బీజేపీని లైట్ తీసుకున్న పవన్ ?

పవన్ కళ్యాణ్ కి మెల్లగా రాజకీయాలు అర్ధమవుతున్నాయి. అవును ప్రజారాజ్యం పుట్టుకతో ఆయన 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ అనుభవం బాగానే వచ్చింది. అయితే [more]

Update: 2021-04-17 14:30 GMT

పవన్ కళ్యాణ్ కి మెల్లగా రాజకీయాలు అర్ధమవుతున్నాయి. అవును ప్రజారాజ్యం పుట్టుకతో ఆయన 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ అనుభవం బాగానే వచ్చింది. అయితే ఎంతైనా సినిమా నటుడు కావడం, రాజకీయాలను బుర్రలో పూర్తిగా పెట్టుకోకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆయన బలహీనతలను ఆసరాగా తీసుకుని పలు పార్టీలు తమ రాజకీయ పబ్బాన్ని కూడా ఇప్పటిదాకా గడుపుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అన్న బీజేపీ ప్రచారం వల్ల ఏపీ రాజకీయాల్లో పెద్దగా ప్రకంపనలు అయితే పుట్టలేదు.

గమ‌నించారా….?

మరో వైపు చూస్తే సోషల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున సెటైర్లు పడిపోయాయి. ఏపీలో ఒక్క సీటూ లేని ఒక పార్టీ రెండు సీట్లలో ఓడిన ఒకాయనకు సీఎం సీటు ఆఫర్ చేయడం కంటే మిలీనియం జోక్ వేరేది ఉంటుందా అంటూ కామెంట్స్ కూడా పడ్డాయి. మొత్తానికి ఇవన్నీ పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా గమనించారో లేక తన సన్నిహితులతో కూడా చర్చించుకున్నారో కానీ బీజేపీ వేసినది బిస్కెట్ అని బాగానే అర్ధం చేసుకున్నారు. అందుకే ఆయన ఎక్కడ జవాబు చెప్పాలో అక్కడే చెప్పి కమలనాధులకే షాక్ ఇచ్చేశారు.

అదే పెద్ద పదవి….

తనను కోట్లాది మంది ప్రజానీకం అభిమానించి సినీ లోకంలో తిరుగులేని పవర్ స్టార్ ని చేశారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. తనకు ఆ పదవి కంటే వేరే ఉన్నతమైన పదవి ఉంటుందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మిత్రపక్షాన్ని ఉద్దేశించి మాత్రమే అనుకోవాలి. తనను పదవుల మీద వ్యామోహం లేదని కూడా ఆయన పాత మాటను మరోసారి వల్లె వేస్తున్నారు కూడా. సీఎం అంటే పవన్ కళ్యాణ్ పొంగిపోయి బీజేపీ చంకనెక్కుతారని ఆ పార్టీ వారు ఆశించిన దానికీ పవన్ చెప్పిన జవాబుతో గొంతులో వెలక్కాయ పడినట్లు అయిందనే చెప్పాలి. ఎందుకంటే లేని పదవితో కొత్త ఆశలు పెట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్న బీజేపీకి అలా పవర్ స్టార్ గట్టిగానే రిటార్ట్ ఇచ్చేశారు అనుకోవాలి.

సొంత రాజకీయమే..?

మొత్తానికి అన్ని పార్టీలతో పవన్ కళ్యాణ్ పొత్తులు పూర్తి అయ్యాయి. వారి ఎత్తులు కూడా తెలిసాయని జనసేనలో వినిపిస్తున్న మాట. ఏ పార్టీ అయినా పవన్ ఓట్ల కోసమే ఆయన వెంట పడుతోంది తప్ప పవన్ కళ్యాణ్ కి మేలు చేసేది లేదన్నదాని మీద కూడా జనసైనికులు మధనపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ముందు తన పార్టీ సొంత బలాన్ని పెంచుకోవాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆయన ఇక మీదట పార్టీకి కొన్ని రోజులు కేటాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లొ తిరిగి పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. తాను బలంగా ఉంటేనే ఏపీలో రాజకీయం కలసివస్తుందని మొత్తానికి ఇన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ గుర్తించారు అన్నది జనసేనలో వినిపిస్తోంది. దీంతో జనసైనికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారుట.

Tags:    

Similar News