కాంగ్రెస్ టూల్ మాత్రమేనా..??

Update: 2018-11-22 15:30 GMT

రాజకీయంగా గట్టి పరీక్షే. రెండు వైపులా యుద్దం చేయాలి. ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఆసక్తులు కాపాడుకోవాలి. పార్టీ అధినేతగా పొరుగు రాష్ట్రంలో పార్టీని బతికించుకోవాలి. కత్తిమీద సాము చేస్తూ రక్తి కట్టించాలి. చంద్రబాబు నాయుడు తాజాగా ఎదుర్కొంటున్న విషమసమస్య ఇదే. కాంగ్రెసుతో కలిసినప్పుడు పార్టీ శ్రేణులను ఏదో విధంగా ఒప్పించగలిగారు. ఇంకా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ రాజకీయ అవసరాలు, అనివార్యతలను బాగానే వివరించగలిగారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పార్టీ ముందుకెళ్లాలంటే కాంగ్రెసు చేయి పుచ్చుకోవాల్సిందేనని అనేక సందర్భాల్లో తేల్చి చెప్పేశారు. ఇంకా ప్రజలకు, పార్టీ క్యాడర్ కు ప్రతిసందర్భంలోనూ నొక్కి చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ నామమాత్రంగా మారిపోయిన స్థితిలో పోటీదారు పాత్ర నుంచి తప్పుకుంది. ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీయే కాబట్టి రాజకీయంగా చేతులు కలిపేందుకు టీడీపీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. దీనిని సమర్థంగా వినియోగించుకుంటూ జాతీయ స్థాయిలో తన రోల్ పెంచుకునేందుకు కాంగ్రెసు పార్టీని సైతం ఒక పావుగా మార్చుకోగలిగారు చంద్రబాబు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతోనే ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. అదీ టీఆర్ఎస్ అధినేత విమర్శల చురుకు అమరావతిని తాకుతోంది.

ద్విపాత్రాభినయం...

హైదరాబాదు నుంచి పరిపాలన కేంద్రాన్ని అమరావతికి మార్చిన తర్వాత సాధ్యమైనంతవరకూ తెలంగాణ వ్యవహారాలకు చంద్రబాబు దూరంగా ఉంటూ వస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు స్వేచ్ఛగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేక పార్టీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరించి పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని సంతోషించారు. తెలంగాణ సెంటిమెంటు కారణంగా అధినాయకత్వం బ్యాలెన్సుడ్ గా ఉండటమే మేలని తలపోశారు. అయితే రేవంత్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత సమీకరణల్లో కొంత మార్పులు వచ్చాయి. కొంచెం యాక్టివ్ గా ఉండే నాయకులను ఆయన తనవెంట తీసుకుని వెళ్లి పోయారు. పార్టీ కొంతమేరకు నిస్తేజంగా మారింది. అంతకుముందే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కుప్పకూలింది. ఎంతోకొంత బలముందనుకుంటున్న హైదరాబాదులోనే పార్టీ తీవ్రంగా దెబ్బతినడం అధినాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది. అందుకే కాంగ్రెసుతో కలిసి వెళ్లడమే ఈ ఎన్నికల్లో శ్రేయోదాయకమనే నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు. రాష్ట్ర విభజన కారణంగా రెండు ప్రాంతాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవం. నీళ్లు, ఆస్తుల పంపకాలు, ఉద్యోగ విభజన వంటి విషయాల్లో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాలను పోరాడి సాధించాలి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా తెలంగాణలో పార్టీకి భవిష్యత్తునివ్వాలి. ద్విపాత్రాభినయం తప్పని సరి బాధ్యతగా రూపుదాల్చింది.

గత వైభవం అండగా...

