జగన్ ని పవన్ కలిస్తే.. ఇలానే ఉంటుందా?

రాజకీయ తెరపైన కూడా కొన్ని చూడాలని అందరికీ ఉంటుంది. అవి జరుగుతాయో జరగవో అని కూడా డౌట్లు ఉంటాయి. వెండి తెర మీద మల్టీ స్టారర్ మూవీస్ [more]

Update: 2021-02-02 05:00 GMT

రాజకీయ తెరపైన కూడా కొన్ని చూడాలని అందరికీ ఉంటుంది. అవి జరుగుతాయో జరగవో అని కూడా డౌట్లు ఉంటాయి. వెండి తెర మీద మల్టీ స్టారర్ మూవీస్ కొందరితో అసలు కుదరవు. అలాగే రాజకీయాల్లోనూ కొందరు నాయకులు ఎపుడూ ముఖా ముఖీ కలవరు అని ఎవరైనా చెప్పేయవచ్చు. అలాంటి నాయకులుగా అటు ముఖ్యమంత్రి జగన్, ఇటు జనసేన సారధి పవన్ ఉంటారు. జగన్ అంటే పవన్ కి అసలు పడదు అంటారు. ఏడేళ్ల పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంలో మెయిన్ టార్గెట్ జగనే నని సగటు జనం కూడా నమ్మేలా ఆయన విమర్శలు ఉంటూ వచ్చాయి.

మారుతున్న సేనాని….

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెమ్మదిగా మారుతున్నారు. రాజకీయంగా కూడా రాటుతేలుతున్నారు. ఆయన తన మీద పడిన ముద్రలను ఒక్కోటిగా తొలగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా ఆయన తాజా పోకడలను బట్టి తెలుస్తోంది. పవన్ అంటే చంద్రబాబు మనిషి అని వైసీపీ ఒక ముద్ర వేసింది. దానికి బలం చేకూర్చేలా ఎప్పటికపుడు పవన్ కూడా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక రాజకీయ గండరగండడు చంద్రబాబు కూడా తన నీడ నుంచి పవన్ కల్యాణ్ ముందుకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలాంటి వేళ పవన్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి అడ్డుగా ఉన్నవేంటి అన్నవి ఇపుడు గమనిస్తున్నారు. వాటిని దూరం చేసుకోవడానికి చూస్తున్నారు.

జగన్ తో భేటీకి రెడీ ….

పవన్ కల్యాణ్ తాజాగా ఒక సంచలన ప్రకటనే చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ముఖ్యమంత్రి జగన్ ని కలుస్తాను అంటున్నారు. ముఖ్యమంత్రిని నేరుగా కలవడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా పవన్ అంటున్నారు. మీడియా ముఖంగా సమస్యలు చెబితే అంతగా సర్కార్ పెద్దలకు ఎక్కకపోవచ్చునని, కానీ నేరుగా కలిసి చెబితే వేగంగా పరిష్కారానికి అవకాశాలు ఉంటాయని పవన్ కల్యాణ్ విశ్లేషిస్తున్నారు. తనకు ముఖ్యమంత్రులను కలవడం కొత్తేమీ కాదని, గతంలో ప్రజా సమస్యల మీద చంద్రబాబుని తరచూ కలిశాను అంటూ ఆయన చెప్పుకున్నారు. జగన్ని కలవడానికి తనకు అభ్యంతరం ఏమీ ఉండదని కూడా పవన్ కల్యాణ్ అంటున్నారు. నిజంగా పవన్ లో ఈ మార్పు మాత్రం అనూహ్యమైనదే. పవన్ రాజకీయానికి ఇది ఉపయోగపడేదే.

అరుదైనదేనా…?

చంద్రబాబు అంటే సీనియర్ పొలిటీషియన్ అని పవన్ కల్యాణ్ తరచూ కితాబు ఇచ్చేవారు ఆయన గెలుపునకు కూడా దోహదం చేశారు జగన్ సీఎం కాకూడదు, కానివ్వను అని కూడా 2019 ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ బీకరమైన శపధం కూడా చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ని గుర్తించను అని మొదట్లో ఇదే పవన్ అన్నారు. అయితే ఇపుడు ఆయన మాటల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ని గౌరవిస్తాను, ఆయన అందరికీ నాయకుడు అని కూడా మాట్లాడుతున్నారు. ఇక విపక్ష నేతగా పవన్ జగన్ ని కలవడానికి ఎపుడూ అవకాశం ఉంటుంది. దాన్ని వినియోగించుకుని జగన్ తో భేటీ వేయడానికి పవన్ రెడీ అయితే మాత్రం అది ఏపీ రాజకీయాల్లో అరుదైన సన్నివేశమే అంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన మీద జగన్ వ్యతిరేక ముద్రను తొలగించుకుంటే రేపటి రోజున ఆ వైపు నుంచి కూడా సానుకూల ఓట్లు జనసేనకు టర్న్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే చంద్రబాబు ముద్ర నుంచి బయటపడాలన్నా జగన్ తో పవన్ కల్యాణ్ భేటీ కచ్చితంగా ఉపయోగపడుతుంది. మొత్తానికి జగన్ పవన్ భేటీ అయితే మాత్రం అది తెలుగు చానళ్ళ టీయార్పీ రేటింగుని అమాంతం పెంచేసే హాట్ న్యూసే అవుతుంది అనడంలో నో డౌట్.

Tags:    

Similar News