జగన్ పార్టీ తరఫున గెలిచిన 151 ఎమ్మెల్యేలు ఎంత అని పవన్ అంటే కోటిన్నరకు పైగా వారిని అభిమానించి ఓట్లు వేసిన జనం అని కచ్చితంగా చెప్పాల్సిఉంటుంది.

మోడీని అనగలరా…?

ఇదే పవన్ కల్యాణ‌ మీ 303 ఎంపీలు ఎంత అని దేశాన్ని ఏలే ప్రధాని మోడీని అనగలరా అని కూడా మేధావులు ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రతినిధికి గౌరవం ఎందుకు ఇస్తారు అంటే ఆయన వెనక ఓట్లు వేసి గెలిపించిన జనం ఉంటారని. అందుకే మన చట్టస‌భల్లో వారు చట్టాలు చేసేందుకు, ప్రజల కోసం మేలైన కార్యక్రమాలు చేసేందుకు అవకాశం రాజ్యాంగపరంగా లభిస్తాయి. ఇక ఈ పదవులు అన్నీ రాజ్యాంగబద్ధమైనవి. ఎమ్మెల్యే ఎంత ఎంపీ అంత అని ప్రశ్నించుకుంటూ పోవడం ద్వారా మనం రాసుకున్న రాజ్యాంగ వ్యవస్థలనే కించపరచామని అనుకోవాల్సి ఉంటుంది. నిజమే పవన్ కల్యాణ్ కి వైసీపీ ఎమ్మెల్యేల మీద కోపం ఉండొచ్చు. ఆయన్ని కొందరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయవచ్చు. వారికి ఆయన కూడా ప్రతి విమర్శలతో సమాధానం చెప్పవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో ఆయనకు ఉన్న గొప్ప అవకాశమే. దాన్ని మరచి 150 మంది ఎమ్మెల్యేలు ఎంత అంటూ ప్రశ్నించడం అంటే ప్రజాస్వామిక మూలాలనే ఆయన నిలదీస్తున్నట్లుగా ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.

జనసేనకు అలా గుర్తింపు….

నిజానికి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలకు ఓట్ల శాతం బట్టి ఎన్నికల కమిషన్ గుర్తిస్తుంది. ఆ విధంగా ఆరేడు శాతం ఓట్లు తెచ్చుకున జనసేనను ఎన్నికల సంఘం గుర్తించింది అంటే ఆయనకు ఓట్లేసిన జనం వల్లనే కదా అది సాధ్యపడింది. ఈ రోజు పవన్ కల్యాణ్ ఓ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారనుకున్నా, ఆయన ఓడిపోయిన రెండు చోట్లా జనం వేసిన ఓట్లు కూడా ఉన్నాయనే కదా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ ఈ మధ్య రాయలసీమ పర్యటనలో కానీ, తాజగా కాకినాడ రైతు దీక్షలో కానీ ఆ 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత అంటూ చేసిన వ్యాఖ్యలు అంతిమంగా ఆయనకు చేటు తెచ్చేవే తప్ప మేలు చేసేవి కావని కూడా అంటున్నారు.

మెప్పు పొందాలంటే…

ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ప్రజా ప్రతినిధులు, వారు ఎంత వీరు ఎంత అనడం ద్వారా అంతిమంగా ప్రజా తీర్పుని కించపరుస్తున్నారన్న సంకేతాలు పవన్ కల్యాణ్ ఇస్తున్నారని కూడా చెబుతున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ అసహనంతో చేస్తున్న విమర్శలుగానే వీటిని భావించినా ఒక పార్టీ అధినేతగా ఆయన జనం మెప్పు పొందే తీరు మాత్రం ఇది కాదని రాజకీయ పరిశీలకులు సైతం అంటున్న మాట. మరి పవన్ కల్యాణ్ ఇకనైనా తన వైఖరిని మార్చుకుంటారో? లేదో? చూడాలి.

Tags:    

Similar News