పవన్.. ఇలా మారడానికి కారణమేంటి?

ఎక్కడ ఎర్రన్నలు. ఎక్కడ చెగువెరా. మరెక్కడ హిందూత్వ. రాజకీయాలలో పవన్ కల్యాణ్ బాగా పాపులర్ అయింది చెగువెరా ఫ్యాన్ గానే. అది అభిమాన జనాన్ని కూడా కదిలించింది. [more]

Update: 2020-07-09 06:30 GMT

ఎక్కడ ఎర్రన్నలు. ఎక్కడ చెగువెరా. మరెక్కడ హిందూత్వ. రాజకీయాలలో పవన్ కల్యాణ్ బాగా పాపులర్ అయింది చెగువెరా ఫ్యాన్ గానే. అది అభిమాన జనాన్ని కూడా కదిలించింది. వారు పవన్ కల్యాణ్ చెగువెరా స్టిక్కర్లు పెట్టుకుని వేలం వెర్రిగా తిరిగారు. అదెంత వరకూ వెళ్ళిందంటే ఓ సినిమా ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ అంటే చెగువెరా గుర్తుకువస్తాడు అన్నారు. నిజంగా పుస్తకాలు చదవని చరిత్ర తెలియని ఈనాటి యువతరానికి చెగువెరాను పరిచయం చేసింది మాత్రం అచ్చంగా పవనే. ఎక్కడో క్యూబాలో ఉన్న విప్లవవీరుడు మన గడ్డ మీద పుట్టిన అల్లూరి కన్నా ఫ్యేమస్ అయిపోయాడూ అంటే అది కచ్చితంగా పవన్ కల్యాణ్ గొప్పతనమే. యువత‌ను ఉర్రూతలూగించే మ్యాజిక్ పవన్ లో ఉండబట్టే మన తెలుసు సీమల్లో చెగువెరా స్టిక్కర్లు, ఆయన బొమ్మతో ముద్రించిన టీ షర్టులు అన్నీ కూడా యమ క్రేజీ అయ్యాయి.

వేడుకగా…..

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్తానంలో తొలి పిలుపు చెగువెరా. అలా ఎన్నో మలుపులు తిరిగిన పవన్ కల్యాణ్ ఇపుడు కాషాయధారిగా ఓ కీలక మజిలీ చేస్తున్నారు. అటువంటి వేళ కూడా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అనబడే జనసైనికులు చెగువెరా పుట్టిన రోజు వేడుకలను ఈ మధ్య ఏపీలో అట్టహాసంగా జరిపారు. మా సిద్ధాంతకర్త చెగువెరాయేనని వారు గట్టిగా చాటుకున్నారు. కానీ అప్పటికే బీజేపీతో సావాసం చేస్తున్న పవన్ కల్యాణ్ మాత్రం చెగువెరాను తలవనైనా తలవలేదు. అభిమానులు మాత్రం క్యూబా విప్లవవాదికీ, బీజేపీకి లింక్ పెట్టి మరీ అద్భుతమైన రాజకీయ ప్రయోగం చేసేసారు.

స్వామిజీగా :

పీఠాధిపతులూ, స్వామీజీలు సాధారణంగా చాతుర్మాస దీక్షలు చేస్తారు. మిగిలిన వారు చేయకూడదని లేదు కానీ సంసారిక బంధాల్లో వ్యాపకాల్లో పడి నిష్టగా చేయలేరు. అటువంటిది ఒక సినీ సెలిబ్రిటీగా ఉంటూ రాజకీయ నేతగా చురుకుగా ఉంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ చేయాలనుకోవడం విశేషమే. ఏకభుక్తం, నేల మీద శయనం, స్త్రీ సాంగత్యానికి దూరం వంటి కఠిన నియమాలు ఇందులో ఉన్నాయి. పవన్ కల్యాణ్ సడెన్ గా ఇంతటి గట్టి దీక్షను చేపట్టడం ఆశ్చర్యపరచేదే. మామూలు జీవితం సాగించేవారే ఈ నియమాలను చూసి జడుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ తన‌లో ఈ కోణం కూడా ఉందని చెప్పుకున్నారు. పైగా కరోనా విముక్తి కోసం సర్వ జనుల శ్రేయస్సు కోసం ఈ దీక్ష అని కూడా జనసైనికులు చెప్పుకొచ్చారు.

వీరతాడే…..

నిజానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం నిండుగా ఉన్న నాయకులు ఎవరూ కూడా ఇటువంటి దీక్షలు చేపట్టలేదు. బీజేపీ హిందూత్వ అంటూ నినదించడమే తప్ప కఠినంగా వాటిని పాటించే నాయకులు కూడా ఇప్పటి బీజేపీలో అరుదు. అయితే వారికి కాషాయ ముద్ర గట్టిగా ఉంది కాబట్టి చెల్లిపోతోంది. కానీ చెగువెరా నుంచి ఎర్రన్న దోస్తీ నుంచి, మాయావతి బీఎస్పీ సిధ్ధాంతాల నుంచి బీజేపీ వడిలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం సిధ్ధాంత శీల పరీక్ష చేసుకోవాల్సిందే. అందుకే ఆయన మాటలు గత ఆరు నెలలుగా మారుతూ వచ్చాయి. బీజేపీ గుడులూ, భక్తుల చుట్టూ తిరిగుతూ ఆ పడికట్టునే పవన్ కల్యాణ్ అనుసరిస్తున్నారు. ఇపుడు ఏకంగా ఆచరణలో కూడా తాను అపర హిందూత్వ ప్రతిరూపమని చెప్పుకోవడానికి ఈ చాతుర్మాస దీక్షలకు కూర్చున్నారని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఎవరేమనుకున్నా పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయాలను బాగా అర్ధం చేసుకున్నారు. రోమ్ లో ఉన్నపుడు రోమన్ గా ఉండాలనే అనుకుంటున్నారు. అందుకే బీఎస్పీ మాయావతికి మొక్కిన చేతులతోనే మోడీ ది గ్రేట్ అనగలిగారు. వారికి దండం పెడుతూనే వారు అంతకంటే బలంగా నమ్మే హిందూత్వకు ప్రణామం అంటున్నారు. ఇది నిజంగా పవన్ కల్యాణ్ రాజకీయ వ్యక్తిగత జీవితానికి మేలి మలుపుగానే చూడాలి.

Tags:    

Similar News