చంద్రబాబు నాయుడినే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెసు నాయకుల సామర్ధ్యలోపం పై ఆరోపణలు చేసినప్పటికీ , రాష్ట్ర విభజనకు ఆ పార్టీయే కారణం. అందువల్ల ప్రజల్లో కాంగ్రెసు పట్ల కొంత సానుభూతి ఉంటుంది. హస్తినలో సీట్లు కేటాయింపులు జరుగుతాయి. సీల్డు కవర్ లోనే సీఎం ను నిర్ణయిస్తారు. ఇవన్నీ హేతుబద్ధమైన విమర్శలే. కానీ అదే హస్తినలోనే రాష్ట్రవిభజనకు బీజాలు పడ్డాయి. ఆపార్టీయే చొరవ తీసుకుని, సాహసించి రాష్ట్రాన్ని సాకారం చేసింది. ఆ కోణంలో చూసినప్పుడు కాంగ్రెసు నాయకులపై చేసే విమర్శలకు పదును తగ్గిపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడిని ముందు వరసలో చూపిస్తూ విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు కేసీఆర్. చంద్రబాబు నాయుడి చేతిలో కాంగ్రెసు టూల్ గా మారిపోతుంది. అమరావతిలోనే నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్రప్రయోజనాలు దెబ్బతింటాయి. కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రాపాలకుల పరం చేయడమా? అంటూ తీవ్రస్థాయిలో మరోసారి సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీని కంపల్షరీ ఆప్షన్ గా మార్చాలనేది టీఆర్ఎస్ అధినేత ఆలోచన. ప్రతికూలతలు ఉన్నప్పటికీ, సైబరాబాద్ నిర్మాణంలో పాత్ర, హైదరాబాదును ప్రపంచ చిత్రపటంలో కాస్మొపాలిటిన్ నగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకు అడ్వాంటేజ్ కలిగిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర విభజనకు లేఖ సైతం అందచేశారు. వీటన్నిటినీ చూపించడం ద్వారా కేసీఆర్ విమర్శలనుంచి రక్షణ కవచం నిర్మించుకోవాలని టీడీపీ భావిస్తోంది.

హస్తవాసితో మేలు....

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో అసెంబ్లీ సీట్లకు ఈసారి పోటీ చేస్తోంది. గతంలోనూ బీజేపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ లతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ గౌరవప్రదమైన సీట్లనే పొందుతుండేది. పెద్దన్న పాత్ర పోషించేది. ఈసారి ఒక చిన్న మిత్రపక్షంగా మిగిలిపోయింది. 2014లో 15 సీట్లు సాధించింది. మరో 14 స్థానాల్లో రెండో పెద్ద పార్టీగా నిలిచింది. అదంతా గతవైభవంగా మిగిలిపోయిన పరిస్థితి. 14 సీట్లకు కాంగ్రెసు ఒప్పుకున్నప్పటికీ మరో రెండు స్థానాలను కుదించుకోవాల్సి వచ్చింది. ఒంటరిగా వెళితేనే గౌరవం దక్కేదన్న భావన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. అదే జరిగితే చాలా చోట్ల డిపాజిట్లు రావు. ఒక్కసీటైనా గెలుస్తామన్న గ్యారంటీ లేదని అధిష్ఠానమే సర్ది చెప్పింది. కొన్ని జిల్లాల్లో పార్టీ ఉనికే లేకుండా పోయింది. పోటీలో కూటమి అభ్యర్థులకు వంతగా నిలవడం తప్ప పార్టీ అభ్యర్థులు బరిలో లేరు. అయినప్పటికీ పార్టీ బతికి బట్టకట్టాలంటే కాంగ్రెసుతో కలవకతప్పదని చంద్రబాబు తేల్చేశారు. తెలంగాణ దృష్టి కోణంతో ఆయన చూడటం లేదు. ఇక్కడి కలయికను జాతీయంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే పాత్రకు పునాదిగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి అధినేతకు ఇది మరింత చికాకు కలిగిస్తోంది. తాను సైతం జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు కాంగ్రెసును అడ్డుపెట్టుకుని తెలంగాణపై సైతం కొంతమేరకు పట్టు సాధించాలని చూడటమే కేసీఆర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News