గాడిలో పెట్టలేరా? అందుకే భయపడుతున్నారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ని ఎప్పుడు గాడిలో పెడతారు? 175 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను ఎప్పుడు నియమిస్తారు? ఆయన అస్సలు పార్టీని విజయపథాన నడిపించగలరా? [more]

Update: 2021-05-27 14:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ని ఎప్పుడు గాడిలో పెడతారు? 175 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను ఎప్పుడు నియమిస్తారు? ఆయన అస్సలు పార్టీని విజయపథాన నడిపించగలరా? అన్న ప్రశ్న ఆ పార్టీలోనే తలెత్తుతుంది. జనసేన పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కరోనా ను సాకుగా చూపిస్తున్నప్పటికీ, కరోనా ఉధృతి లేని సమయంలోనూ ఆయన పట్టించుకున్నదేమీ లేదంటున్నారు.

ఏడేళ్ల కాలంలో…?

జనసేన పార్టీ ఇరవై ఐదేళ్ల భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకుని పెట్టిందని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతారు. కానీ అందుకు తగిన చర్యలు మాత్రం కన్పించడం లేదు. జనసేన పార్టీ ఆవిర్భవించి ఏడేళ్లు కావస్తుంది. ఈ ఏడేళ్లలో పవన్ కల్యాణ్ చేసిందేమిటన్న ప్రశ్న సహజంగానే ఉదయస్తుంది. ఏ పార్టీ అయినా క్షేత్రస్థాయిలో బలంగా ఉంటేనే ఎన్నికల్లో విజయం దక్కుతుంది. అయితే ఇప్పటి వరకూ క్షేత్రస్థాయిలో జనసేన లేదనే చెప్పాలి.

ఇన్ ఛార్జుల విషయంలో భయమా?

175 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులే ఇప్పటి వరకూ లేరు. తమకు నమ్మకమైన వారిని మాత్రమే కొద్ది నియోజకవర్గాల్లో నియమించారు. అంతకు మించి దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఇన్ ఛార్జులు లేరు. పవన్ కల్యాణ్ ఏదైనా పిలుపు ఇస్తే అప్పటికప్పడు ఆయన అభిమానులు స్పందించి చేయాల్సిందే తప్ప పార్టీకి బాధ్యులు లేరు. పార్టీకి బాధ్యులను నియమించడానికి పవన్ కల్యాణ్ భయపడుతున్నట్లు చెబుతున్నారు.

ఆ రెండు జిల్లాలే….

ఎవరికి ఇన్ ఛార్జి పదవి ఇచ్చినా వారితో తలెత్తే ఇబ్బందులకు పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ భావించడం వల్లనే ఇంతవరకూ బాధ్యులను నియమించలేదు. మరో వైపు బీజేపీతో పొత్తు కూడాఉంది. భవిష్యత్ లో టీడీపీతో కూడా కలిసే అవకాశాలు లేకపోలేదు. బాధ్యులు లేకపోయినందునే జనసేన ఇప్పటీకీ ఆ రెండు జిల్లాలకే పరిమితమయిందన్న విమర్శలున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో పార్టీకి పునాదులే లేవు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో జట్టుకట్టినా ఆయనకు ఎన్ని స్థానాలు ఇస్తారన్న ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి. అయినా పవన్ కల్యాణ్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయడంలేదు.

Tags:    

Similar News